యూరియా కొరత రైతుల మధ్య చిచ్చు రేపుతోంది. తాజాగా, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని సైదాపూర్ మండలం వెన్నంపల్లిలో యూరియా కోసం వెన్నంపల్లి, ఎక్లాస్పూర్ గ్రామాల రైతులు శనివారం ఒకరినొకరు కొట్టుకుంటూ.. పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ ఘటనలో వెన్నంపల్లికి చెందిన కంది గోపాల్‌రెడ్డి అనే రైతు తలకు గాయమవగా, మరికొందరు గాయపడ్డారు. సుమారు గంటకుపైగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు సైదాపూర్‌లో టోకెన్లు ఇవ్వకపోవడంతో రైతులు హుస్నాబాద్-హుజూరాబాద్ రోడ్డుపై సాయంత్రం ధర్నాకు దిగడంతో రాత్రి అందించారు.
కరీంనగర్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ)/సైదాపూర్ : యూరియా సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యం.. గ్రామాల మధ్య గొడవకు దారితీస్తున్నది. ఇటీవల ఎల్లారెడ్డిపేట మండలంలో పలు గ్రామాల్లో తమకంటే తమకు ముందుగా బస్తాలు ఇవ్వాలని ఘర్షణలకు దిగిన ఘటనలు మరవకముందే.. తాజాగా, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకాలో ఇరు గ్రామాల మధ్య కొట్లాట వరకు దారితీసింది. సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి సింగిల్ విండోకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు 330 బస్తాలతో యూరియా లారీ రావడం, అక్కడ చూస్తే 600లకుపైగా రైతులు ఉండడంతో మనిషికి ఒక బస్తాకూడా రాని పరిస్థితి కనిపించింది. దీంతో ఈ లోడ్ తమకే కావాలని, తర్వాత వచ్చిన లోడ్ వెన్నంపల్లి రైతులకు ఇవ్వాలని ఎక్లాస్పూర్ రైతులు అధికారులకు చెప్పజూశారు.
కానీ, వెన్నంపల్లి రైతులు అందుకు అంగీకరించ లేదు. దీంతో ఇరు గ్రామాల రైతుల మధ్య మాటా మాటా పెరిగి తోపులాట, ఆ తర్వాత కొట్లాట జరిగింది. రెండు గ్రామాల రైతులు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఒకరినొకరు తోచుకున్నారు. రాళ్లు, కర్రలు, చేతికి ఏది దొరికితే అది ఒకరిపై ఒకరు విసురుకున్నారు. వెన్నంపల్లికి చెందిన రైతు కంది గోపాల్‌రెడ్డి తలకు తీవ్ర గాయమైంది. మరి కొందరు రైతులు సైతం గాయపడ్డారు. పరిస్థితిని గమనించిన సింగిల్ విండో అధికారులు ఇచ్చిన సమాచారంతో వెన్నంపల్లికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. రెండు గ్రామాల రైతులతో మాట్లాడి శాంతింపజేశారు. గంటకుపైగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. వచ్చిన కొద్దిపాటి బస్తాలను ఎవరికి ఇవ్వాలో తెలియక అధికారులు సింగిల్ విండో గోదాంలో భద్రపర్చారు.
యూరియా కొరత లేదని, కేవలం నమస్తే తెలంగాణ, టీ న్యూస్ వార్తలు, రాస్తూ, ప్రసారం చేస్తూ యూరియా కొరతను క్రియేట్ చేస్తున్నాయని ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో వ్యాఖ్యానించారు. అయితే, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండలంలోనే తీవ్రమైన కొరత ఉండగా, రెండు గ్రామాల రైతులు కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఈ ఒక్క ఘటన చాలని, కొరత లేదని వాదించిన పొన్నం మరీ ఇప్పుడేమంటారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
సైదాపూర్ సింగిల్ విండో వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. పొద్దుటి నుంచి సింగిల్ విండో గోదాం వద్ద పడిగాపులు పడితే యూరియా ఇవ్వలేదని రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉదయం నుంచి ఆరేడు వందల మంది వేచి ఉండగా మధ్యాహ్నం 3 గంటలకు 330 బస్తాలతో యూరియా లారీ వచ్చింది. ఎక్కువ మంది రైతులు ఉండడం, తక్కువ బస్తాలు రావడంతో అధికారులు పంపిణీ చేసేందుకు మల్లగుల్లాలు పడ్డారు. టోకెన్లు పంపిణీ చేసేందుకు ప్రయత్నించగా రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు.
పరిస్థితి అదుపు తప్పడంతో టోకెన్లు కూడా ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన రైతులు సైదాపూర్ వద్ద హుజూరాబాద్-హుస్నాబాద్ ప్రధాన రహదారిపై రాత్రి 7 గంటల వరకు రాస్తారోకోకు దిగారు. ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని రైతులతో మాట్లాడారు. టోకెన్లు ఇచ్చేందుకు అధికారులు అంగీకరించడంతో రాత్రి 7 గంటల తర్వాత లైన్లో నిలుచున్నారు. వెన్నంపల్లి రైతులు తమకు యూరియా ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఇటు ఎక్లాస్పూర్ రైతులు కూడా స్థానిక సింగిల్ విండో గోదాం వద్ద ధర్నాకు దిగారు. అటు సైదాపూర్‌లో రాస్తారోకో, ఇటు ఎక్లాస్‌పూర్‌లో ధర్నాలతో సైదాపూర్ పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి.
ధర్మారం,సెప్టెంబర్ 6: పత్తిపాక సింగిల్ విండో కార్యాలయానికి శనివారం యూరియా వస్తుందనే సమాచారంతో పత్తిపాక, నర్సింగాపూర్, నాయకం తండా, మల్లాపూర్, కమ్మర్ ఖాన్ పేట, లంబాడి తండా (కే) గ్రామాల నుంచి రైతులు ఉదయాన్నే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సద్ది కట్టుకొని వచ్చి రోజంతా నిరీక్షించారు. 340 బస్తాలు రాగా, దాదాపు 500 మందికి పైగా రైతులు బారులు తీరారు. నిలబడే ఓపిక లేక ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకాల జిరాక్స్ ప్రతులను క్యూలో పెట్టారు. తెచ్చుకున్న సద్దిని మధ్యాహ్నం అక్కడే తిన్నారు. కాగా, రైతుకు ఎన్ని ఎకరాల పొలం ఉన్నా ఒక్క బస్తా మాత్రమే పోలీస్ బందోబస్తు మధ్య పంపిణీ చేయగా, అసహనం వ్యక్తం చేశారు. ఆ ఒక్కటీ దొరక్కపోవడంతో మిగిలిన 160 మందికిపైగా రైతులు నిరాశతో వెనుదిరిగారు.