ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వస్తున్నారని, తమకు భరోసా దొరుకుతుందని ఎదురుచూసిన వివిధ వర్గాల ప్రజలకు నిరాశే మిగిలింది. వేములవాడ టూర్లో ఎన్నో హామీలు ఇస్తారని కాంగ్రెస్ నేతలు ఊదరగొట్టినా చివరకు ఉత్తదే అయింది. అధికారంలోకి వస్తే వేములవాడను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో మాటిచ్చిన రేవంత్, ముఖ్యమంత్రిగా తొలిసారి రాజన్న క్షేత్రానికి వచ్చి మళ్లీ పాత ముచ్చటే చెప్పడం, పర్యటనకు ఒకరోజు ముందుగా ఇచ్చిన జీవోలపైనే గొప్పలు చెప్పడంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నది. కొత్త ప్రతిపాదనల ఊసేలేకపోవడం, మధ్యమానేరు నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్ల విషయమై స్పష్టత ఇవ్వకపోవడం, నేతన్నల ఉపాధికి భరోసా లేకపోవడంపై తీవ్ర అసహనం కనిపించింది. ప్రసంగించినంత సేపూ విమర్శలకే పరిమితం కావడం, పైగా రాజన్న క్షేత్రంలో తన నియోజకవర్గం కొడంగల్ జపం చేయడంపై ప్రజానీకం మండిపడుతున్నది. సీఎం ఈ ప్రాంత అభివృద్ధికి ఏం చేస్తారో చెప్పించకపోవడంపై స్థానిక నేతల వైఫల్యమేనని విమర్శిస్తున్నది.
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ)/ వేములవాడ : పీసీసీ అధ్యక్షుడి హోదాలో మార్చి 2023లో రాజన్నను దర్శించుకున్న రేవంత్‌రెడ్డి, అప్పుడు ఈ ప్రాంతంపై వరాల జల్లు కురిపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వేములవాడను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, హామీలన్నీ నెరవేరుస్తామని మాటిచ్చిన ఆయన, సీఎం హోదాలో బుధవారం తొలిసారి రాజన్న క్షేత్రానికి వచ్చారు. అయితే ఈ సారి మళ్లీ పాత పాటే పాడారని, చేసిందేమీ లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. దాదాపు 37 నిమిషాలపాటు ప్రసంగించిన ఆయన, భవిష్యత్‌లో ఉమ్మడి జిల్లాకు ఏమి చేస్తారో చెప్పకుండా ఎంతసేపూ విమర్శలకే పరిమితమయ్యారు. గత ప్రభుత్వం రాజన్న ఆలయాన్ని విస్మరించిందని విమర్శించడానికే సరిపోయారు. ఆలయ అభివృద్ధికి కేవలం 76కోట్ల విడుతల వారీ నిధుల జీవోను విడుదల చేసి, పనులకు శంకుస్థాపన చేసి గొప్పలు చెప్పుకోవడాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు. అందులో 50 కోట్లు 2024-25 ఆర్థిక సంవత్సరంలో వెచ్చించి, మ రో 26కోట్లను వచ్చే 2025-26 ఆర్థిక సంవత్సరంలో విడుదల చేస్తామని జీవోలో పేర్కొనడంపై ‘ఇంతదానికి.. అన్ని గొప్పలా..?’ అని మండిపడుతున్నారు. ధర్మగుండం వద్ద ఆలయ విస్తరణ పనులకు భూమి పూజ చేసిన సీఎం, క్షేత్ర అభివృద్ధికి ఎన్ని నిధులు కావాలో..? ఎంత సమయంలో నిర్మిస్తారనే..? విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వకపోవడంపై గుర్రుగా ఉన్నారు.
వేములవాడకు వచ్చే ఒకరోజు ముందు ప్రభుత్వం ఆగమేఘాల మీద విడుదల చేసిన జీవోల ముచ్చట తప్ప, ఆలయానికి సంబంధించి మరే ఇతర అభివృద్ధి పనులపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడలేదు. తొలిసారి వచ్చినందున అనేక వరాలు కురిపిస్తారని ఈ ప్రాంత ప్రజలు ఆశపడ్డా నిరాశే అయింది. గత ప్రభుత్వం చేపట్టినటువంటి రైల్వేలైన్ నిర్మాణంపై స్పష్టత ఇవ్వలేదు. నిర్వాసితుల ముచ్చట మాట్లాడలేదు. బస్టాండ్ కోసం సేకరించాల్సిన స్థలంపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. స్థలం తీసుకుంటారా.. లేదా..? గెజిట్ నుంచి తొలగిస్తారా.. లేదా..? అనే అంశంపై వివరణ లేదు. తెలుగుజాతిని గురించి యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన సినారె గొప్పతనాన్ని చాటేలా సినారె కళామందిరాన్ని తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ అంశాన్ని కూడా కనీసం ఉచ్చరించలేదు. మంజూరు చేసిన జీవోల ముచ్చటే మాట్లాడి కొత్త ప్రతిపాదనల ఊసెత్తకపోవడంపై ప్రజలకు నిరాశే మిగిలింది.
మధ్యమానేరు నిర్వాసితులందరికీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తామని గతంలో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి మాటతప్పారు. మధ్యమానేరు నిర్వాసితులు 10, 600 మంది ఉండగా, తన పర్యటనకు ముందు రోజు ఇండ్లు కట్టుకోని 4,696 మందికి మాత్రమే ఇండ్లు నిర్మిస్తామని జీవోను ఇచ్చి, మిగతావారిని విస్మరించారు. నిర్వాసితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనే డి మాండ్ ఊపందుకోగా, ఈ విషయమై సీఎం స్పష్టత ఇవ్వకపోవడంతో నిర్వాసితులు ఆగమవుతున్నారు. ఇంకా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలపై కూ డా ఎలాంటి హామీ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన నియోజకవర్గం కొడంగల్‌లో భూ సేకరణ విషయం, నిర్వాసితులకు ఉపాధిపై మాట్లాడిన రేవంత్, ఇకడి నిర్వాసితులను మర్చిపోవడాన్ని వారు తప్పు పడుతున్నారు. పైగా అక్కడి భూముల పరిహారం పెంచేందుకు ఆదేశాలు ఇచ్చామని చెబుతున్న ఆయన, ఇక్కడ మిగిలిపోయిన నిర్వాసితుల గురించి మాట్లాడకపోవడంపై మండిపడుతున్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో కొద్దిరోజుల నుంచి కాంగ్రెస్ నేతలు నేతన్నల సంక్షేమం గురించి ఊదరగొట్టారు. ముఖ్యమంత్రి వస్తున్నారని, ఉపాధికి భరోసానిస్తారని గొప్పలు చెప్పారు. ఇందిర మహిళా శక్తి పథకం పేరిట స్వయం సహాయక సంఘాల సభ్యులకు రెండు చొప్పున ఉచితంగా చీరెల పంపిణీ అంటూ రాసిన ఫ్లెక్సీలను సీఎం సభలో పెట్టి మరీ ప్రచారం చేసుకున్నారు. కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం నేతన్నల ఉపాధిపై స్పష్టత ఇవ్వకపోవడం నిరాశకు గురి చేసింది. సీఎం ప్రసంగం ముగించే సమయానికి విప్, కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి వచ్చి నేతన్నల ఉపాధి గురించి చెప్పాలని గుర్తు చేశారు. అప్పుడు సమైక్య సంఘాల మహిళలకు సంబంధించి కోటీ 30లక్షల చీరెల ఆర్డర్లు ఇచ్చేందుకు నిర్ణయం జరిగిందని చెప్పారే తప్పా, ఎప్పుడు ఇస్తామన్నది? మాత్రం ప్రకటించకపోవడం నేతన్నలను తీవ్ర నిరాశకు గురిచేసింది. సీఎం వస్తాడు.. ఏదో చెపుతాడనుకుని ఆశతో ఎదురుచూసిన నేత కార్మికులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఎంతసేపూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై తిట్ల దండకమే తప్ప సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిపై మాట్లాడక పోవడంపై అసహనం వ్యక్తం చేశారు. నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, సీఎం భరోసా ఇస్తాడని మంత్రి పొన్నం ప్రభాకర్ తన ఉపన్యాసంలో చెప్పినా.. సీఎం మాత్రం మాటెత్తక పోవడంపై మండిపడుతున్నారు. కాటన్, పాలిస్టర్ చీరెలు ఇస్తామని ఆరునెలల నుంచి చెబుతూ వస్తున్న కాంగ్రెస్ నేతలు ఎప్పుడు ఇస్తారో సీఎం నోట ఎందుకు చెప్పించలేక పోయారంటూ నిలదీస్తున్నారు. పైగా ప్రభుత్వం కాటన్ పరిశ్రమకు ఆర్డర్లు ఇవ్వాలని కాటన్ యజమానులు, సిరిసిల్ల కాటన్ వస్త్ర పరిశ్రమ జేఏసీ నాయకులను అరెస్ట్ చేయడంపై మండిపడుతున్నారు.
బలవంతంగా సిరిసిల్ల మున్సిపాలిటీలో కలిపిన విలీన గ్రామాలకు సీఎం రాక సందర్భంగా నేతలు ఎన్నో ఆశ లు కల్పించారు. విలీన గ్రామాలన్నింటికీ తిరిగి పంచాయతీ హోదా కల్పిస్తామంటూ, సీఎం నోట చెప్పిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుతాయ ని భరోసా ఇచ్చారు. విలీన గ్రామాలకు విముక్తి అంటూ సోషల్ మీడియాలో తీవ్ర ప్రచారం చేశారు. కానీ, సీ ఎం నోట విలీన గ్రామాల గురించి చెప్పించలేకపోయా రు. పైగా ఆందోళన చేస్తున్న ఆయా గ్రామాల ఐక్యవేదిక నేతల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. సీఎం వెళ్లేదాక వదలలేదు. తమ గ్రామాలకు పంచాయతీ హో దా కల్పిస్తామని చెప్పిఅరెస్ట్ చేయిస్తారా..? అంటూ ఐక్యవేదిక నాయకులు మండిపడుతున్నారు.
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచులు రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం రాక సందర్భంగా తమ సమస్యలు చెప్పుకోవచ్చని భావించారు. సీఎంతో మాట్లాడించాలని పార్టీ ముఖ్య నేతల్ని వేడుకున్నారు. సీఎం దగ్గర ఆ నేతల మాట పనిచేసిందో లేదో గానీ, మాజీ సర్పంచ్‌లను మాత్రం ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఎక్కడ సీఎంను అడ్డుకుంటారోనన్న భయంతో పొద్దుగాల్నే తమను తీసుకెళ్లి ఠాణాలో వేశారంటూ కొం దరు సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఈవిధంగా నిర్బంధం వి ధించడం ఎంతవరకు సమంజసమని, సీఎం పర్యటన వల్ల తమకు ఒరిగేందేమిలేదని మండిపడుతున్నారు.
రేవంత్ రెడ్డి రాజన్న క్షేత్ర అభివృద్ధి కార్యక్రమాల కోసం వేములవాడకు వచ్చిన రేవంత్ రెడ్డి, వేదికపై సొంత ని యోజకవర్గం కొడంగల్ జపమే చేశారని నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. తనను సీఎంను చేసిన తన నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి న లుగురికి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పడమే తప్పా ఇక్క డి ప్రజల గురించి, నేతన్నల సంక్షేమం గురించి మాట్లాడకపోవడంపై ఆగ్రహిస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతం గా తీర్చిదిద్దేందుకు చేస్తున్న భూసేకరణను భూతద్దంలో పెట్టి చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ఇకడి ప్రాంత అభివృద్ధిపై మాత్రం ఒక్కమాట కూడా చెప్పకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ రాజన్నను దర్శించుకునే అంతవరకు సీఎం రేవంత్ రెడ్డితో ఉన్నారు. అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం ఆమె బహిరంగ సభకు హాజరు కాలేదు. గుడిలో జరిగిన పూజ వరకే ఉండి తిరిగి వెళ్లిపోవడంపై విమర్శలకు తావిచ్చింది. పైగా సభలోనూ దేవాలయ అభివృద్ధిపై సీఎం పూర్తి క్లారిటీ ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తున్నది.