జమ్మికుంట, ఆగస్టు 22 : హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. శుక్రవారం జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల మాజీ సర్పంచ్‌లు హైదరాబాద్‌లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బీఆర్ఎస్లో చేరిన నాయకులు మాట్లాడుతూ, బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని, మరింత అభివృద్ధి చెందాలంటే మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని పేర్కొన్నారు.
ప్రజల్లో కాంగ్రెస్‌పై పూర్తిస్థాయిలో వ్యతిరేకత వచ్చిందని, ఆ పార్టీలో కొనసాగితే తమకు రాజకీయ భవిష్యత్తుతోపాటు కనీస విలువ కూడా ఉండదని గ్రహించి బీఆర్ఎస్లో చేరామని తెలిపారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో మండలంలోని తనుగుల, శంభునిపల్లి, పాపక్కపల్లి, శాయంపేట, నాగంపేట మాజీ సర్పంచులు రామస్వామి, వెంకట్‌రెడ్డి, మహేందర్, భద్రయ్య, కృష్ణారెడ్డి, రాచపల్లి సదానంతం, జైద శ్రీనివాస్ ఉన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తకెళ్లపల్లి రాజేశ్వర్‌రావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.