BRS SIRICILLA | సిరిసిల్ల టౌన్, మార్చి 30: అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి విమర్శించారు. సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత మున్సిపల్ పాలకవర్గంలో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇటీవల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేసిన ఆరోపణలపై తాము పూర్తి స్పష్టతనిచ్చామని తెలిపారు. మరోసారి కాంగ్రెస్ నేతలు అవే ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. టెండర్ లేకుండా బిల్లుల తీసుకున్నారని, సీసీ రోడ్డు వేయకుండానే బిల్లులు పొందారని నిరాధారమైన ఆరోపణలు చేశారని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలతో పాలన అందిస్తుంటే స్థానిక నాయకులు కూడా ఆయన బాటలోనే అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం అప్పటి మంత్రి కేటీఆర్ సహకారంతో రూ.55కోట్ల నిధులతో టెండర్ చేశారని, మీకు చేతనైతే సదరు టెండర్ పూర్తి చేసి పట్టణంలో అభివృద్ధి పనులు చేసి చూపించాలని డిమాండ్ చేశారు.
అనవసరమైన మాటలు మానుకోపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. శవాలపై పైసలు ఏరుకునే కొంత మంది నాయకు చేసిన ఫిర్యాదుతో అంత్యక్రియల నిర్వహణకు సంబంధించిన కార్మికుల వేతనాలు 4 నెలలుగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.101తో అంత్యక్రియలు నిర్వహిస్తూ తాము తీసుకున్న నిర్ణయాన్ని సైతం తప్పుపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. వేతనాలు రాని కార్మికులు రోడ్డెక్కితే కాంగ్రెస్ నాయకులే బాధ్యులు అవుతారని అన్నారు. మున్సిపాలిటీలో లేబర్ల నియామకంలో అక్రమాలు జరిగాయని చెప్పిన వ్యక్తి తాను స్వయంగా టెండర్ నిర్వహించినప్పుడు రూ.5వేలు మాత్రమే వేతనాలు ఇచ్చాడన్నారు.
తమ పాలనలో అవినీతికి తావులేకుండా కార్మికుడి బ్యాంకు ఖాతాలో నేరుగా వేతనాలు అందించామన్నారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో అవినీతికి తావులేకుండా అభివృద్ధి లక్ష్యంగా తమ పాలకవర్గం పని చేసిందన్నారు. మీరు చేసిన ఆరోపణలు రుజువు చేస్తే తాము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. మున్సిపల్ జనరల్ ఫండ్స్ పై చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అవగాహన లేని ఆరోపణలు పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో అన్నరం శ్రీనివాస్, అడ్డగట్ల మురళి, ఒగ్గు రాజేశం, నర్మెట ప్రభుదాస్, మ్యాన రవి, సంపత్, ఎండీ సత్తార్, తదితరులు పాల్గొన్నారు.