రాష్ట్రంలో పేరుకుపోయిన రూ.25 వేల కోట్లకు పైగా బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తూ రేవంత్ సర్కారుపై కాంట్రాక్టర్లు పోరుబాట పడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 18న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టేందుకు నిర్ణయించగా.. అదే రోజు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా బిల్డర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా (బీఏఐ) ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా, ఆయా విభాగాలకు వేరువేరుగా ఉన్న కాంట్రాక్టర్లందరినీ ఒకే గొడుగు కింద తెస్తున్న అసోసియేషన్.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా అడుగులు వేస్తోంది. అప్పటికీ చెల్లించకపోతే తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నది.
కరీంనగర్, జూన్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లకు ఇబ్బందులు మొదలయ్యాయని ఇప్పటికే అనేక కథనాలు వెలువడ్డాయి. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా పేరుకపోతున్న బిల్లులను క్లియర్ చేయడం లేదన్న విమర్శలను రేవంత్‌రెడ్డి సర్కారు ఎదుర్కొంటోంది. ఒకటి, రెండు కాదు అసోసియేషన్, అధికారులు చెపుతున్న అంచనాల ప్రకారం చూస్తే.. వివిధ విభాగాలకు సంబంధించి సుమారు రూ.25 వేల కోట్ల పైచిలుకు చెల్లించాల్సిన బిల్లులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.
ఆయా విభాగాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారాన్ని బట్టి చూస్తే పంచాయతీరాజ్ విభాగం పరిధిలో పనిచేసిన కాంట్రాక్టర్లకు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రూ.2,500 కోట్ల పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. నీటిపారుదల శాఖ పరిధిలో పనిచేసిన కాంట్రాక్టర్లకు రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్లు, ప్రజారోగ్యశాఖ పరిధిలో రూ.500 కోట్లు, కార్పొరేషన్లు, మున్సిపల్ పరిధిలో రూ.2 వేల కోట్లు, ట్రైబల్ వెల్ఫేర్ పరిధిలో పనిచేసిన కాంట్రాక్టర్లకు రూ.750 కోట్లు, మిషన్ భగీరథ కింద రూ.2 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. వీటితోపాటు రోడ్లు భవనాలశాఖ పరిధిలో రూ.3 వేల కోట్లు, స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ కింద వివిధ శాఖల్లో పనిచేసిన కాంట్రాక్టర్లకు సుమారు రూ.7 వేల కోట్ల వరకు చెల్లించాల్సిన బిల్లులు పెడింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. నిజానికి ఆయా శాఖల్లో పూర్తి స్థాయిలో గణాంకాలు తీస్తే.. మరో మూడు నాలుగు వేల కోట్లు చెల్లించాల్సిన బిల్లులు అదనంగా బయటకు వస్తాయని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు.
సర్కారుపై పోరుబాట
పనులు పూర్తిచేసే వరకు హడావుడి చేసిన సర్కారు.. ఇప్పుడు ఆ బిల్లులను చెల్లించడంలో నిర్లక్ష్యం చూపుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిధుల లేమి పేరుతో.. బిల్లులు చెల్లించకుండా సర్కారు కాలయాపన చేస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. పనులు పూర్తిచేసి ప్రభుత్వం నుంచి బిల్లు తీసుకోవడానికి కావాల్సిన ప్రక్రియ అంతా పూర్తి చేసి నెలలు గడుస్తున్నా.. సదరు బిల్లులు క్లియర్ కావడం లేదని, ఈ విషయంలో అధికారులను ప్రశ్నిస్తే.. తమ చేతిలో ఏమీ లేదనే సమాచారం ఇస్తున్నారని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. దీని వల్ల కాంట్రాక్టర్లు ఇబ్బందుల పాలవుతున్నారని, ముఖ్యంగా ఆర్థికంగా చాలా కుటుంబాలు చితికిపోతున్నాయన్న అవేదనను వారు వ్యక్తం చేస్తున్నారు.
రావాల్సిన బకాయిల కోసం వ్యక్తిగతంగా పోరాటం చేస్తే.. సర్కారు వారిని టార్గెట్ చేసే అవకాశాలు ఉండడంతో బిల్డర్ అసోసియేషన్ అఫ్ ఇండియా (బీఏఐ) ఆధ్వర్యంలో పోరుబాట పట్టాలని నిర్ణయించిన అసోసియేషన్.. ఆ మేరకు ఇప్పటికే కార్యాచరణకు పూనుకున్నది. ఇందులో భాగంగా ఇప్పటివరకు వేరువేరు శాఖల పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే జిల్లాల వారీగా కాంట్రాక్టర్ల సన్నాహక సమావేశాలను నిర్వహిస్తుండగా ఆదివారం కరీంనగర్లో జరుపుతున్నట్లుగా అసోసియేషన్ ఇప్పటికే ప్రకటించింది.
రెండు మూడు రోజుల్లో అన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు పూర్తిచేసి అన్ని విభాగాల కాంట్రాక్టర్లను సమూహంగా మార్చి.. సంఘటిత శక్తితో సర్కారుపై ఒత్తిడి తేవాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే మొదటి విడుతగా పెండింగ్‌లో ఉన్న రూ.25 వేల కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా అసోసియేషన్ ప్రకటించింది. ఇందు కోసం అన్ని జిల్లాల నుంచి ఆయా విభాగాలకు చెందిన కాంట్రాక్టర్ల అందరూ పాల్గొనేలా ప్లాన్ చేస్తోంది. చలో హైదరాబాద్ కార్యక్రమంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అసోసియేషన్ నాయకులు చెపుతున్నారు.
ఒకే గొడుగు కిందకు..
ప్రభుత్వం వివిధ శాఖల కింద అభివృద్ధి పనులు చేపట్టే విషయం తెలిసిందే. అయితే.. ఆయా విభాగాల పరిధిలో పనిచేసే కాంట్రాక్టర్లు.. ఇప్పటి వరకు ఒకే గొడుగు కిందకు వచ్చిన దాఖలాలు గతంలో లేవు. ఏదైనా సమస్య వచ్చినా, ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోయినా, అధికారులు ఇబ్బందులు పెట్టినా.. ఆయా శాఖల పరిధిలో పనిచేసే కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టి పరిష్కరించుకునే వారు. మిగిలిన శాఖల అసోసియేన్లు కూడా పెద్దగా జోక్యం చేసుకోవడం గానీ, మద్దతు ఇవ్వడం గానీ ఉండేదికాదు.
కానీ, రాష్ట్రంలో మొదటిసారిగా.. దాదాపు పదికి పైగా శాఖల పరిధిలో వేరువేరుగా పనిచేసే కాంట్రాక్టర్లు అందరినీ ఒకే గొడుగు కిందకు తేవడానికి అసోసియేషన్ చేసిన ప్రయత్నం నూటికి 99 శాతం ఇప్పటికే సక్సెస్ అయినట్లు సదరు అసోసియేషన్ నాయకుల ద్వారా తెలుస్తోంది. అందరూ ఒకే గొడుగు కిందకు వచ్చినప్పుడే సమస్య పరిష్కారం అవుతుందని కాంట్రాక్టర్లు భావిస్తుండగా.. ప్రభుత్వం ఎలా స్పందిస్తున్నది మున్ముందు తేలనుంది. అయితే.. కాంట్రాక్టర్లలో మెజార్టీ చిన్న, మధ్య తరహా వ్యక్తులే ఉన్నారు.
వారికి సకాలంలో బిల్లులు రాకపోవడం వల్ల ఆర్థికంగా కుటుంబాలు చితికిపోతున్నాయన్న అవేదన వారిలో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో తొలిసారిగా కాంట్రాక్టర్లు అందరూ ఒకే గొడుగు కిందకు వస్తున్నా.. సర్కారు సమస్యలను పరిష్కరిస్తుందా? లేదా? అన్న ఉత్కంఠ మాత్రం కాంట్రాక్టర్లలో నెలకొంది. అయితే.. అసోసియేషన్ మాత్రం పోరాటం చేపడితే తప్ప బిల్లులు క్లియర్ అయ్యే అవకాశాలు లేవన్న భావనతోనే ముందుకు వెళ్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.