Minimum facilities | కోల్ సిటీ, ఆగస్టు 20: కనీస వసతులు లేకపోయినా ఏ ప్రజాప్రతినిధికి పట్టింపు లేదా… ఇక్కడి ప్రజలు ఎలా బతుకుతున్నారో అని కూడా కన్నెత్తి చూడరా..? అంటూ సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మెండె శ్రీనివాస్ ప్రశ్నించారు. రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని కేసీఆర్ కాలనీ, సాయినగర్, ఆర్టీసీ కాలనీ తదితర ఏరియాలలో బుధవారం డివిజన్ బాట పట్టారు. ఆయా ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కనీస రోడ్లు లేకపోవడం, పారిశుధ్యం అస్తవ్యస్థంగా ఉండటంతో ఇన్నాళ్లు ఏలా ఉంటున్నారని ప్రశ్నించారు.
అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఈ ప్రాంతంను స్థానిక ప్రజాప్రతినిధి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రామగుండం నగర పాలక సంస్థకు ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్సులు అధిక మొత్తంలో ఈ ప్రాంతం నుంచి సమకూరుతున్నా ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. పాలకులు ఇప్పటికైనా స్పందించి ఈ డివిజన్లో నూతన రోడ్లు, మంచినీరు, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డివిజన్ ప్రజలతో సీపీఎం పక్షాన ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఆరిపల్లి రాజమౌళి, రాజేశ్వర చారి. నంది నారాయణ, కాలనీ వాసులు బాలయ్య, జంపయ్య, అస్లాం, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.