Zilla Parishad School | పెగడపల్లి, డిసెంబర్ 29 : పెగడపల్లి జడ్పీ పాఠశాలలో మూత్రశాలలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. దాదాపు 30 ఏళ్ల కింద నిర్మించిన టాయిలెట్స్ లోతు ప్రదేశంలో ఉండడం వల్ల అందులో మట్టి చేరి నీళ్లు వెళ్లే దారి లేక కొన్ని నెలలుగా వాటిని వినియోగించడం లేదు. దీంతో పాఠశాలకు చెందిన 110 మంది విద్యార్థులు, 17 మంది ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. కొత్తగా నిర్మించేందుకు ఉపాధి హామీ పథకం నుంచి 5 లక్షల నిధులు మంజూరై నెలలు గడుస్తున్నా ఇంత వరకు పనులు ప్రారంభించలేదు. అత్యవసర సమయంలో దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలోని మూత్రశాలను వినియోగించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ముఖ్యంగా బాలికలు, మహిళా ఉపాధ్యాయులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే మూత్రశాలల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ విషయమై హెచ్ఎం లలిత మాట్లాడుతూ, జూన్‌లో పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన విప్ లక్ష్మణ్‌కుమార్, అప్పటి కలెక్టర్‌కు మహిళా ఉపాధ్యాయులం వినతి పత్రం సమర్పించామని గుర్తు చేశారు. ఆరు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఎవరూ స్పందించడం వాపోయారు. అలాగే పీఆర్ డీఈ అశ్విన్ మాట్లాడుతూ, మూత్రశాలల నిర్మాణానికి గత నెలలోనే ఈజీఎస్ నిధులు రూ.5 లక్షలు మంజూరయ్యాయని, కానీ, టెక్నికల్ సాంక్షన్ రాలేదని చెప్పారు. ఈజీఎస్ కొత్త నిబంధనల ప్రకారం మూత్రశాలల నిర్మాణ పనులకు 2 లక్షలకు మించి వినియోగించరాదని తెలిపారు. 2 లక్షల చొప్పున 2 పనులకు ఎస్టిమేషన్ మంజూరు కోసం పంపించామని, టెక్నికల్‌గా మంజూరు రాగానే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
Karimnagar2