Vemulawada | వేములవాడ, జూన్ 20 : కాంగ్రెస్ అంటేనే రాక్షస పాలన అని గడచిన 30 నెలలుగా రాష్ట్రంలో రైతులను అరిగోసపెడుతున్నారని మాజీ జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అబద్దాలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను రైతులను అనేక ఇబ్బందులను గురి చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ హయాంలో 2కోట్ల 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా సకాలంలో రైతులకు రైతుబంధు, యూరియాను అందివ్వడమే కాకుండా వచ్చిన పంట దిగుబడిని కూడా కొనుగోలు చేసి రైతును రాజు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగునీరు లేదు, ఎప్పుడొస్తుందో తెలియని రైతు భరోసా, యూరియా కోసం పోతే చెప్పుల లైన్, లేదంటే యాప్ అంటూ రైతులను వేధించడమే తప్ప ఒక్క మంచి పని చేసిన దాఖలాలు లేవన్నారు.
ఇక వచ్చిన ధాన్యం దిగుబడిని అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారని గుర్తు చేశారు. ఒక్కో వడ్ల కుప్ప దగ్గర రైతు మూడు నెలలు నిద్ర పోతే తప్ప కొనలేదని మండిపడ్డారు. ఇప్పుడు కేంద్రం కొనుగోలు చేసే వాటిని మాత్రమే కొంటామని చెబుతున్న తీరు దౌర్భాగ్య పరిపాలనకు నిదర్శనం అన్నారు. ఇక బోనస్ లేదు వడ్లు కొనరు ఇది కాంగ్రెస్ ప్రభుత్వ దుస్థితి అన్నారు. నియోజకవర్గంలో రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కనిపించడం లేదా అంటూ విమర్శించారు. దేశానికి అన్నం పెట్టే రైతును అన్ని విధాల కాంగ్రెస్ ప్రభుత్వం వేదిస్తుండగా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రజలు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారని అన్నారు.
ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి, రాఘవ రెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, ప్యాక్స్ చైర్మన్ లు జలగం కిషన్ రావు, తిప్పని శ్రీనివాస్, వైస్ చైర్మన్ లు మానుపాటి భూమిరెడ్డి, కాశ వేణి మహేష్, సీనియర్ నాయకులు గడ్డం హన్మండ్లు, అజిత్ రావు, రవి కుమార్, మండల అధ్యక్షులు మల్యాల దేవయ్య, గోసుకుల రవి, పట్టణ మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి చందు, గోలి మహేశ్, మారం కుమార్, సీనియర్ నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్, మండల నాయకులు, అన్ని మండలాల సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.