వేములవాడ : వేములవాడ ( Vemulawada ) పురపాలక సంఘం పరిధిలో తైబజార్ కాంట్రాక్టు హక్కులు దక్కించుకున్న నిర్వాహకులు రైతులు, చిరువ్యాపారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. పండించిన పంటను నేరుగా విక్రయించుకుందామని వేములవాడ పురపాలక సంఘం మార్కెట్( Market) కు వస్తే తైబజార్ కాంట్రాక్టర్కు నోటి నుంచి వచ్చిందే, ఆయన చెప్పిందే వేదంలా బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు.
జగిత్యాల జిల్లా నల్లగొండ గ్రామ పరిధిలో మామిడి తోటలు లీజుకు తీసుకున్న కొండయ్య లక్ష్మీ దంపతులు సీజన్ ప్రారంభమైన నాటి నుంచి పంట్లను వేములవాడ మార్కెట్ తీసుకువచ్చి విక్రయాలు జరుపుతున్నారు. ఒక్కో రోజు మూడు, నుంచి ఐదు పెట్టెల వరకు తీసుకువచ్చి అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.
అయితే కాంట్రాక్టర్కు నిబంధనల ప్రకారం కేవలం రూ. 20 లు మాత్రమే చెల్లించాల్సి ఉండగా రైతులు, చిరువ్యాపారులు తీసుకొచ్చిన పండ్ల పెట్టల ఆధారంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వారు వాపోయారు. ఒక్కోపెట్టెకు రూ. 30 నుంచి 50 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా సమయం ఆలస్యమైనా, వ్యాపారం లేకపోయినా కాంట్రాక్టర్ మాత్రం అడిగిన కాడికి ఇవ్వకుంటే బూతు పురాణాలతో దాడులకు పాల్పడుతున్నారని మహిళా రైతులు ఆవేదనతో వ్యక్తం చేశారు.
బుధవారం మార్కెట్ కు తెచ్చిన మామిడి పండ్లను రూ. 200 డిమాండ్ చేయడంతో అంత ఇచ్చుకోలేనని వంద రూపాయలు ఇస్తానని వేడుకున్నప్పటికీ సదర్ కాంట్రాక్టర్ పండ్ల పెట్టెలను తన్ని రోడ్డుపై చిందరవందర చేశారు. నెల రోజుల క్రితం జగిత్యాల జిల్లాలో మిర్చి పంటను పండించిన రైతులు కూడా వేములవాడలో విక్రయించేందుకు రాగా వారిపై కూడా ఇదే తరహాలో దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎలాంటి రసీదులు ఇవ్వకుండానే దాడులకు పాల్పడుతున్నాడని, కాంట్రాక్టర్ ఆగడాలపై సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.