తెలంగాణచౌక్, జూన్ 12 : టోల్ ట్యాక్సీ పేరుతో పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని సీపీఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కరీంనగర్ బస్టేషన్ ఆవరణలో జిల్లా కమిటీ సభ్యులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బస్సు చార్జీలతోపాటు విద్యార్థుల పాసుల ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేద, మధ్య తరగతి ప్రజల మీద భారం పడుతుందన్నారు. పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదాలున్నాయన్నారు.
ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ పేదల రవాణా వ్యవస్థ అని, చార్జీలను పెంచడం అన్యాయమని మండిపడ్డారు. ఆర్టీసీకి టోల్ టాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని కేంద్రంతో చర్చించాలన్నారు. చార్జీలను తగ్గించకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో పార్టీ జిల్లా కార్యదర్శి కార్యవర్గ సభ్యుడు గీట్ల ముకుందరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్, నాయకులు తిరుపతినాయక్, మల్లయ్య, సాయికుమార్ పాల్గొన్నారు.