ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాస్టర్ ప్లాన్లపై గందరగోళం నెలకొంది. ఓవైపు కొత్త మాస్టర్ ప్లాన్స్‌కు కసరత్తు చేస్తున్న తరుణంలోనే.. మరోవైపు ప్రభుత్వం ఇటీవల నలుదిశలా నాలుగు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో భవిష్యత్‌లో ఏ ప్లాన్ అమలు చేస్తారన్న దానిపై అస్పష్టత ఏర్పడింది. కరీంనగర్లో సుడా పరిధిలో కొత్త మాస్టర్ ప్లాన్‌కు శరవేగంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తాజాగా అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం విస్తరించిన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిస్థితి ఏమిటీ.. దీని పరిధిలో ఏ ప్లాన్ అమలు చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇటు రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోనూ కొత్తగా మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు సిద్ధం కాగా.. రామగుండం కేంద్రంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రకటన చేయడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇక్కడా మాస్టర్ ప్లాన్‌పై అస్పష్టత ఉన్నది. ఇదే పరిస్థితి జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ కనిపిస్తున్నది. సర్కారు నుంచి స్పష్టత లేకుండా ఏ నిర్ణయం తీసుకున్నా అది భవిష్యత్ తరాలకు ఇబ్బందిగా మారుతుందన్న చర్చ జరుగుతుండగా, పాలకవర్గాలకు, అధికారులకు కూడా ఏదీ అంతు పట్టకుండా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కార్పొరేషన్ : ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో కొత్త మాస్టర్ ప్లాన్స్ అనే అంశం తాజాగా తెరపైకి వస్తున్నది. నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ పలు మున్సిపాలిటీల పరిధిలో కొత్త మాస్టర్ ప్లాన్ అమలుకు కసరత్తు చేసినా ఎన్నికలు రావడంతో అది వాయిదా పడింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతోపాటు జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, మెట్పల్లి, ఇతర మున్సిపాలిటీల్లో కొత్త మాస్టర్ ప్లాన్ అమలుకు కసరత్తు చేసింది. ఆ మేరకు సమాచారం సేకరించడంతోపాటు కొన్ని ప్రతిపాదనలు తయారయ్యాయి. నిజానికి కొత్త మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలను ప్రజల ముందుంచి, అభ్యంతరాలు స్వీకరించి, వాటిని పరిష్కరించిన తర్వాత అమల్లోకి తేవాలి. ఆ దిశగా చర్యలు సాగుతున్నాయి. ఊదాహరణకు శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) పరిధిలో గతంలో కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు కొత్తపల్లి మున్సిపాలిటీ, అలాగే 72 గ్రామ పంచాయతీలకు కలిపి మాస్టర్ ప్లాన్ రూపొందిచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకే కొంత కసరత్తు జరిగింది. ఇప్పటికే రెండు సార్లు ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. మరో రెండు సార్లు అభిప్రాయ సేకరణ తర్వాత ముసాయిదా మాస్టర్ ప్లాన్ విడుదల చేస్తారు. అందులోనూ అభ్యంతరాలు స్వీకరించి, అవి పరిష్కారం అయిన తర్వాతే ఫైనల్ మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయాలి. అందుకు సంబంధించి కసరత్తు శరవేగంగా జరుగుతున్నది. అలాగే రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల, వేములవాడ వంటి మున్సిపాలిటీల పరిధిలోనూ కొత్తగా మాస్టర్ ప్లాన్స్‌కు సంబంధించి ఇప్పటికే కొంత కసరత్తు పూర్తయింది. వాటిపై కూడా చర్చ సాగుతున్నది.
కొత్త మాస్లర్ ప్లాన్‌పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఊదాహరణకు చూస్తే గతంలో సుడా పరిధిలో కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు కొత్తపల్లి మున్సిపాలిటీ, 72 గ్రామ పంచాయతీలు ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీలతోపాటు 147 గ్రామాలను సుడా పరిధిలోకి తెస్తూ జీవోనంబర్ 188ను విడుదల చేసింది. అయితే ప్రస్తుత మాస్టార్ ప్లాన్‌ను గత సుడా పరిధి మేరకే తయారు చేస్తున్నారు. ఇలా అమలు చేస్తే కొత్తగా తెచ్చిన అర్బన్ అథారిటీ పరిధి పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకసారి అర్బన్ అథారిటీ ఏర్పాటైతే.. దాని పరిధి మొత్తానికి ఒకే రకమైన మాస్టర్‌ప్లాన్ అమలు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే ప్రస్తుతం రూపొందిస్తున్న సూడా మాస్టర్‌ప్లాన్ పనిచేయకుండా పోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాదు కేవలం సుడా వరకే మాస్టర్ ప్లాన్ అమలైతే మరి అర్బన్ అథారిటీ పరిధిలోకి వచ్చిన మిగిలిన గ్రామాల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అర్బన్ అథారిటీగా ముద్ర పడిన తర్వాత పంచాయతీ నిబంధనల ప్రకారం అనుమతులు ఇవ్వడానికి వీలులేదని తెలుస్తున్నది. అందుకే సుడా మాస్టర్‌ప్లాన్‌పై అనేక అనుమానాలే కాదు, అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. లేదు సుడా మాస్టర్ ప్లాన్‌ను అర్బన్ అథారిటీ పరిధి మొత్తం అమలు చేస్తే అంత పెద్ద రోడ్లు, ఇతర అంశాలు గ్రామాల్లో సాధ్యం అవుతాయా..? లేదా అన్న చర్చ జరుగుతున్నది. అలాగే జగిత్యాల మున్సిపాలిటీకి గతంలోనే మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. దీనిపై వివాదం తలెత్తడంతో నిలిపివేశారు.
ఈ పరిస్థితుల్లో జగిత్యాల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరిట ప్రభుత్వం ఐదు మున్సిపాలిటీలు, 294 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ జీవో విడుదల చేసింది. ఇక్కడ కరీంనగర్లో ఉత్పన్నమయ్యే ప్రశ్నలే వ్యక్తమవుతున్నాయి. అలాగే వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన వేములవాడ ఆలయ ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థ (వీటీడీఏ) పరిధిని రాజన్న సిరిసిల్ల మొత్తానికి వర్తింప చేస్తూ జీవో నంబర్ 184ను ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో వీటీడీఏ పరిధిలో వేములవాడ అర్బన్ మండలంలోని 11 గ్రామాలతోపాటు వేములవాడ పురపాలక సంఘం మాత్రమే ఉండేది. ఇప్పుడు కొత్తగా సిరిసిల్ల మున్సిపాలిటీతోపాటు వేములవాడ రూరల్, బోయినపల్లి, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లోని 152 రెవెన్యూ గ్రామాలను వీటీడీఏ పరిధిధిలోకి తీసుకొచ్చారు. అలాగే రామగుండం కార్పొరేషన్ కేంద్రగా రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో ప్రభుత్వం జీఓనంబర్ 165ను జారీచేసింది. ఈ పరిధిలోకి పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలతోపాటు 198 గ్రామాలను తీసుకొచ్చింది. రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి మున్సిపాలిటీలకు గతంలో తయారు చేసిన మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనల ప్రకారమే ముందుకు వెళ్తారా? లేక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధికి కలిపి కొత్తది తయారు చేస్తారా..? అన్నదానిపై అస్పష్టత నెలకొంది.
అర్బన్ డెవలప్మెంట్ పేరిట జీవోలు జారీ చేసిన ప్రభుత్వం.. వాటి పరిధిలో విధి విధానాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలు, వాటి స్వరూపం వంటి అంశాలపై మాత్రం నేటికి స్పష్టత ఇవ్వలేదు. దాదాపు 90 శాతం గ్రామాలను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలోకి తెస్తూ ఉత్తర్వులు ఇచ్చినా.. ఆ పరిధిలోని పంచాయతీల్లో ఏ ప్లాన్ అమలు చేయాలన్నది చెప్పలేదు. అంతేకాదు, అర్బన్ అథారిటీ పరిధిలోని గ్రామాల్లో పంచాయతీలుంటాయా..? ఉండవా..? అన్నది తెలుప లేదు. ఒకవేళ పంచాయతీలుంటే అప్పుడు పంచాయతీ రాజ్ చట్టంను అనుసరించి మాత్రమే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెక్కన చూస్తే మాస్టర్ ప్లాన్ ప్రభావం అంతంత మాత్రంగానే ఉండనుంది. ఈ విషయంలో అధికారయంత్రాగానికి సైతం పూర్తి స్పష్టత రావడం లేదు. ప్రభుత్వం నుంచి విధి విధానాలు రాకముందు ఏ నిర్ణయం తీసుకున్నా.. అది మళ్లీ మొదటికే వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, అధికారయంత్రాగం శ్రమ వృథా అవ్వడంతోపాటు అస్పష్టతతో ప్లాన్లు సిద్ధం చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అస్పష్టతకు తెరదించాలంటే అది ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది. క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న అనుమానాలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలపై పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తున్నది.