ధర్మారం,సెప్టెంబర్ 8 : పెద్దపల్లి జిల్లా ధర్మారంలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోతున్నారు. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే చంపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అక్కడితో ఆగకుండా రాత్రి వేళ ఇండ్లకు వెళ్లి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలానే ప్రజా సమస్యలపై సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త చెనెల్లి హరీశ్‌ను చంపుతామని ధర్మారం యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సోగాల తిరుపతి ముందుగా ఫోన్లో హెచ్చరించాడు.
అంతేకాకుండా ఆదివారం రాత్రి 7గంటల ప్రాంతంలో హరీశ్ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులను చంపుతామంటూ బెదిరించాడు. దీంతో సోగాల తిరుపతి దౌర్జన్యంపై సోమవారం హరీశ్‌తో పాటు అతని తల్లి రాజమ్మ ధర్మారం పోలీస్ స్టేషన్‌కు వచ్చి, స్థానిక ఎస్ఐ ప్రవీణ్ కుమార్‌కు వేర్వేరుగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపి, హరీశ్‌కు అండగా నిలిచారు. పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఫిర్యాదు చేసిన అనంతరం బాధితులు హరీశ్, హరీశ్తల్లితోపాటు శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఫిర్యాదు పత్రాన్ని విలేకరులకు చూపించారు.
ఇంటికి వచ్చి దాడికి యత్నించాడు : హరీశ్ తల్లి
యూత్ కాంగ్రెస్ నాయకుడు తిరుపతి ఆదివారం రాత్రి తమ ఇంటికి వచ్చి తన కొడుకును చంపుతానని భయభ్రాంతులకు చేశాడని హరీశ్ తల్లి చెనెల్లి రాజమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నది. రాత్రి సమయంలో తిరుపతి తమ ఇంటికొచ్చి అసభ్య పదజాలంతో దూషించి వృద్ధులమైన తమపై దాడికి ప్రయత్నించాడని ఆరోపించింది. ‘మీ కొడుకును ఇంటికి రప్పించు.. హరీశ్‌తో పాటు మిమ్మల్ని కలిపి చంపుతాం’ అంటూ బెదిరించాడని వాపోయింది. తన కొడుకు హరీశ్‌కు తిరుపతితో ప్రాణహాని ఉందని, అతనిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని ఎస్ఐకి విజ్ఞప్తి చేసింది.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరింపులా? : రాచూరి శ్రీధర్
ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతారా..? ఇదేం ప్రజా పాలనా..? అని బీఆర్ఎస్ ధర్మారం మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో చేసిన అభివృద్ధిపై కార్యకర్త చెనెల్లి హరీశ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతోపాటు ప్రజా సమస్యలు, యూరియా కొరతపై ప్రశ్నిస్తే యూత్ కాంగ్రెస్ నాయకుడు సోగాల తిరుపతి చంపుతామని బెదిరించడం ఏంటని ఆగ్రహించారు.
హరీశ్‌ను వ్యక్తిగతంగా దూషిస్తూ గ్రూపుల్లో అసభ్యంగా పోస్టులు పెట్టడంతోపాటు తనకు మంత్రి లక్ష్మణ్ కుమార్ అండ ఉందంటూ బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హరీశ్‌ను ఫోన్లో చంపుతామని బెదిరించడమే కాకుండా రాత్రి అతని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను కూడా భయపెట్టడం దారుణమన్నారు. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని, తాము కేసీఆర్ వారసులమని,రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సైనికులమని స్పష్టం చేశారు. హరీశ్‌కు న్యాయం జరిగే వరకూ పార్టీ పరంగా తాము అతనికి అండగా ఉంటామన్నారు.
మీ ఇంటికి వస్తున్నా.. చంపుతా అన్నడు : హరీశ్
తాను వృత్తి రీత్యా హైదరాబాద్‌లో డ్రైవర్ గా పని చేస్తున్నానని బాధితుడు హరీశ్ తెలిపాడు. యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు తిరుపతి ఆదివారం రాత్రి ఫోన్ చేసి ‘ఇప్పుడు ఎకడున్నవ్? మీ ఇంటికి వస్తున్న? నిన్ను చంపుత’ అంటూ బెదిరించాడని, అసభ్య పదజాలంతో దూషించాడని వాపోయాడు. అంతేకాకుండా సోషల్ మీడియా ‘ధర్మపురి నియోజకవర్గం’, ‘ప్రజలే నా ప్రాణం’ అనే వాట్సప్ గ్రూపులో అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టాడని ఆవేదన చెందాడు. తనకు మంత్రి లక్ష్మణ్ కుమార్ అండదండలు ఉన్నాయని, తనపై రౌడీషీట్ ఓపెన్ చేయిస్తానని బెదిరించించాడని ఆరోపించాడు. తనకు తిరుపతితో ప్రాణహాని ఉందని ఎస్ఐకి ఇచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదులో తెలిపానని, తిరుపతిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరాడు.