
Vemulawada | వేములవాడ, సెప్టెంబర్ 24 : 34నెలల నుండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరును చూసిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకే కౌంట్ డౌన్ ప్రారంభించారని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గం ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి సభ తర్వాత ఆది శ్రీనివాస్ కేటీఆర్ కౌంట్ డౌన్ ప్రారంభమవుతుందని మాట్లాడిన వాఖ్యాలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వేములవాడలోని ఆయన నివాసంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒకవైపు ఎలినో ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా వారికి కావాల్సిన సాగునీరు, విద్యుత్, ఎరువులు లాంటి ప్రధాన అవసరాల సమస్యలను గాలికి వదిలేసి ఫామ్ హౌస్ చుట్టూ తిరిగితే ఏమి వస్తుందని అన్నారు. భూమిని నమ్ముకొని వేసిన పంటను దక్కించుకోవడానికి రైతులు అష్ట కష్టాలు పడుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాహనాల్లో విహారయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. వేములవాడ నియోజకవర్గంలోనూ అనేక గ్రామాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు. ఎత్తిపోతల ద్వారా నియోజకవర్గంలో రైతులకు సాగునీరు అందివ్వాలని డిమాండ్ చేశారు.
ఇప్పటివరకు మూడేళ్ల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మల్కాపేట రిజర్వాయర్ ను ఒక్క టీఎంసీ మాత్రమే నింపిందని అన్నారు. మధ్య మానేరు జలాశయంలో 24 టీఎంసీల నీరు నిలువ ఉందని మూడు టీఎంసీల సామర్థ్యం ఉన్న మల్కపేటకు నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడో ఇక్కడో కాస్త పంట వేసుకొని దక్కించుకుందామని రైతులు నానా పాటలు పడుతుంటే యూరియా అని కూడా జిల్లాను యూనిట్ గా చేసి అందిస్తున్నారని మండిపడ్డారు. అసలు జిల్లా యూనిట్ గా చేయడం వల్ల వేములవాడ శాత్రాజ్ పల్లి రైతుకు వీర్నపల్లిలో ఒకటి, గంభీరావుపేటలో ఇంకొక బస్తా వస్తే ఎట్లా తెచ్చుకుంటారనే ఇంగిత జ్ఞానం లేని నాయకులు కేటీఆర్ ను విమర్శిస్తున్నారా అంటూ మండిపడ్డారు. మండలాన్ని ఒక యూనిట్ గా చేస్తే ఆ రెండు బస్తాలైన తీసుకోవచ్చునని కనీస పరిజ్ఞానం లేని దిక్కుమాలిన ప్రభుత్వం అని అన్నారు. గడిచిన యాసంగిలో అష్ట కష్టాలు పడి రైతులు పంటలు పండించుకుంటే కనీసం పంట కొనుగోలు చేయకుండా రైతులను అరిగోసపెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్థాయిని మించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగిలోని అభివృద్ధికి దిక్కు లేదని విమర్శించారు. 30 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపడితే ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదని చిత్రాలను చూపారు. ఇక సాక్షాత్తు డిజిపితో పోలీస్ స్టేషన్ భవనం కడుతున్నానని ప్రారంభిస్తే పనులకు అతిగతి లేదన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టి, ఏడ్చి తుడిస్తే, చచ్చిపోతా అంటే ప్రజలు దయతలిచి ఓట్లు వేస్తే గెలిచిన ఆది శ్రీనివాస్ కెసిఆర్ కేటీఆర్ ను విమర్శించే అంత స్థాయి లేదని మరోసారి మండిపడ్డారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో శివుడుతో ఆటలు ఆడ వద్దని హితో పలికారు. ప్రణాళిక ముందు చూపు లేని పనులతో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులలో ఉందన్నారు. భక్తుల మనోభావాలను కాపాడాల్సింది పోయి పనులు చేపడుతూ మళ్లీ గర్భగుడి శిఖరం తగ్గిపోతుంది పెంచుతామని స్వామీజీ అనుమతి కోసం వెళ్లడమే చిత్తశుద్ధి లేని పనులకు నిదర్శనం అని అన్నారు. అభివృద్ధి పేరు చెప్పుకొని ఇప్పటివరకు విమానాలు, కార్లు వేసుకొని తిరిగిన ఖర్చే స్వామివారిపై 30 లక్షల దాకా భారం వేసారని ఆరోపించారు. రాజన్న ఆలయ అభివృద్ధిపై ప్రజల్లోకి వెళ్లి అడుగుదామా అని ప్రశ్నించారు. సిమెంటు కట్టడాలు ముందుచూపు లేని పనులతో ప్రజలకు నీ పనితనం తెలిసిందని విమర్శించారు.
సిరిసిల్ల కేటీఆర్ అడ్డా..!
సిరిసిల్లలో కేటీఆర్ కౌంట్ డౌన్ ప్రారంభం కావడం కాదు లక్ష మందితో మీరు సభ నిర్వహిస్తే వచ్చే ఎన్నికల్లో లక్ష మెజారిటీతో గెలుస్తారని చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి నీ కండ్లకు కనిపించడం లేదా అని విమర్శించారు. వైద్య కళాశాల, వ్యవసాయ కళాశాల, నర్సింగ్ కళాశాల, జేఎన్టీయూ, అపరిల్ పార్క్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.. ఒకసారి కండ్లు తెరిచి చూడండి అంటూ హితవు పలికారు. ఇంకో రెండేళ్లు మాత్రమే మీకు సమయం ఉందని ఇప్పటికైనా నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి వారి ఆలోచిస్తే బాగుంటుందని మరోసారి కేటీఆర్ ను విమర్శిస్తే ఊరుకునేది హెచ్చరించారు. ఈ సమావేశంలో వేములవాడ రూరల్ పార్టీ మండల అధ్యక్షుడు గోస్కుల రవి, నాయకులు రామతీర్థపు రాజు, ఏశ తిరుపతి, క్రాంతి కుమార్, గడ్డం హనుమాన్లు, నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి రామచందర్, గోలి మహేష్, మారం కుమార్, గూడూరి మధు, రేగుల రాజేశం, శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్, గుడిసె సదానందం, కనకరాజు యాదవ్, పెద్దిరాజు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.