పాలకుర్తి, మార్చి 17 : ఇటీవలే సొంతిల్లు కట్టుకున్నారు.. గృహప్రవేశం కూడా చేశారు.. తొమ్మిది రోజుల క్రితమే అందులోకి షిఫ్ట్ అయ్యారు.. అంతలోనే అనుకోని రీతిలో ఆ దంపతులు మృత్యు ఒడికి చేరారు. హైదరాబాద్‌లో తన తమ్ముడి గృహప్రవేశానికి భార్యతో కలిసి వెళ్లొస్తుండగా కారు అదుపుతప్పి ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తనను కరీంనగర్లో దించిన రెండుగంటల్లోనే ఈ ఘటన జరగడంతో ఆ కూతురు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. మంచిరాల జిల్లా భీమారం మండలంలోని పోతన్పల్లికి చెందిన ఎడ్ల శ్రీనివాస్ (45), రజిత (40) దంపతులు ఇటీవలే మంచిర్యాల జిల్లాకేంద్రంలోని కొత్త ఇల్లు కట్టుకున్నారు. మూడు నెలల క్రితం గృహప్రవేశం చేశారు.
తొమ్మిది రోజుల క్రితం నుంచే కొత్తింట్లో ఉంటున్నారు. శ్రీనివాస్ లయన్స్ క్లబ్, క్రెడాయి సభ్యుడిగా ఉన్నాడు. రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాడు. హైదరాబాద్‌లో ఉంటున్న తన తమ్ముడు ఎడ్ల రమేశ్ గృహప్రవేశం ఈ నెల 15న ఉండడంతో శనివారం తన భార్యను తీసుకొని ఇంటి నుంచి కారులో బయలు దేరాడు. మార్గమధ్యలో కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ తృతీయసంవత్సరం చదువుతున్న ఒక్కగానొక్క కూతురు రిషితను వెంట తీసుకెళ్లాడు. ఆదివారం కార్యక్రమం ఉండగా హైదరాబాద్‌లోనే ఉండి, సోమవారం రాత్రి 8గంటల తర్వాత భార్యా కూతురుతో కలిసి కారు (ఏపీ01ఎన్ 3335)లో మంచిర్యాలకు తిరుగు పయనమయ్యాడు.
కరీంనగర్లో కూతురు రిషితను దింపి, మంచిర్యాలకు బయలుదేరాడు. తెల్లవారుజామున 3గంటల సమయంలో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని బసంత్‌నగర్ బస్టాండ్ దాటిన తర్వాత కారు అదుపుతప్పి కల్వర్టును వేగంగా ఢీకొట్టింది. దీంతో దంపతులిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే నిద్రమత్తులో ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది. విషయం తెలుసుకున్న బసంత్‌నగర్ ఎస్ఐ నూతి శ్రీధర్, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి, మృతదేహాలను పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానకు పంపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను మంచిర్యాలకు తీసుకెళ్లారు. మహాప్రస్తానంలో అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీనివాస్, రజిత దంపతుల కూతురు రిషిత ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్టు బసంత్‌నగర్ ఎస్ఐ నూతి శ్రీధర్ తెలిపారు.