local body elections | చిగురుమామిడి,ఏప్రిల్ 19: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని రేకొండ, ఓగులాపూర్, రామంచ, ముదిమాణిక్యం, సుందరగిరి, ముల్కనూర్ గ్రామాల్లో సీపీఐ గ్రామ శాఖల మహాసభలు శనివారం జరిగాయి.
ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా చాడ వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న కాన్పూర్ లో ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీకి వందేళ్ల ఉద్యమ చరిత్ర ఉందని, అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించి ఎన్నో విజయాలు సాధించినదని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ బలోపేతం కోసం మండలంలోని సీపీఐ శ్రేణులు పట్టుదలతో కృషి చేయాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో అత్యధిక సర్పంచులు, ఎంపీటీసీ స్థానాలతో పాటు, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని, అందుకు నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు,పోరాటాలు నిర్వహించి గత వైభవాన్ని తీసుకురావాలని పార్టీ శ్రేణులకు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
ఈ మహాసభల్లో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, మాజీ జడ్పీటీసీ అందె స్వామి, బోయిని అశోక్, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కాంతాల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు అందె చిన్న స్వామి, చాడ శ్రీధర్ రెడ్డి, బోయిని పటేల్, ముద్రకోల రాజయ్య, బూడిద సదాశివ, మాజీ మండల కార్యదర్శి తేరాల సత్యనారాయణ, రైతు సంఘం మండల అధ్యక్షులు కోమటిరెడ్డి జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.