Chada Venkata Reddy | చిగురుమామిడి, ఏప్రిల్ 30 : చిగురుమామిడి మండలంలో రుణమాఫీ కానీ రైతులతో కలిసి రైతు వేదికలో వ్యవసాయ అధికారి రాజులనాయుడు వద్ద గ్రామాల వారిగా రుణమాఫీ కానీ రైతుల వివరాలను సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి బుధవారం అడిగి తెలుసుకున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో అర్హులైన రైతులకు ఇంకా రుణమాఫీ రాలేదని అన్నారు. మండలంలో 9,588 మంది రైతులు రుణాలు తీసుకుంటే, కేవలం 5,864 మంది రైతులకు రుణమాఫీ అయిందని అన్నారు.
3,724 మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాకపోవడం పట్ల వెంకటరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అర్హులైన వారికి రుణమాఫీ పూర్తిగా మంజూరు చేయాలని అన్నారు. మంజూరు కానీ రుణమాఫీ రైతుల జాబితాను వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని చాడ పేర్కొన్నారు. రుణమాఫీ రాని రైతులకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. ఇటు తేల్చుకోలేని పరిస్థితిలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చాడ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులు రైతుల సహకరించాలని కోరారు.
వీరి వెంట సీపీఐ మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి సింగల్ విండో డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి, మాజీ కార్యదర్శి తేరాల సత్యనారాయణ, రైతులు ఉన్నారు. అనంతరం రేకొండ గ్రామంలో సీపీఐ సీనియర్ నాయకుడు అప్పాల ఐలయ్య మృతి చెందగా వారికి చాడ నివాళులర్పించారు. పార్టీకి చేసిన సేవలను చాడ గుర్తు చేసుకున్నారు. సీపీఐ అండగా ఉంటుందని వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు.