theft in Gangadhar | గంగాధర, అక్టోబర్ 8: వృద్ధ దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు మత్తుమందు చల్లి వారి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన సంఘటన గంగాధర మండలంలో కలకలం సృష్టించింది. స్థానికుల కథనం మేరకు గంగాధర మండలం గర్షకుర్తి గ్రామానికి చెందిన గజ్జల శంకరయ్య (66), ఇతని భార్య గజ్జల లక్ష్మి. శంకరయ్య చేనేత కార్మికుడిగా పనిచేస్తుండగా, లక్ష్మీ బీడీ వర్కర్ గా పనిచేస్తుంది. వీరికి పిల్లలు లేరు. మంగళవారం రోజున సాయంత్రం 5:30 సమయంలో శంకరయ్య ఇంటి పక్క వారు చూడగా వాటర్ ట్యాంక్ దగ్గర శంకరయ్య సృహ లేని స్థితిలో పడి ఉన్నాడు. అతడి భార్య వంటగదిలో సృహ తప్పి పడి ఉంది. దీంతో పక్కింటివారు చుట్టుపక్కల వారికి సమాచారం ఇవ్వగా గ్రామస్తులు అందరూ వచ్చి చూశారు.
గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఇద్దరు దంపతులపై మత్తుమందు చల్లినట్టు, లక్ష్మీ మెడలో ఉన్న మంగళసూత్రం కనిపించలేదని గ్రామస్తులు తెలిపారు. మంగళవారం ఉదయం శంకరయ్య బోటి కూర తెచ్చుకొని ఇంటి ముందు వాటర్ ట్యాంక్ దగ్గర దానిని శుభ్రం చేసుకుంటూ కనిపించాడని, అక్కడే పడిపోవడంతో ఉదయం పూటనే మత్తుమందు చల్లి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 7:30 గంటల వరకు కూడా దంపతులిద్దరూ సృహలోకి రాకపోవడంతో గ్రామస్తులు అంబులెన్స్ లో కరీంనగర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు, 24 గంటలు గడిస్తే తప్ప ఏ విషయము చెప్పలేమని ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు గ్రామస్తులు తెలిపారు.
ఉదయం పూట పడిపోయిన వృద్ధ దంపతులు సాయంత్రం వరకు కూడా సృహలోకి రాకపోవడంతో ఏదో బలమైన మత్తుమందు చల్లి ఉంటారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేజర్ గ్రామపంచాయతీ, జనం అటు ఇటు తిరుగుతుండగా ఉదయం పూటనే గుర్తుతెలియని వ్యక్తులు వృద్ధ దంపతులపై మత్తుమందు జల్లి చోరీకి పాల్పడడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎస్సై వంశీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.