కార్పొరేషన్, మార్చి 10 : కరీంనగర్ జిల్లాకు తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్సేనని నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు ధ్వజమెత్తారు. వరదకాలువ, మధ్యమానేరు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుల పేరుతో మొబలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చి, మట్టి పనులు చేసి వందల కోట్లు దండుకున్నది ఆ పార్టీ నాయకులేనని దుయ్యబట్టారు. వాటిని మరిచిన నాయకులు ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. స్థానిక ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం 2009లోనే ప్రకటించి 2014 వరకు రాకుండాచేసి, వెయ్యి మంది ఆత్మబలిదానాలకు కారణమైంది ఎవరో చెప్పాలని ఆ పార్టీ నాయకులను డిమాండ్ చేశారు.
సకల జనుల ఉద్యోమం, తెలంగాణ పూర్తిగా స్తంభింపజేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో తలవంచి రాష్ట్ర ప్రకటన చేశారే తప్ప ఇష్టంగా ఏమీ ప్రకటించలేదని విమర్శించారు. నాడు మంత్రులుగా ఉన్న జీవన్‌రెడ్డి, శ్రీధర్ బాబు, ఎంపీగా ఉన్న పొన్నం ప్రభాకర్ జిల్లా అభివృద్ధికి ఏం చేశారని నిలదీశారు. అప్పుడు చేపట్టిన ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగినా స్పందించకుండా జిల్లాకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఏండ్ల తరబడి ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టింది ఆ పార్టీ నాయకులేనని దుయ్యబట్టారు. వాటన్నింటికీ వారే బాధ్యత వహించాలన్నారు. మధ్యమానేరు ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. 2004 నుంచి 2014 వరకు ఇసుక మాఫియా ద్వారా వందల కోట్లు దండుకున్నారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ హయాంలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందో బీఆర్ఎస్ హయాంలో ఎంత వస్తున్నదో లెక్కలే ఆధారంగా కనిపిస్తున్నాయన్నారు. రూ.2500 కోట్ల నిధులు తెచ్చి నగరం అభివృద్ధి చేసింది మంత్రి గంగుల, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ అని పేర్కొన్నారు. వారి చొరవతోనే స్మార్ట్‌సిటీ వచ్చిందని, ఇప్పటికే 70 శాతం మేర పనులు పూర్తయ్యాయని వెల్లడించా రు. నగరం రూపురేఖలు మారుతున్నాయని ప్రజలు ఆనందిస్తుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కరీంనగర్‌ను పర్యాటక కేంద్రంగా మార్చాలని వందల కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులు సాగిస్తున్నారని, సీఎం ఆస్యూరెన్స్ కింద రూ.350 కోట్లతో అన్ని గల్లీలు, వీధుల్లోనూ డ్రైనేజీలు, రోడ్డు పనులు చేపట్టామన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇక్కడి పథకాలు అమలు చేస్తున్నారా అని సూటిగా ఆ నాయకులను ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలోని అన్ని స్థానాలను మరోసారి బీఆర్ఎస్ గెలిచితీరుతుందన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, వాల రమణారావు, గుగ్గిళ్ల జయశ్రీ, అజిత్‌రావు, తోట రాములు, ఐలేందర్‌యాదవ్, నాయకులు పవన్, బాలరాజ్, ఎడ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.