కార్పొరేషన్, జనవరి 23 : పంచాయతీ ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామసభల పేరిట డ్రామాలు ఆడుతున్నదని రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్‌సింగ్ విమర్శించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏడాది పాలనలో ఒక రేషన్ కార్డయినా ఇచ్చారా..? అని ప్రశ్నించారు. ఆయనవి అన్ని ఉత్త మాటలే తప్పా అయ్యేది లేదు పొయ్యేది లేదని ఎద్దేవా చేశారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలు లేకపోవడంతో 14 నెలలుగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, ఆ నిధుల కోసమే ప్రభుత్వం గత్తర పడుతున్నదని విమర్శించారు.
ప్రజలను పకదారి పట్టించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ గ్రామసభలు నిర్వహిస్తున్నదన్నారు.అసలు సభల్లో ప్రకటిస్తున్నట్టు ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం గతంలోనే ఆన్లైన్లో లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిగణలోకి తీసుకున్నారో లేదో చెప్పాలన్నారు. సభల్లోనే సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, అది ఎకడా కనిపించలేదన్నారు.
గ్రామసభల్లో తీసుకుంటున్న దరఖాస్తులకు కనీసం రసీదు కూడా ఇవ్వడం లేదన్నారు. ఇప్పటివరకు సంక్షేమ పథకాల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎంతమందిని ఎంపిక చేశారో అన్న విషయాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలకు పెట్టిన ఆదాయపరిమితిని పెంచాలని, ప్రభుత్వానికి దమ్ముంటే కులగణన లిస్టును బయటపెట్టాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఎడ్ల అశోక్, పెండ్యాల మహేశ్‌కుమార్, గుంజపడుగు హరిప్రసాద్, కెసారం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.