భక్తుల కొంగుబంగారం కొండగట్టు క్షేత్రంపై కాంగ్రెస్ సర్కారు చిన్నచూపు చూస్తున్నది. భక్తుల సంక్షేమం, ఆలయ ప్రగతిని పూర్తిగా గాలికొదిలేసింది. అంజన్న సన్నిధిలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి గత కేసీఆర్ ప్రభుత్వం 13.43 కోట్లతో వరద కాలువ వద్ద పంప్‌హౌస్ నిర్మాణం చేపట్టింది. కొంత మేర పనులు చేయగా, ఏడాదిగా బ్రేక్ పడింది. పలు కారణాలతో డిజైన్లలో మార్పులు జరిగి అంచనా వ్యయం 22.58 కోట్లకు పెరుగగా, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అధికారుల బృందం పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. కానీ ఆ ఫైల్‌ను 14 నెలలుగా ఆర్థిక శాఖ పెండింగ్ పెట్టడం, సర్కారు పట్టనట్లు ఉండడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిపోయింది. వేసవి కావడం, హనుమాన్ చిన్న, పెద్ద జయంతులు రానున్న నేపథ్యంలో భక్తులు తాగునీటికి తల్లడిల్లే ప్రమాదమున్నది.
మల్యాల, మార్చి 30 : కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి గాంచింది. మహిమాన్వితమైన ఈ క్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అదే మంగళ, శనివారాల్లో అయితే సుమారు 20 వేలకుపైగా దర్శించుకుంటారు. చిన్న హనుమాన్, పెద్ద హనుమాన్ జయంత్యుత్సవాల సమయంలో రోజుకు దాదాపు లక్ష మంది దర్శించుకొని, స్వామి వారి ఆలయంలో దీక్ష విరమణ చేస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలాంటి తదితర రాష్ర్టాల నుంచి సైతం దీక్షాపరులు వస్తారు.
అయితే భక్తుల సంఖ్యకు అనుగుణంగా కొండపైన నీటి లభ్యత లేకపోవడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న సమయంలో తాటిపల్లి గ్రామానికి అనుబంధంగా ఉన్న కొంపల్లె శివారులోని చెరువు నుంచి తాటిపల్లిలో ఏర్పాటు చేసిన ఫిల్టర్ బెడ్ ద్వారా నీటిని కొండపైకి పంపింగ్ చేశారు. అది సత్ఫలితాలను ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సిరిసిల్ల- వేములవాడ- చొప్పదండి నియోజకవర్గాలకు శుద్ధజలం సరఫరా చేయడానికి అగ్రహారంలోని రామప్ప చెరువు నుంచి మిషన్ భగీరథ పథకం ఫిల్టర్బెడ్ల ద్వారా కొండగట్టు ఆలయానికి ప్రత్యేక లైన్‌ను వేశారు. అయినా కొండగట్టు ఆలయం ఎత్తున ఉండడంతో కొన్నిసార్లు నీటి సరఫరా చేయడంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
ఈ క్రమంలో కొండగట్టు అంజన్న క్షేత్రం అభివృద్ధిపై దృష్టి సారించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, 2023 ఫిబ్రవరి 15న కొండగట్టులో పర్యటించారు. అప్పుడు అక్కడే జిల్లా అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ క్రమంలోనే కొండగట్టులో ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతను తీర్చడంపై చర్చించారు. ముత్యంపేట గ్రామశివారులోని వరదకాలువ 81.140 కిలోమీటర్ వద్ద పంప్‌హౌస్‌ను నిర్మించి, అక్కడి నుంచి మోటర్ సహాయంతో పంపింగ్ చేయాలని నిర్ణయించారు.
అందుకు పంపింగ్ చేసిన నీటిని ఆలయ పరిధిలో ఉన్న సంతలోనిలొద్ది (కుంట) (2.15 ఎంసీఎఫ్‌టీ సామర్థ్యం) నింపి, అక్కడి నుంచి మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఫిల్టర్ బెడ్‌ను ఏర్పాటు చేసి కొండగట్టు అంజన్న ఆలయం వరకు పంపింగ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ అధికారులు రూ.13.43 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి అందించారు. ఆర్థికశాఖ నుంచి 2023 మార్చి 6న పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. ఈ క్రమంలోనే పనులను చేపట్టేందుకు ఆన్లైన్ ద్వారా టెండర్ ప్రక్రియను నిర్వహించగా, మే 10న ప్రతిపాదిత వ్యయంలో 0.45 తక్కువకు పనిచేయడానికి వరంగల్ అర్బన్‌కు చెందిన కావేరి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టెండర్ దక్కించుకున్నది. జూలై 20న అప్పటి రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తోపాటు అప్పటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.
పెరిగిన అంచనా వ్యయం
పనులను దక్కించుకున్న సంస్థ సైతం పనులు ప్రారంభించి సుమారు 10 శాతం వరకు పనులను పూర్తి చేసింది. స్థానికంగా ఉండే పరిస్థితులు, పంప్‌హౌస్ నిర్మాణంలో భూమి పై నుంచి రాయి(బండ) ఉండడంతో బ్లాస్టింగ్ అవసరం ఏర్పడింది. విద్యుత్ హైటెన్షన్ వైర్లు ఉండడంతోపాటు ఓపెన్ బ్లాస్టింగ్‌కు బదులు కంట్రోల్ బ్లాస్టింగ్ అవసరం పడడంతోపాటు వరదకాలువకు రెండు వైపులా వచ్చే నీటి వేగాన్ని (ఎస్సారెస్పీ నుంచి మిడ్‌మానేరుకు నీటిని వదిలిన సందర్భంలోనూ.. గాయత్రీ పంప్‌హౌస్ నుంచి ఎస్సారెస్పీ వైపు నీటిని పంపింగ్ చేసే సమయంలోనూ) తట్టుకునేందుకు పలు మార్పులు అవసరమని ఇంజినీర్ల బృందం భావించింది. పనుల్లో సైతం సివిల్, ఇంజినీరింగ్ అండ్ మెకానికల్ వర్క్స్‌లలో పలు మార్పులు చేసి, మరోసారి ప్రతిపాదనలు రూపొందించాలని ఇంజినీర్ల బృందం భావించడంతో ప్రభుత్వానికి నివేదించింది. ఈ క్రమంలోనే సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు సూచించిన డిజైన్లలో మార్పులు రావడంతో రూ.13.43 కోట్ల నుంచి అంచనా వ్యయం 68.20 శాతం పెరుగతూ రూ.22.589 కోట్లకు చేరింది. టెండర్ ప్రక్రియలో హక్కులు దక్కించుకుపని పనులు ప్రారంభించన సంస్థకు సైతం 5 నుంచి పదిశాతం పనులు పూర్తవడంతో రూ.1.17 కోట్లు శాఖాపరంగా చెల్లింపులు చేశారు.
నిలిచిన పనులు
అంచనా వ్యయం పెంపుదల ప్రతిపాదనలను పరిశీలించిన రాష్ట్ర స్థాయి ఇంజినీర్ల స్టాండింగ్ కమిటీ గతేడాది ఫిబ్రవరి 13న పెంచిన ప్రతిపాదనలను ఆమోదించి ప్రభుత్వానికి సైతం అందజేసింది. ప్రతిపాదనల పెంపు వ్యవహారంతో ఇంజినీరింగ్ అధికారుల ఆదేశాల మేరకు హక్కులు దక్కించుకున్న సంస్థ పనులను నిలిపివేసింది. గతేడాది నుంచి ఇప్పటి రాష్ట్ర ఆర్థిక సంస్థ నుంచి ఎటువంటి పరిపాలనపరమైన అనుమతులు రాకపోవడంతో పనుల నిర్వహణలో జాప్యం జరుగుతున్నది. ప్రభుత్వపరంగా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పనులు నిలిచిపోగా, అంజన్న ఆలయ ప్రధాన సమస్య నీటి కొరతను తీర్చడంలో ప్రభుత్వం విఫలమవుతున్నది. గత శాసనమండలి సమావేశంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ కొండగట్టు ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక సమస్యను లేవనెత్తడంతో దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి ప్రత్యేక ప్రణాళికను (మాస్టర్ ప్లాన్) రూపొందించి అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోలేదు. కొండగట్టు భక్తుల దాహం తీర్చేందుకు ఉద్దేశించిన పంప్‌హౌస్ నిర్మాణం నిలిచిపోవడంతో రానున్న రెండు హనుమాన్ జయంత్యుత్సవాలకు ఇబ్బంది నెలకొననున్నది. గతంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా స్థాయి పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించినా కొండగట్టు ప్రతిపాదనల పెంపు నిర్ణయం కొలిక్కిరాలేదు.
ప్రభుత్వం వెంటనే స్పందించాలి
కొండగట్టు అంజన్న ఆలయం నీటి కొరతను తీర్చేందుకు ప్రభుత్వం స్పందించాలి. వెంటనే నిధులను మంజూరు చేయాలి. దీర్ఘకాలంగా ఉండే ప్రాజెక్ట్‌ల నిర్వహణపై ప్రభుత్వం అలసత్వం వహించడం దుర్మార్గం. 14 నెలలుగా ఆర్థిక శాఖ ఆమోదం కోసం ఫైలు పెండింగ్‌లో ఉంచడం ప్రభుత్వ పనితీరుకు కొలమానంగా భావిస్తాం. ఇప్పటికైనా ఆలయానికి వచ్చే భక్థులకు సౌకర్యాలు ప్రభుత్వపరంగా ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ప్రజల పక్షాన నిలబడుతాం.
– సుంకె రవిశంకర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే