బెంగళూరు: విధుల్లో ఉన్న పోలీస్ అధికారిణిపై బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె దాడి చేసింది. ఆ పోలీస్ అధికారిణి ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదైంది. అయితే బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె ప్రతిగా ఫిర్యాదు చేయడంతో పోలీస్ అధికారిణిపై కూడా కేసు నమోదు చేశారు. (FIR on BJP MLA’s daughter) కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 12న రాత్రి 8 గంటల సమయంలో తుమకూరు రూరల్ బీజేపీ ఎమ్మెల్యే బీ సురేష్ గౌడ కుమార్తె, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) భార్య అయిన ఐశ్వర్య, శ్రీరంగపట్నం తాలూకాలోని ఆరతి ఉక్కడ దేవాలయాన్ని సందర్శించారు. భీమ అమావాస్య సందర్భంగా ఆ ఆలయానికి భక్తులు పోటెత్తారు.
కాగా, దర్శనానికి అనుమతించడంలో జాప్యంపై అక్కడ విధుల్లో ఉన్న మాండ్య మహిళా పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ సవితా, బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె ఐశ్వర్య మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమార్తె తనను దూషించారని, తన చెంపపై కొట్టడంతోపాటు విధి నిర్వహణకు ఆటంకం కలిగించారని, తనను బెదిరించారని ఆ పోలీస్ అధికారిణి ఆరోపించారు. మాండ్యలోని క్యాతనహళ్లి పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఐశ్వర్యపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు పోలీస్ అధికారిణి సవితాపై బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె ఐశ్వర్య కూడా ప్రతిగా ఫిర్యాదు చేశారు. ఆమె తనను దుర్భాషలాడినట్లు ఆరోపించారు. ఐశ్వర్య కూడా ఫిర్యాదు చేసినట్లు మాండ్య జిల్లా ఎస్పీ ధృవీకరించారు. ఆలయం వద్ద జరిగిన ఘర్షణకు దారితీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు అధికారులు రెండు ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నారని తెలిపారు. విచారణలో తేలే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు.