TBGKS Honorary President Koppula Eshwar | గోదావరిఖని : సింగరేణి కార్మికులను మరోసారి నమ్మించి కాంగ్రెస్ ప్రభుత్వం వచించిందని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరం భారీ బొగ్గు ఉత్పత్తి సాధించి గణనీయంగా లాభాలు అర్ధించిన కార్మికులు గతంలో కన్నా ఈసారి తమకు రెట్టింపు లాభాల వాటా వస్తుందని ఎంతగానో ఆశించారని వారి ఆశలపై నీళ్లు చల్లుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండవసారి మోసం చేసిందని ఆయన ఆరోపించారు.
రూ.6394 కోట్ల లాభాలు అర్జిస్తే అందులో రూ.2,360 కోట్లపై వాటా ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. 34 శాతం వాటా ఇచ్చినట్లు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవానికి 12.8శాతం మాత్రమే కార్మికులకు వాటా ఇచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం ఇదేవిధంగా మోసం చేసిన కాంగ్రెస్ మరోసారి కార్మికులను వంచనకు గురి చేసిందన్నారు. గత ఏడాది రూ.796 కోట్ల లాభాల వాటా చెల్లిస్తే ఈసారి రూ.802.5 కోట్లు మాత్రమే రూ.6.5 కోట్లు అదనంగా చెల్లిస్తుందని ఆయన పేర్కొన్నారు. వాస్తవ లాభాలపై కార్మికులకు రూ.ఐదు లక్షల వరకు లాభాల వాటా రావాల్సి ఉండగా కేవలం రూ.1,95,000 మాత్రమే చెల్లిస్తున్నారని ఆయన విమర్శించారు.
గత ఏడాది వాస్తవ లాభాలపై 16శాతమిచ్చి 33 శాతంగా పేర్కొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి 12.8 శాతమిచ్చి 34 శాతం ఇచ్చినట్లుగా గొప్పలు చెప్తుందని ఆయన విమర్శించారు. కేసీఆర్ హయాంలో వాస్తవ లాభాలపై కార్మికులకు వాటా చెల్లించారని, సింగరేణి అభివృద్ధి కోసం అని ఎలాంటి నిధులను పక్కన పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేసిన మోసంపై ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు కార్మిక సంఘాలన్నీ ఏకమై నిరసనలు ఆందోళనలు తెలపాలని ఆయన పేర్కొన్నారు.
నేడు నల్ల బ్యాడ్జిలతో నిరసన : టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి
కాంగ్రెస్ పార్టీ చేసిన మోసంపై మంగళవారం సింగరేణి వ్యాప్తంగా అన్ని బొగ్గు గనులపై కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి కోరారు. తప్పుడు ప్రచారాలతో కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకించాలని దశల వారి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. గత సంవత్సరం ప్రకటించిన తప్పుడు లాభాలపై టీబీజీకేఎస్ అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టిందని ఆయన గుర్తు చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, నూనె కొమరయ్య, పర్లపల్లి రవి, జాహిద్ పాష, చెల్పూరి సతీష్, పోలాడి శ్రీనివాసరావు, పొగాకు రమేష్, బొడ్డు రమేష్, దూట శేషగిరి, కోండ్ర అంజయ్య, పుప్పాల రవీందర్, జనగామ మల్లేష్, గోపి, మీస రాజు, నూతి రాజ్ కుమార్, మార్క వెంకటస్వామి, భాస్కర్, దేవేందర్, అధిక సంఖ్యలో టీబీజీకేస్ శ్రేణులు పాల్గొన్నారు.