Ramagundam Baldia | కోల్ సిటీ, ఆగస్టు 23: ప్రజారోగ్యంపై రామగుండం నగర పాలక సంస్థ అధికారులకు ఏమాత్రం పట్టింపు లేదని, ప్రతీ డివిజన్ లో పారిశుధ్యం అస్తవ్యస్థంగా తయారైందని, విష జ్వరాలతో ప్రజలు అవస్థలు పడుతున్నా అధికారుల్లో చలనం లేదని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్ మండిపడ్డారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా చేపట్టారు.
బల్దియా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ లో మురికి కాలువలు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయనీ, వంద రోజుల ప్రణాళిక కేవలం మొక్కుబడిగా ఫొటోలు దిగడం వరకే సరిపోతుందని వాపోయారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్పితే ఏలాంటి ప్రయోజనం లేదని ఆరోపించారు. కంటి తుడుపుగా డివిజన్లు సందర్శించి అప్పటికప్పుడు కాలువల్లో పూడికతీసి ఫొటోలు దిగి వెళ్తున్నారనీ, తర్వాత ఆ డివిజన్ వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదన్నారు.
కొద్ది రోజులుగా ప్రతీ డివిజన్లో దోమల బెడద అధికమై విష జ్వర పీడితుల సంఖ్య పెరుగుతుందన్నారు. ప్రజారోగ్యంపై అలసత్వం వీడి పారిశుధ్యంను మెరుగుపర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఈసంపల్లి రాజేందర్, పుల్లూరి నాగభూషణం, గూడూరి వైకుంఠం, కల్వల రాయమల్లు. రాజేశ్వర్, చిలుక రాజు, శ్రీనివాస్, ఊడిగమ్మ, స్వరూప, స్పందన, రమ, దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.