మక్క రైతుపై కాంగ్రెస్ కత్తిగట్టింది. మొన్నటిదాకా కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేసి ఇబ్బందులు పెట్టిన సర్కారు, ఇప్పుడు మూడు మండలాలకు చొప్పదండిలో ఒకే మార్కెట్ పెట్టి చుక్కలు చూపుతున్నది. ఇది చాలక పంట అమ్ముకునేందుకు అనేక ఆంక్షలు విధిస్తున్నది. యజమాని ముందుగా పంట నమోదు చేసుకోవాలని, వేలిముద్ర వేస్తేనే మక్కలు కొంటామని చెబుతూ ముఖ్యంగా కౌలు దారులను గోసపెడుతున్నది. ఫలితంగా దళారులకు తక్కువ ధరకే విక్రయిస్తూ నష్టపోవాల్సిన పరిస్థితి దాపురించగా, ప్రభుత్వ తీరుపై రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
చొప్పదండి, మే 1: గతంలో ఎన్నడూ లేని విధంగా మక్కరైతులపై రాష్ట్ర ప్రభుత్వం విపక్ష చూపుతున్నది. మొన్నటిదాకా సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా తిప్పలు పెట్టిన సర్కారు, ఏర్పాటు చేసిన చోట కాంటా వేయడంలో జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందులు పెడుతున్నది. గన్నీ బ్యాగులు, లారీల కొరత కారణంగా కొనుగోళ్లలో జాప్యం చేస్తుండగా, మక్కలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. చొప్పదండి వ్యవసాయ మారెట్లో ఎటుచూసినా మక్కల కుప్పలే కనిపిస్తున్నాయి. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాలకు కలిపి ఒకేచోట చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు దూరభారంతో సతమతమవుతూ, మరోవైపు మార్కెట్లో స్థలం లేక మక్కలు ఎక్కడపోయాలో తెలియక నరకం చూస్తున్నారు.
రైతులు పంట నమోదు చేసుకుంటేనే ప్రభుత్వం మద్దతు ధరతో మక్కలు కొంటున్నది. ఈ విధానాన్ని గతేడాది నుంచే ప్రారంభించింది. అందులోనూ ఒక ఎకరాకు 25 క్వింటాళ్లకు మాత్రమే మద్దతు ధర రూ.2400 చెల్లిస్తున్నది. చొప్పదండి ప్రాథమిక సహకార సంఘంలో ఆధార్ కార్డు నంబర్‌తో పంట నమోదు చేసుకొని మక్కలు కొంటున్నారు. అయితే మూడు మండలాల రైతులు తరలివస్తుండడంతో పంట నమోదుకు చాలా టైం పడుతున్నది. దీనికితోడు పంట నమోదు తర్వాత పట్టదారు స్వయంగా వచ్చి వేలి ముద్ర రెండు సార్లు వేస్తేనే కొనుగోళ్లు చేస్తున్నారు. ఒకసారి వేలిముద్రకు గన్నీ బ్యాగులు ఇస్తున్నారు. రెండోసారి వేస్తే తూకం వేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నదని రైతులు వాపోతున్నారు.
కౌలు రైతులు తెచ్చిన మక్కలను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయడం లేదు. పట్టాదారు వచ్చి పంట నమోదు చేసుకుని స్వయంగా వచ్చి వేలి ముద్ర వేస్తేనే మద్దతు ధర రూ.2400 చెల్లిస్తున్నారు. ఇప్పుడున్న కాలంలో ఉద్యోగులు, వ్యాపారులు భూములను కౌలుకు ఇస్తున్నారు. అయితే లోకల్‌గా ఉన్నవారిని బతిమిలాడి తీసుకువస్తున్న రైతులు, హైదరాబాద్, బెంగళూర్, ఇతర రాష్టాలు, దేశాల్లో ఉన్నవారిని ఇక్కడికి తీసుకురాలేక అవస్థలు పడుతున్నారు. కౌలు రైతుకు అండగా ఉంటామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఇలాంటి కొర్రీలు పెట్టడంతో దిక్కు దోచని పరిస్థితిలో పడిపోయారు. క్వింటాల్‌కు రూ.500 నుంచి రూ.600 నష్టపోతూ దళారులకు రూ.1800 నుంచి రూ.1900 వరకు అమ్ముకుంటున్నారు.
నేను ఊళ్లే రెండెకరాల భూమి కౌలుకు తీసుకొని మక్క వేసిన. మా మండలంలో మక్కలు కొంటలేరని చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో మద్దతు ధరతో కొనుగోలు చేస్తరని రెండు రోజుల క్రితం తెచ్చిన. ఇక్కడికి తీసుకవచ్చిన తర్వాత తెలిసింది. పట్టాదారు పంట నమోదు చేసుకుని ఉండి, ఆయనే వచ్చి వేలి ముద్ర వేస్తేనే మక్కలు కొంటమని అంటున్నరు. పట్టాదారును చాలా బతిమిలాడి తీసుకురావాలి. ఆయన రాకపోతే మక్కలు తెచ్చేందుకు అయిన ట్రాక్టర్ కిరాయి మీద పడుతది. ఈ ముచ్చట ముందే తెలిస్తే మా ఊళ్లోనే దళారికి అమ్ముకుందును. గతంలో ఇట్ల లేకుండే. కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌలు రైతులంటే కక్ష ఎందుకు? ఇబ్బందులు పెట్టడం సరికాదు.