Koppula Eshwar | ధర్మపురి, జూలై 18 : వర్షాభావ పరిస్థితుల్లో కూడా పంటలు ఎండకుండా కేసీఆర్ ముందునూపులోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఒక పిల్లర్ ను భూతద్దంలో చూపుతూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే కూలినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతూ రైతులను తప్పుదోవ పట్టిస్తూ నిండా ముంచుకున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.
ఆయన రైతులతో కలిసి ధర్మపురి మండలం బుద్దేశిపల్లి వద్ద ఎండిన ఆక్కపెల్లి చెరువును శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో ధర్మపురి వరప్రదాయిని అయిన అక్కపెల్లి చెరువు నిండుకుండలా ఉండేడదని గుర్తుచేశారు. వర్షాలు సమృద్ధిగా కురువని సందర్భంలో కూడా ధర్మపురిలో లక్ష ఎకరాలకు సాగునీరందించేలా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టామన్నారు. అక్కపెళ్లి చెరువును కూడా గోదావరి నీటితో నింపే విధంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో రూ.72.10కోట్లు మంజూరు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పనులు ప్రారంభించుకున్నామన్నారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లిఫ్ట్ కు సంబంధించి పనులు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చెరువు కింద దాదాపు 5 వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో పంటలు సాగు ప్రశ్నార్థకమేవన్నారు. అలాగే ధర్మపురి నియోజక వర్గాన్ని సస్య శ్యామలం చేసే విధంగా ధర్మపురి, వెల్లటూర్ మండలాల్లో 14ఎత్తిపోతల పధకాలు నిర్మించినట్లు పేర్కొన్నారు. ఎత్తిపోతల పథకాలతో పాటు చెక్ డ్యాములు, బోలిచెరువు- బందంమాటు, రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకీకరణ, ప్రతీ గ్రామంలో చెరువుల పునరుద్ధరణ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విజయవంతంగా పూర్తి చేశామని, వర్షాలు కురువని పరిస్థితుల్లో లక్ష ఎకరాలకు సాగునీరందించే విధంగా ధర్మపురిలో ప్రాజెక్టులు నిర్మించి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిపారు.
దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 మాసాలు గడిచిపోయాయని, చిన్నచిన్న పనులు తప్పా ఎక్కడా ఒక్క మంచి అభివృద్ధి పని జరుగుతున్నట్లుగా కనిపించిన దాఖలాలు లేవన్నారు. ఎస్ఆర్ఎస్పీ లో ప్రస్తుతం 16 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నదని, ఇందులో 10 టీఎంసీలు నీరు తాగునీటికి వినియోగిస్తారని, ఈ పరిస్థితుల్లో పంటలను ఏవిధంగా కాపాడుతారో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సాకు చూపించి కన్నెపెళ్లి లిఫ్ట్ దగ్గర నీటిని లిఫ్ట్ చేసి చెరువులు నింపకుండా, కాలువల ద్వారా నీరు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, రైతులు గమనించాలని సూచించారు.
ధర్మపురిలో రైతులు నార్లు పోసుకొని నీటి కోసం ఎదురుచూస్తున్నారనీ. ఆక్కపెల్లి చెరువు లిఫ్ట్ పనులు వెంటనే ప్రారంబించాలని డిమాండ్ చేశారు. రైతులకు జీవనాధారంగా ఉన్న అక్కేపెల్లి చెరువుకు ఎత్తిపోతల పథకం అనేది ధర్మపురి రైతుల ఎన్నో ఏండ్ల కల అని, దాని పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. అలాగే గొల్లపల్లి మండలం రంగదామునిపల్లి గ్రామంలో నారుపోసుకొని వీరందక బిందెలతో నీరు పోసుకునే దుస్థితి వచ్చిందన్నారు. ధర్మపురి మండలం ధమన్నపేట ఎత్తిపోతల పథకం రిపేరుకు వచ్చిందని. స్టార్టర్లు కాలిపోయి నెలరోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నుండిపడ్డారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పందించి ఎత్తిపోతలకు మరమ్మతుల పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా రైతులు అందోళనతో ఉన్నారని, వర్గాలు కురుస్తేనే పంటలు పండే పరిస్థితి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సస్యశ్యామలమైన ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వపు తప్పుడు విధానాలు అవగాహన లేమి వల్ల రాష్ట్ర పరిస్థితి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఎరువుల కోసం రైతులు క్యూలైన్లు కట్టే కాలం మళ్లీ మొదలైందన్నారు.
కాంగ్రెస్ మోసపూరిత పాలనకు ప్రజలు గమనిస్తూనే ఉన్నారనీ, మళ్లీ కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారన్నారు. మాజీ మంత్రి వెంట డీసీఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీశాంత్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, నాయకులు అయ్యోరి రాజేష్ కుమార్, సౌళ్ల భీమయ్య, శేఖర్, శ్యాంసుందర్ తదితరులు ఉన్నారు