నారాయణపూర్ కుడికాల్వ నిర్మాణం కొసెల్లడం లేదు. ఎన్నికల ముందు కాంగ్రెస్ అభ్యర్థి హామీ ఇచ్చినా ముందుకెళ్లలేదు. 19 కిలోమీటర్ల మేర కాలువ పనులను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించి వదిలేయగా, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 కిలోమీటర్లు పూర్తి చేసింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రాగా, మిగిలిన మరో రెండు కిలోమీటర్ల పనులు తాను గెలిస్తే పూర్తి చేస్తానని అప్పుడు మేడిపల్లి సత్యం హామీ ఇచ్చినా ఆచరణకు నోచలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా పనులు మాత్రం ముందుకు కదలడం లేదు. ఫలితంగా పరీవాహక ప్రాంతంలో నీరందక పంటలు ఎండుతుండగా, సర్కారు తీరుపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
గంగాధర, ఫిబ్రవరి 22 : ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి బోయినపల్లి మండలం స్తంభంపల్లి వరకు 19 కిలో మీట్లర మేర కుడి కాలువ నిర్మాణాన్ని ప్రారంభించింది. కానీ, పనులపై అప్పటి పాలకుల వివక్ష కొనసాగింది. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దాదాపు 98 శాతం కాలువ పనులను పూర్తి చేసింది. 17 కిలోమీటర్ల మేర పనులు పూర్తి కాగా, మరో 2 కిలో మీటర్లు మాత్రమే పెండింగ్లో ఉంది. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పనుల్లో జాప్యం జరిగింది. ఆ సమయంలో కుడి కాలువ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అప్పటి చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేడిపల్లి సత్యం హామీ ఇచ్చినా పనులు మాత్రం ముందుకెళ్లలేదు. ఏడాదిన్నర కావొస్తున్నా నిర్మాణం పూర్తి కాలేదు. పనులు పూర్తి చేస్తే మధురానగర్, వెంకంపల్లి, కురిక్యాల, ఉప్పరమల్యాల, రంగరావుపల్లి, తాడిజెర్రి, కాసారం, గర్శకుర్తితో బోయినిపల్లి మండలంలోని నాలుగు గ్రామాల పరిధిలో దాదాపు 10 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశమున్నది.
నేను పదెకరాలు కౌలుకు తీసుకుని ఆరెకరాల్లో వరి, ఎకరం మక్క వేసిన. బావిలో నీరు లేక కంకిదశలో ఉన్న మక్కను గొర్రెలు, మేకల మేతకు వదిలేసిన. వరి పొలానికి నీళ్లందేలా లేవు. బావిలో ఉన్న కొద్దిపాటి నీటితోనే రోజు విడిచి రోజు వరుస తడులు పెట్టి కాపాడుకుంటున్న. ఒకవైపు నీరు పెడితే మరో వైపు ఎండుతున్నది. కౌలు కోసం 1.30 లక్షలు, పెట్టుబడి కోసం 1.20 లక్షలు ఖర్చు చేసిన. పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. కుడి కాలువ వస్తేనే మా కష్టాలు తీరుతయి.
– ఎలవర్తి శ్రీనివాసరావు, కౌలు రైతు (రంగరావుపల్లి)
వరద కాల్వ నుంచి నిర్మించే సబ్ కెనాల్ మా భూమిల నుంచే పోతంది. 16 గుంటలు పోతున్నది. అధికారులు సర్వే కూడా చేసిన్రు. కానీ, పనులు చేస్తలేరు. నాకు ఏడెకరాల భూమి ఉంది. 20 గుంటల్లో నువ్వులు, 15 గుంటలల్ల గోధుమ , 16 గుంటల్లో పెసర, మూడెకరాల్లో పొలం వేసిన. నువ్వులు, గోధుమ, పెసర పంటలు నీరు లేక ఎండిపోయినయి. పొలం కూడా ఎండిపోవడానికి దగ్గరకు వచ్చింది. కుడికాలువ పూర్తైతదని ఏండ్ల సంది ఎదు రు చూస్తున్నం. కాలువ పూర్తయితేనే పంటలకు సాగు నీరందుతది.
– ఐతం తిరుపతి, రైతు (రంగరావుపల్లి)
కాల్వ నిర్మాణం పూర్తయితే భూగర్భ జలాలు పెరగడంతోపాటు పంటలకు సాగునీరు అందుతుందన్న నమ్మకంతో ఆయా గ్రామాల్లో పరిధిలోని రైతులు కుడికాలువ, సబ్ కెనాల్స్ నిర్మాణం కోసం భూములను ఇచ్చారు. దాదాపు పదహారేండ్లు గడిచినా ప్రధాన కాలువతోపాటు ఉపకాలువల నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ పూర్తయితే చెరువులకు నీళ్లు వస్తాయని, భూగర్భ జలాలు పెరుగుతాయని, సాగునీటికి రందీ ఉండదని చెబుతున్నారు.
బాయిల నీళ్లు అడుగంటినయ్. వేసిన పంటలు ఎండి పోతున్నయి. మూడెకురాలల్ల పొలం, 20 గుంటలు శనిగె పంట వేసిన. నీళ్లు లేక శనిగె పంట వదిలేసిన. పొలానికి రోజు విడిచి రోజు తడులు పెడుతున్న. కింది మడికెల్లి నీళ్లు పెట్టే వరకు పైమడి ఎండిపోతంది. పెడ్డుబడి వచ్చేలా లేదు. ఏం చేసుడో అర్థమైతలేదు. కాలువ ఎప్పుడు పూర్తి చేస్తరో, ఎప్పుడు నీళ్లస్తయో తెలుస్త లేదు.
– ఐతం లచ్చయ్య, రైతు (రంగరావుపల్లి)