మానకొండూర్ రూ రల్/ కరీంనగర్ విద్యానగర్, మే 13 : సంతోషంగా పెళ్లికి వెళ్లొస్తుండగా.. అనుకోని ప్రమా దం వెంటాడింది. తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సును కారు ఎదురుగా ఢీకొని అక్కడికక్కడే ఇద్దరు ప్రాణాలు గాల్లో కలువడం విషాదం నింపింది. ఈ ఘటనలో భర్త చనిపోగా, భార్య పరిస్థితి విషమంగా ఉండడం కలిచివేసింది. మానకొండూర్ సీఐ శ్రీలత వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లాకు చెందిన గజభీంకర్ రాజు (50), సుమతి దంపతులు. సుమతి తన చెల్లె కొడుకు పెళ్లి బుధవారం వరంగల్‌లో ఉండగా, వెళ్లేందుకు మంచిర్యాలకు చెందిన డ్రైవర్ లుక్మాన్ ఖలీద్ (50) కారు మాట్లాడుకున్నారు. తమ బంధువులు జూపాక ఉమ, కోయల్కర్ వరప్రసాద్‌తో కలిసి ఉదయం వెళ్లారు. అక్కడ బంధువులతో సరదాగా గడిపారు. సాయంత్రం తర్వాత సంతోషంగా తిరిగి పెద్దపల్లికి పయనమయ్యారు. రాత్రి 8.45 గంటల సమయంలో మానకొండూర్ మండలం ఖాదర్‌గూడెం శివారుకు చేరుకున్నారు.
ఇదే సమయంలో వరంగల్ వైపు వెళ్తున్న నిజామాబాద్ జిల్లా బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఎదురుగా ఢీకొన్నారు. దీంతో ముందు సీట్లో కూర్చున్న రాజు, కారు డ్రైవర్ లుక్మాన్ ఖలీద్ అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో కూర్చున్న సుమతి, ఉమ, వరప్రసాద్ గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే మానకొండూర్ సీఐ శ్రీలత తన సిబ్బందితో హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకొని, సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 వాహనంలో కరీంనగర్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సుమతి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. మృతదేహాలను కూడా కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన మార్చురీకి తరలించగా, వారి కుటుంబసభ్యులు, బంధువులు అక్కడకు చేరుకొని బోరున విలపించారు.