రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించి నేతన్నలకు ఉపాధి కల్పించాలని సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేతన్నలు చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరెల తయారీతో నేతన్నలకు ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయన్నారు.
ఒకప్పుడు తయారైన వస్ర్తాలు ప్రైవేటు వాళ్ల చేతులోకి వెళ్లడంతో వస్త్ర పరిశ్రమ పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఆర్డర్లపైనే ఆధార పడిందని, తద్వారా రూ.కోట్ల వస్త్ర విలువైన ఉత్పత్తులు రూ.లక్షల్లో పడిపోయాయన్నారు. ప్రభుత్వం వస్త్ర పరిశ్రమను రాజకీయ కోణంలో చూడకుండా నేతన్నల ఉపాధిని దృష్టిలో పెట్టుకుని వెంటనే ఆర్డర్లు ఇచ్చి అండగా నిలువాలని కోరారు. నేతన్నల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ యథాతథంగా కొనసాగించాలని కోరారు.
మరమగ్గాలకు ఇస్తున్న విద్యుత్ నాలుగో కేటగిరీ నుంచి మూడో కేటగిరీలోకి మార్చడం వల్ల యూనిట్ ధర రూ.2 నుంచి రూ.8.50కు పెరిగిందన్నారు. ఇది ఆసాములకు మోయలేని భారగంగా మారిందని తెలిపారు. కార్మికులు కోరుతున్న విధంగా 10 హెచ్‌పీల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నారు. ఆయన వెంట లాల్‌బావుటా పవర్‌లూం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పంతం రవి, సీపీఐ నాయకులు గుంటి వేణు, జేఏసీ నాయకులు తాటిపాముల దామోదర్, వెల్దండి దేవదాస్, ఎనుగుల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.