జిన్నింగ్ మిల్లులు మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి. పత్తి రైతులను అందినకాడికి దోచుకుంటున్నాయి. అగ్గువకే పత్తిని కొంటూ అడ్డగోలు దోపిడీ చేస్తున్నాయి. అండగా నిలువాల్సిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నామమాత్రపు కొనుగోళ్లకే పరిమితం కావడం మిల్లుల యజమానులకు కలిసి వస్తున్నది. అకాల వర్షాలు, అనుకూలించని వాతావరణ పరిస్థితులతో ఈసారి భారీగా దిగుబడి తగ్గి నష్టపోతున్న రైతు, చివరకు పంటను అమ్ముకోవడానికి సైతం అరిగోస పడాల్సిన దుస్థితి నెలకొన్నది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తెగనమ్ముకోవాల్సి వస్తున్నది. ఇంత జరుగుతున్నా అధికాయంత్రాగం పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పత్తి కొనుగోళ్లు, విక్రయాలపై ప్రత్యేక దృష్టిసారించి, రైతులను ముంచుతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తికి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు 7,521 చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. ఉమ్మడి జిల్లాలో మాత్రం ఆ ధర మచ్చుకైనా కనిపించడం లేదు. తేమ శాతం తగినంత లేదని, నాణ్యత లోపించందని, రంగు మారిందని, గింజ పొడువు సరిగా లేదని రకరకాల కొర్రీలు పెడుతూ.. పత్తిని కొనేందుకు సీసీఐ నిరాకరిస్తున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 12 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు ప్రకటించారు. అందులో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని జిన్నింగ్ మిల్లులు, ఇతర ప్రాంతాలు కలిపి మూడు చోట్ల కేంద్రాలు ఉన్నాయని చెబుతున్నారు. అలాగే జమ్మికుంట మార్కెట్ పరిధిలో 7, చొప్పదండి, గోపాల్రావుపేట మార్కెట్ పరిధిలో ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. మెజార్టీ కేంద్రాలు ఆయా జిన్నింగ్ మిల్లుల్లోనే ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేస్తున్నారు. అయితే గడిచిన వారం రోజుల్లో ఈ 12 కేంద్రాల ద్వారా సీసీఐ కొన్న పత్తి మొత్తం 106 క్వింటాళ్లు మాత్రమే. అంటే సీసీఐ పనితీరు ఎలా ఉందో చెప్పడానికి కొనుగోళ్లే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
సీసీఐ కేంద్రాల ప్రారంభం కేవలం పేపర్‌పైనే కనిపిస్తున్నది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నది. సవాలక్ష కారణాలు చూపుతూ పత్తి కొనడం లేదు. మద్దతు ధరకు కొనాలని రైతులు కోరుతున్నా ఏ మాత్రం పట్టించుకోడం లేదు. దీంతో రైతులు సదరు పత్తిని ఇంట్లో పెట్టుకోలేక.. ధర వచ్చే వరకు నిల్వచేసుకునే సామర్థ్యం లేక తెగనమ్ముతున్నారు. ఇదే అదునుగా కొంత మంది జిన్నింగ్ మిల్లుల యజమానులు దోపిడీకి పాల్పడుతున్నారు. మద్దతు ధర క్వింటాల్‌కు 7,521 కాగా, మెజార్టీ చోట్ల కేవలం 6,200కే కొనుగోలు చేస్తున్నారు. కొన్ని చోట్ల అందులోనూ కోతలు పెడుతున్నారు. మరికొందరైతే 6100 కూడా చెల్లించడానికి తిప్పలు పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. నిజానికి పక్కనే ఉన్న వరంగల్ జిల్లాలో మంగళవారం క్వింటాల్ పత్తిని 6800తో కొనగా, కరీంనగర్ జిల్లాలో మాత్రం కొంత మంది జిన్నింగ్ మిల్లులు యజమానులు కేవలం 6,200తో కొనుగోలు చేశారు. అంటే ఒక్కో క్వింటాల్‌పై ఎంతలా దోపిడీ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పత్తి విక్రయాల ఆరంభం నుంచి నేటి వరకు ఇదే దందా కొనసాగుతుంది. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో విక్రయిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే అకాల వర్షాలు, అనుకూలించని వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి పత్తి దిగుబడులు ఆశించినంతగా రావడం లేదని స్వయంగా వ్యవసాయ అధికారులే చెబుతున్నారు. ఓ దశలో పెట్టిన పెట్టుబడులు వచ్చినా చాలవని రైతులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీసీఐ కేంద్రాల ద్వారా మద్దతు ధరతో పత్తి కోనుగోళ్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మంత్రులు, సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరమున్నది. కానీ, ఈ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. అధికారుల నిఘాలోపం కూడా జిన్నింగ్ మిల్లుల యజమానుల దోపిడీకి కలిసి వస్తున్నది. అధికారుల ఉదాసీన వైఖరి, మిల్లుల యజమానుల మాయాజాలంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు న్యాయం చేసేందుకు అధికార యంత్రాగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రాలకు వస్తున్న పత్తి నిబంధనలకు అనుగుణంగా ఉన్నదా..? లేదా..? అన్నది సీసీఐ, అలాగే ప్రైవేట్ వ్యాపారులకు మాత్రమే వదిలి వేయకుండా ప్రత్యేకంగా కేంద్రాల వద్ద నియమించే యంత్రాంగం కూడా పరీక్షలు చేయాలనే వాదనలు వస్తున్నాయి. అంతేకాదు, ఒక్కో కేంద్రం వద్ద ఒక్కో అధికారిని నియమించి.. రోజు వారీ క్రయ విక్రయాలపై ప్రతేక దృష్టిపెట్టాల్సిన అవసరమున్నది. నిబంధనలకు లోబడి ఉన్న రైతుకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా మద్దతు ధర వచ్చేలా చూస్తే కొంత మేరకైనా న్యాయం జరిగే అవకాశముంటుంది. ఇదే సమయంలో సీసీఐ కేంద్రాలు జిన్నింగ్ మిల్లుల వద్దే ఉన్నాయని, యజమానులు, సీసీఐ అధికారులు కుమ్ముక్కు కాకుండా చూడాల్సిన బాధ్యతను సైతం కేంద్రం వద్ద నియమించే అధికారికే అప్పగిస్తే పత్తి రైతులకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నాకు దేశరాజ్‌పల్లిలో మూడెకరాల భూమి ఉన్నది. ఈ సారి నీళ్లు లేక పత్తి వేసిన. కాపు మంచిగనే వచ్చింది. కానీ, సరైన సమయంలో పత్తికి నీళ్లందలేదు. అట్లనే కాలం కూడా సహకరించలేదు. దిగుబడి గతం కంటే తక్కువగా వచ్చింది. వచ్చిన పంటను మద్దతు ధరతో సీసీఐ వాళ్లు కొంటే మంచిగుండేది. కానీ, వాళ్లు కొంటలేరు. ఏమన్నంటే మీ పత్తి మంచిగలేదంటున్రు. మేం మంచిగ ఆరబెట్టి తెచ్చినా తేమ ఉందంటున్రు. మా అవసరాలు మాకున్నయి. మిల్లుకు వస్తే వాళ్లు చెప్పిందే ధర అయితంది. కొంతమంది క్వింటాల్ 6వేలకే అమ్ముకుంటున్నరు. ఇంకా కొంతమంది 6200కు అమ్ముకున్నరు. నాది అదే పరిస్థితి. గట్టిగా అడిగితే అయింత కొంటరో.. కొనరో అనే భయం. సీసీఐ కొంటే మద్దతు ధర వచ్చేది. సంతోషంగా ఉండేటోళ్లం. సీసీఐ కొనక పోవడం వల్లే జిన్నింగ్ మిల్లులకు అమ్ముతున్నం. కష్టపడి పండించిన పత్తిని తక్కువ ధరకు అమ్మాలని మాకెవ్వరికి ఉండదు. కానీ, ఏమి జేత్తం? కష్టమో నష్టమో అమ్మక తప్పడం లేదు. పోనీ ధర చ్చేవరకు ఇంట్లో నిల్వజేసే పరిస్థితి లేదు. మా బాధలను చూసైనా అధికారులు పట్టించుకోవాలి. పత్తి రైతులకు జర రేటు ఎక్కువ వచ్చేటట్టు చేయాలి.
రెండేండ్ల కిందటి వరకు మా ఊరి చుట్టూ ఎటు చూసినా పత్తి చేన్లే కనిపించేవి. కాళేశ్వరం నీళ్లు ఎప్పుడైతే అచ్చినయో అప్పటి సంది మా ఊరితోపాటు చుట్టుపక్కల అన్ని వరి పొలాలే చేసిన్రు. నేను మాత్రం డిమాండ్ ఉంటదేమోనని ఆశపడి పత్తేసిన. నాకున్న ఒక ఎకరంతోపాటు ఆరెకరాలు కౌలుకు తీసుకొని పండించిన. కానీ, నా ఆశ నిరాశే అయింది. సీసీఐ కొంటలేకపాయె. పండించిన పంట ఇంట్లపెట్టుకుంటె తేమతోని పాడైపోతది. ఇగ గతిలేక తక్కువకైనా అమ్ముకుంటన్నం. మంగళవారం 17 క్వింటాళ్ల పత్తి అమ్మిన. క్వింటాల్‌కు 6,300 చొప్పున ఇచ్చిన్రు. మా పరిస్థితి అధ్వానమైంది. అమ్మవోతె అడివయ్యే కాలమచ్చింది. సర్కారు మా బాధలను అర్థం చేసుకోవాలె. మద్దతు ధర ఇచ్చి మమ్ముల ఆదుకోవాలె.