సారంగాపూర్ : కాంగ్రెస్ ప్రభుత్వం మక్కలు, వరి ధాన్యాన్ని కొనలేక కొర్రీలు పెడుతుందని జగిత్యాల జడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత సురేష్ ( Dava Vasantha ) అన్నారు. మండలంలోని రేచపేల్లి, సారంగాపూర్లో ఉన్న ఉన్న మక్కల కొనుగోలు కేంద్రాన్ని( Procurement Centre ) తొలగించడం అన్యాయమని ఆదివారం మీడియా సమావేశంలో ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి , స్థానిక ఎమ్మెల్యేకు మండలంపై చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు.
మొక్కజొన్న పంట ఎకరానికి దాదాపు 40 క్వింటాల వరకు దిగుబడి వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎకరానికి 26 క్వింటాలు మాత్రమే కొంటామని ఆంక్షలు పెట్టడం విచారకరమని అన్నారు. నామమాత్రంగా కొనుగోలు సెంటర్లను ప్రారంభించి చేతులు దులుపుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు.
జిల్లా యంత్రాంగం రైతుల బాధ అర్థం చేసుకోవాలని కోరారు. కేసీఆర్ హయాంలో ఒక్క గుంట కూడా ఎండిపోకుండా ఎక్కడికక్కడ అధికారులతో సమన్వయం చేసుకుంటూ చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు ఎక్కడ కోరుకుంటే అక్కడ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని గుర్తు చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తేలు రాజు , పాక్స్ మాజీ చైర్మన్ సాగి సత్యం రావు, కోనాపూర్ సర్పంచ్ ఆకుల రమేష్ నాయకులు బైరి మల్లేశం, భాస్కర్, తిరుపతి, రామచంద్ర రెడ్డి, జలంధర్, చిరంజీవి, ప్రేమానందం, మధు, రాజన్న, తదితరులు ఉన్నారు.