పత్తి చేన్లు దిగుబడి లేక తెల్లబోతున్నాయి. వాతావరణ పరిస్థితులు రైతులను కుంగదీస్తున్నాయి. సీజన్ ప్రారంభంలో పడిన వర్షాలను చూసి మంచి దిగుబడి వస్తుందని ఆశపడినా.. ఎడతెరిపి లేకుండా పడిన ముసురుతో పంటలు దెబ్బతిని నిరాశే మిగిల్చింది. ఆపసోపాలు పడుతూ వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటను కాపాడుకున్నా ఫలితం లేకపోయింది. అయితే పూత, కాత దశ రాగానే దిగుబడిపై కలలుకనగా, దసరా ముందు వర్షాలు ముఖం చాటేయడం, వాతావరణంలో మార్పులు రావడంతో పూత, పిందె రాలిపోయింది. చేను ఎర్రబడి, బెందడి రోగం రావడంతో దిగుబడి పడిపోయింది. మూడు దశల్లో పత్తి తీయాల్సి ఉండగా, ఒకటి, రెండు సార్లకే చేన్లు లూటీ అవుతున్నాయి. జనవరి వరకు పత్తితో కళకళలాడాల్సిన చేన్లు నవంబర్లోనే బోసిపోతున్నాయి.
కోనరావుపేట, నవంబర్ 15: మద్దతు ధర గతేడాది కంటే వెయ్యి పెరగడంతో ఈ యేడాది రైతులు పత్తి సాగువైపు ఆసక్తి చూపారు. ఆరంభంలో పత్తి విత్తనాల ధరలు పెరిగినా ఉత్సాహంగా సాగుచేశారు. ఒక రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాల్లో 42,332 ఎకరాలు వేశారు. దుక్కి దున్నింది మొదలు, పత్తిని మార్కెట్ తరలించే వరకు ఎకరాకు 35 వేల నుంచి 45 వేల వరకు పెట్టుబడి పెట్టారు. వర్షాలు కూడా సమృద్ధిగా పడడంతో ఎకరాకు 12 నుంచి 16 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశపడ్డారు. కానీ, వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం ఎకరాకు 4 నుంచి 6 క్వింటాళ్లే వస్తుండడంతో నిరాశ చెందుతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని, అప్పులే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దక్కని మద్దతు
సాధారణంగా మార్కెట్లో పంట ఉత్పత్తి తక్కువగా ఉంటే పంటకు డిమాండ్ ఉంటుంది. కానీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పత్తి దిగుబడి తక్కువగా ఉన్నా మార్కెట్లో ధర లేని పరిస్థితి నెలకొన్నది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం కల్పించిన 7521 మద్ధతు ధర కూడా దక్కడం లేదు. నాణ్యతలేమి, తేమశాతం అనే కొర్రీలతో వ్యాపారులు క్వింటాల్‌కు 6500 నుంచి 7వేలలోపే ధర చెల్లిస్తున్నారు. ప్రభుత్వం సీసీఐని రంగంలోకి దించినప్పటికీ కూడా రైతులకు ప్రయోజనం కలుగడం లేదు. దీంతో గ్రామాల్లో దళారులు చెప్పిన ధరకే పత్తిని విక్రయిస్తూ నష్టాలపాలవుతున్నారు. దీంతో దూది రైతుకు దు:ఖమే మిగులుతోంది.
కౌలు రైతు కుదేలు
పత్తిసాగుతో రైతుల పరిస్థితి పూర్తిగా దయనీయంగా మారింది. భూమి ఉన్న రైతులు ఒక ఎకరాకు 15 వేల నుంచి 25 వేల వరకు నష్టపోగా, కౌలు రైతులు రెట్టింపు నష్టపోతున్నారు. ఎకరాకు 45 వేల వరకు పెట్టుబడి పెట్టడంతోపాటు భూ యజమానికి ఎకరాకు 15వేల నుంచి 16 వేల వరకు కౌలు చెల్లించారు. దీంతో ఎకరాకు 30వేల నుంచి 40వేల వరకు నష్టాల్లో కూరుకుపోతున్నారు.
పెట్టుబడి కూడా కష్టమే..
ఈసారి పత్తిలో పెట్టుబడి రావడమే కష్టంగా మారింది. నేను రెండు, మూడేళ్ల సంది భూమిని కౌలుకు తీసుకుని పత్తి పంట సాగుచేస్తున్న. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యేడాది వర్షాలు సకాలంలో కురియక తీవ్రంగా నష్టపోయిన. నాకున్న రెండు ఎకరాలతోపాటు మరో ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకుని, ఎకరాకు 16 వేలను ముందుగానే కౌలు చెల్లించిన. ఆరంభంలో పత్తి మంచిగానే మొలకెత్తి మొక్కలు ఎదిగినా దసరా తర్వాత పూత, కాత దశలో వర్షం లేకుండా పోయింది. దీంతో పొడి వాతావరణంతో ఎర్ర బెందడి రోగం వచ్చి మొక్కలకు ఉన్న పూత రాలిపోయింది. దీంతో మొక్కకు 70 నుంచి 100 కాయలు ఉంటాయని అనుకున్న. కానీ, 20 నుంచి 30 కాయలు కూడా కాయలేదు. ఇగ మొదటిసారి కూలీలకు 350 చెల్లించి పత్తి ఏరిపిస్తే ఏడు ఎకరాలకు 10 క్వింటాళ్ల పత్తి వచ్చింది. పత్తి తడిగా ఉండడంతో వెంటనే అమ్మిన. 6200 మాత్రమే ధర పలికింది. రెండోసారి మరో 15 క్వింటాళ్ల పత్తి వచ్చింది. మొత్తంగా కౌలు డబ్బులతోపాటు పెట్టుబడి కూడా నష్టపోయిన.
– దావేర దేవయ్య, రైతు, మామిడిపల్లి (కోనరావుపేట)
నిండా ముంచింది
పత్తి సాగు ఈ యేడాది కౌలు రైతులను నిండా ముంచింది. నాకున్న భూమిలో ఎకరన్నరతో పాటు మరో ఎనిమిది ఎకరాల భూమిని ఎకరాకు 10 వేలు చెల్లించి కౌలుకు తీసుకుని పత్తి పంట వేసిన. ఆరంభంలో వర్షాలు సమృద్ధిగానే కురిసినప్పటికీ పంట దిగుబడి బాగానే వస్తదని అనుకున్న. కానీ, ముసురు పడడంతో పంట ఎదుగుదల నిలిచిపోయింది. క్రమ పద్ధతిలో ఎరువులు వాడి ఒక దశకు తీసుకురాగా పూత, కాత దశలో వర్షాలు కురవడంతో పూతంతా రాలిపోయింది. దీంతో మూడు సార్లు ఏరాల్సిన పత్తి మొదటిసారికే పంట చేను బోసిపోయింది. తొమ్మిదిన్నర ఎకరాలకు ఇప్పటివరకు 25 క్వింటాళ్లే వచ్చింది. మరో 10 నుంచి 15 క్వింటాళ్లు వస్తది కావచ్చు. దిగుబడి తక్కువే అయినా కనీస మద్దతు ధర దక్కలేదు. దీంతో ఈ యేడాది తీవ్రంగా నష్టపోయిన.
– కాసర్ల ఏదిరెడ్డి, కౌలు రైతు, కనగర్తి (కోనరావుపేట)
కాత లేదు.. దిగుబడి లేదు
నేను రెండెకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి పంటను సాగుచేసిన. ఈసారే పత్తి విత్తనాల రేటు, ఎరువుల రేట్లు పెరిగినా వెనకాడకుండా నాణ్యమైన వాటిని తీసుకువచ్చి వేసిన. ముసురుతో వానలు పడడంతో పంట ఆశించిన స్థాయిలో రాలేదు. పంటంతా ఎర్రబడి పోయి, మొక్క ఆకురాల్చడం, కాత, పూత నిలిచిపోయింది. దీంతో పది క్వింటాళ్ల పత్తి కూడా దిగుబడి రాలే. మార్కెట్లో కూడా మద్దతు ధర కూడా రాకపోవడంతో ఎకరాకు 30వేల వరకు నష్టపోయిన.
– అల్లూరి తిరుపతిరెడ్డి, యువరైతు, మూడపల్లి (చందుర్తి)