కరీంనగర్, జూలై 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / జమ్మికుంట : ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ మళ్లీ నిర్బంధకాండ మొదలు పెట్టిందా..? విప్లవ సంఘాల పేరిట అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ, ఇప్పుడు వారిని తొక్కే ప్రయత్నం చేస్తున్నదా..? జనజీవన స్రవంతిలో కలిసి, సామాన్య జీవితం గడుపుతున్న నాయకులపైనా ఉక్కుపాదం మోపుతున్నదా..? అందుకోసం ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించి, అరెస్ట్‌లు చేయిస్తున్నదా..? సికాస పేరిట అరెస్టులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నదా..? అంటే అందుకు మావోయిస్టు నేత మహ్మద్ హుస్సేన్ (అలియాస్ సుధాకర్, అలియాస్ రమాకాంత్)ను అరెస్టే నిదర్శనంగా నిలుస్తున్నది. వివరాల ప్రకారం.. 1978 నుంచి 1981 వరకు కేకే-2 గనిలో జనరల్ మజ్దూర్‌గా పనిచేసిన మహ్మద్ హుస్సేన్ మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడై చేరాడు.
ఉత్తర తెలంగాణ కమిటీ మెంబర్‌గా ఎదిగాడు. మావోయిస్టు అనుబంధ సంఘమైన సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) వ్యవస్థాపక సభ్యుడిగా, సీవోగా పనిచేశాడు. అప్పుడు ఆయనపై వివిధ పోలీస్స్టేషన్లలో 28 క్రిమినల్ కేసులు నమోదు కాగా, దాదాపు 12 ఏండ్లు జైలు జీవితం గడిపాడు. చివరగా 2009లో ఝార్ఖండ్ రాష్ట్రంలో అరెస్ట్ అయి, 2013 వరకు జైలు జీవితం గడిపి బయటకు వచ్చాడు. అనారోగ్య కారణాలతో బెయిల్‌పై విడుదలైన ఆయన, దాదాపు పదకొండేళ్లుగా జమ్మికుంటలో సాధారణ జీవితం గడుపుతున్నాడు. 70 ఏండ్లకు పైబడిన ఆయన, ఇప్పుడు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. అలాంటి రమాకాంత్‌ను అరెస్ట్ చేయడం విమర్శలకు తావిస్తున్నది.
రమాకాంత్ రెండు నెలలుగా మావోయిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి సింగరేణి కోల్‌బెల్ట్ ఏరియాలో సికాస పునర్నిర్మాణం కోసం కృషి చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. మందమర్రి, రామకృష్ణాపూర్ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ సానుభూతి పరులకు సోమవారం కరపత్రాలు పంచుతున్నాడని సమాచారం అందిందని చెబుతున్నారు. ఈ మేరకు ప్రత్యేక బృందాలతో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్ఐ జీ రాజశేఖర్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఆర్కే 1 గని రోడ్లో బ్యాగ్‌తో రమాకాంత్ కనిపించాడు. పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. తనిఖీ చేయగా బ్యాగులో మావోయిస్టుల పేరుతో పోస్టర్లు, కరపత్రాలు లభించాయి. వెంటనే ఆదుపులోకి తీసుకొని ఏసీపీ విచారించారు. జమ్మికుంటకు చెందిన మహ్మద్ హుస్సేన్‌గా గుర్తించారు. అయితే, ఈ అరెస్ట్‌పై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం జమ్మికుంటలోని తన ఇంట్లో ఉన్న హుస్సేన్‌ను బలవంతంగా పట్టుకెళ్లారని ఆరోపిస్తున్నారు. ఆయనకు కంటి ఆపరేషన్ చేయించాల్సి ఉందని చెబుతున్నారు.
ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కోసం జరిగిన పోరాటానికి సికాస కూడా మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతోపాటు అనేక సమస్యలపై సింగరేణి గడ్డ మీద పోరాటాలు చేసింది. అయితే, రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అన్ని విప్లవ సంఘాలు దాదాపు తమ కార్యకలాపాలు తగ్గించాయి. అదే కోణంలో ప్రభుత్వం సైతం అన్ని రకాల సహకారం అందించడంతో చాలామంది విప్లవ సంఘాల నాయకులు ప్రభుత్వం ముందు లొంగిపోయారు. లొంగిపోయిన నాయకులకు సైతం ప్రభుత్వం చేయూతనివ్వడంతో సాధారణ జీవితం గడుపుతున్నారు. తాజా అరెస్టుతో లొంగిపోయిన మావోయిస్టులు, సానుభూతిపరులు, విప్లవ సంఘాల నాయకుల్లో అలజడి మొదలైంది. సికాస పునర్నిర్మాణానికి రమాకాంత్ ప్రయత్నం చేస్తున్నాడనే కారణంపై అతన్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతున్నది నిజమైతే ఆయన వయసు రీత్యా ముందుగా అతన్ని పిలిచి హెచ్చరించాల్సింది.
కానీ, ఇవేమీ లేకుండా నేరుగా అరెస్ట్ చేయడం విమర్శలకు తావిస్తున్నది. అలాగే, తమను చూసి పారిపోయాడని చెబుతున్నారు. 70 ఏండ్లకు పైన అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఎలా పారిపోతాడని వివిధ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి తాము అధికారంలోకి వస్తే ప్రజాపాలన అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు అందుకు విరుద్ధంగా వెళ్తుండడం, రమాకాంత్‌ను అరెస్ట్ చేయడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. అంతేకాకుండా సికాస కార్యకలాపాలపై నిఘా పెట్టడంతోపాటు అరెస్ట్‌ల కోసం ఏకంగా ఒక ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. అయితే, పునర్నిర్మాణం మాట ఎలా ఉన్నా ప్రస్తుత అరెస్ట్ మాత్రం కలకలం రేపుతున్నది. ఈ అరెస్ట్ ఇక్కడితోనే ఆగుతుందా..? లేక మాజీల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే కోణంలో ముందుకెళ్తుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మాజీ మావోయిస్టు, రచయిత హుస్సేన్‌ను పోలీసులు జమ్మికుంటలోని ఆయన ఇంటి నుంచి అక్రమంగా పట్టుకెళ్లడాన్ని ఖండిస్తున్నామని, వెంటనే ఆయనను విడుదల చేయాలని తెలంగాణ మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ర్టాల సమన్వయ కమిటీ సభ్యులు ఎస్ జీవన్‌కుమార్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య డిమాండ్ చేశారు. పట్టణంలోని పాత మార్కెట్ వద్ద తన సొంత ఇంటిలో ఉన్న హుస్సేన్‌ను పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పాలకులు వెంటనే కల్పించుకొని పోలీసుల దౌర్జన్యాన్ని ఆపి మహ్మద్ హుస్సేన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.