టెన్త్ ఆన్సర్ పేపర్స్ అమ్ముకున్న వ్యవహారంలో అవినీతి బట్టబయలైంది. ఈ విషయంలో ఏకంగా కలెక్టర్‌నే పక్కదారి పట్టించేందుకు కొంత మంది విద్యాశాఖాధికారులు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. దీనిని గుర్తించిన కలెక్టర్.. అదనపు కలెక్టర్ ద్వారా విచారణ జరిపించడం, ఆ మేరకు బాగోతం బహిర్గతం కావడం, సదరు అక్రమార్కులకు డీఈవో తాజాగా షోకాజ్ నోటీసు జారీ చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఈ వ్యవహారంలో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించడం, క్యాష్ బుక్ మెయింటెన్ చేయకపోవడం, ఏకంగా ఒరిజినల్ ఫైల్ మాయం కావడం వెలుగులోకి వచ్చింది. నిజానికి టెన్త్ ఆన్సర్ పేపర్స్ అమ్ముకున్న తీరు, అందులో జరిగిన అక్రమాలను ఎండగడుతూ.. ‘టెన్త్ ఆన్సర్ పేపర్స్ అమ్ముకున్నరు?’ శీర్షికన గత నెల 15న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం రాష్ట్ర స్థాయిలో కలకలం రేపింది. అప్పుడు ముందుగా గవర్నమెంట్ ఎగ్జామినేషన్ రాష్ట్ర డైరెక్టర్ స్పందించడంతోపాటు గత నెల 23నే ఫైల్‌తో సహా సంబంధిత అధికారులను హైదరాబాద్ కార్యాలయంలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని లిఖిత పూర్వకంగా ఆదేశించడం సంచలనం సృష్టించింది. ఇదే సమయంలో ఈ వ్యవహారం నుంచి బయట పడేందుకు కొంత మంది అధికారులు.. ఏకంగా కలెక్టర్‌కే తప్పుడు నోట్ ఫైల్ పెట్టి తప్పించుకునే క్రమంలో కలెక్టర్ విచారణకు ఆదేశించడం, అక్రమాలన్నీ బహిర్గతం కావడం విద్యాశాఖలో హాట్‌టాపిక్‌లా మారింది.
కరీంనగర్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 2022-23కు సంబంధించిన టెన్త్ ఆన్సర్ పేపర్స్‌ను కరీంనగర్ విద్యాశాఖలోని పరీక్షల విభాగం అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అమ్ముకున్నారు. ఈ విషయంలో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారు. నిజానికి సదరు పేపర్లు విక్రయించాలంటే ముందుగా ఒక ప్రకటన జారీ చేయాలి. అలాగే చిన్న తరహా పరిశ్రమల నుంచి ఎవరు ఎంతకు కొంటారో కొటేషన్లు తీసుకోవాలి. అన్నింటినీ పరిశీలించి, కమిటీ ఆమోదం మేరకు అర్హులకు విక్రయించాలి. వచ్చిన డబ్బులను డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అకౌంట్లో జమచేయాలి. అలాగే అందుకు సంబంధించి పక్కా రికార్డులు మెయింటన్ చేయాలి. అలాగే క్యాష్ బుక్కులు, ఇతర వివరాలు అందుబాటులో ఉంచాలి. కానీ, ఈ విభాగం అధికారులు ఎక్కడా నిబంధనలు పాటించలేదు. గుట్టుగా సాగిన ఈ అమ్మకాల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయన్న విమర్శలు రావడంతోపాటు రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దాంతో సెప్టెంబర్ 24న జిల్లా విద్యాధికారికి డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అధికారులు ఒక నోటీస్ జారీ చేశారు. 2022-23కు సంబంధించి విక్రయించిన డబ్బులను తమ ఖాతాలో ఎందుకు జమచేయలేదో తెలుపాలని కోరారు. విక్రయానికి సంబంధించి అనుసరించిన విధానాలు ఏమిటీ? నిబంధనల ప్రకారం ప్రకటన జారీ చేశారా..? కొనుగోలు విషయంలో ఏయే చిన్న కంపెనీలు పాల్గొన్నాయి? ఏ కంపెనీ ఇచ్చిన కొటేషన్ ఎంత? ఏ తేదీన.. ఎవరి సమక్షంలో విక్రయించారు? ఆ సొమ్మును ఇన్ని రోజులపాటు ఖాతాలో ఎందుకు జయచేయలేదు? ఇలా తదితర వివరాలను పూర్తిస్థాయిలో సమర్పించాలని సదరు నోటీసులో కోరారు. ఆ మేరకు జిల్లా విద్యాధికారి సంబంధిత అధికారుల నుంచి వివరాలు అడిగారు. దీంతో ఈ బాగోతాన్ని లోలోపలే కప్పిపుచ్చేందుకు కొంతమంది ప్రయత్నాలు చేయడం.. ఇదే సమయంలో కొంతమంది అధికారులతోపాటు కలెక్టర్‌కు తప్పుడు నివేదిక ఇవ్వడానికి సన్నద్ధం కావడం వంటి అంశాలను ఎండగడుతూ.. ‘టెన్త్ ఆన్సర్ పేపర్స్ అమ్ముకున్నరు’? శీర్షికన గత నెల 15న ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. దీనిపైముందుగా రాష్ట్ర డైరెక్టర్ స్పందించడం, అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో గత నెల 23న హైదరాబాద్ కార్యాలయంలో హాజరు కావాలంటూ జిల్లా విద్యాధికారికి ఉత్తర్వులు జారీ చేశారు. అందుకోసం అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ (ఏసీజీఈ)ను డిప్యూట్ చేయాలంటూ అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ సీరియస్‌గా తీసుకోవడం, సదరుఫైలుతో నేరుగా హాజరు కావాలని కోరడంతో ఈ విషయం రాష్ట్ర విద్యాశాఖలోనూ సంచలనంగా మారింది.
డైరెక్టర్ ఈ బాగోతాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో.. జిల్లా స్థాయిలోనే అంటే కలెక్టర్ వద్దే క్లోజ్ చేయడానికి విద్యాశాఖలో పనిచేసే కొంత మంది అధికారులు ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. ఏకంగా కలెక్టర్‌ను పక్కదారి పట్టించే దిశగా ఒక నోట్ ఫైలు తయారు చేసుకొని, ఆమోదం కోసం కలెక్టర్ వద్దకే వెళ్లినట్టు తెలిసింది. 2024లో పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సమాయత్తం చేసేందుకు నిర్వహించిన సమావేశాల కోసం సదరు డబ్బులు వినియోగించామని, అది చాలక పోవడంతో మరికొంత డబ్బు అదనంగా వెచ్చించామని, కాబట్టి డబ్బులు నిబంధనలకు లోబడి ఖర్చు చేసినట్టు ఆమోదించాలని కోరుతూ.. కలెక్టర్ ముందు నోట్‌ఫైలు పెట్టినట్టు తెలిసింది. ఇది గమనించిన కలెక్టర్.. సదరు అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడినట్టు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ విద్యార్థుల సమాయత్తం కోసం ఖర్చు పెట్టి ఉంటే.. కనీసం దానికైనా మీరు నా అనుమతి తీసుకున్నారా..? అందుకు సంబంధించిన నోట్‌ఫైలు నాకు పంపించారా..? నా అనుమతి లేకుండా మీరు ఖర్చులు ఎలా పెట్టామని చెబుతున్నారు? మీరు నిబంధనలు ఉల్లంఘించి ఆ విషయాన్ని ఇతరులపై నెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా..? అంటూ విద్యాశాఖాధికారులపై ఆగ్రహించినట్టు తెలుస్తున్నది. విద్యాధికారుల తప్పుడు నోట్ఫైలును నిశితంగా పరిశీలించిన కలెక్టర్.. టెన్త్ ఆన్సర్ పేపర్ విక్రయాలపై అదనపు కలెక్టర్‌తో విచారణ చేయించారు. ఈ విచారణలో అక్రమాలన్నీ బహిర్గతం కావడంతోపాటు అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు గుర్తించారు. క్యాష్ బుక్ లేకపోవడం.. ఒరిజనల్ ఫైల్ మాయం కావడం వంటి అనేక విషయాలను అదనపు కలెక్టర్ గుర్తించగా, ఆ నివేదిక మేరకు డీఈవో తాజాగా సదరు అధికారులకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. తక్షణమే వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అందులో హెచ్చరించినట్టు తెలుస్తున్నది. అయితే షోకాజ్ నోటీస్ వ్యవహారం ప్రస్తుతం విద్యాశాఖలో హాట్‌టాపిక్‌గా మారింది.