కరీంనగర్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన నిర్మాణం ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్టు సాగుతున్నది. తమ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే కొత్త కలెక్టరేట్‌ను పూర్తి చేసి, అన్ని హంగులతో ప్రజలకు సేవలందించేలా తీర్చిదిద్దుతామంటూ కాంగ్రెస్ నాయకులు ప్రకటించినా.. ఆచరణలో మాత్రం నత్తకే నడకలు నేర్పతున్నది. నిధులు విడుదల చేయడంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తుండగా, పాత భవనం శిథిలావస్థకు చేరింది. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలను నగరంలో వేర్వేరు చోట్లకు తరలించగా, ఏ ఆఫీస్ ఎక్కడ ఉన్నదో తెలియని పరిస్థితి ఉన్నది. దీంతో ఆఫీసులకు వచ్చే ప్రజలు నగరం నలువైపులా తిరగలేక ఇబ్బంది పడాల్సి వస్తున్నది.
కరీంనగర్ కలెక్టరేట్, మే 7 : కొత్త జిల్లాలతోపాటు కరీంనగర్లో కూడా అన్ని హంగులతో సమీకృత కలెక్టరేట్ భవనం నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. 2021 చివరి త్రైమాసికంలో 51 కోట్ల అంచనాలతో కొత్త కలెక్టరేట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఏడాదిలోపే గుత్తేదారు గ్రౌండ్, మొదటి, రెండు అంతస్థుల స్లాబ్ వేసి, గదుల పనులు కూడా పూర్తి చేశారు. అయితే, అనంతర కాలంలో జరిగిన పరిణామాలతో ప్రభుత్వం మారింది. తమ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే కొత్త కలెక్టరేట్‌ను పూర్తి చేసి, అన్ని హంగులతో ప్రజలకు సేవలందించేలా తీర్చిదిద్దుతామంటూ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో ప్రకటించారు.
అయితే, భవనం పూర్తి చేయడం అటుంచితే.. నిధులు విడుదలలోనే నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుత్తేదారుకు చెల్లించాల్సిన డబ్బులు పెండింగ్‌లో పడగా, నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో, ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరుచోట్ల ఉండి పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతుండగా, కొత్త కలెక్టరేట్ నిర్మాణంపై కలెక్టర్ పమేలా సత్పతి గతేడాది ఆగస్టులో సంబంధిత గుత్తేదారు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిసెంబర్‌లోనూ మరోసారి సమీక్షించి జనవరిలో ప్రారంభించేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్త సంవత్సరం మొదలై నాలుగు నెలలు గడుస్తున్నా, నిర్మాణ పనులు మాత్రం ఇంకా కొలిక్కిరాలేదు.
ప్రస్తుతమున్న పాత కలెక్టరేట్ భవనం నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించగా, మెయింటనెన్స్ లోపంతో శిథిలావస్థకు చేరింది. పలుచోట్ల పెచ్చులూడుతూ, కార్యాలయాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు, అధికారులపై పడుతుండగా గాయాలపాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. కంప్యూటర్లు కూడా ధ్వంసం కావడంతో ఉమ్మడి జిల్లాలో అప్పటి కలెక్టర్ స్మితాసబర్వాల్ హయాంలో కెమికల్ కోటింగ్‌తో మరమ్మతులు చేపట్టారు. ఏడాదిపాటు ఎలాంటి సమస్యలేకుండా ఉండగా, అనంతరం యధావిధిగానే వర్షాకాలంలో నీరు కారడం, సిమెంట్ పెచ్చులూడడం మొదలైంది.
మరోవైపు ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాల అద్దె చెల్లించలేక అధికార యంత్రాంగం చేతులెత్తేస్తున్నది. దీంతో విధిలేక ఇతరచోట్ల ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి కార్యాలయాలను తరలిస్తున్నారు. అందుకయ్యే ఖర్చు తడిసి మోపెడవుతుండగా, అది కూడా చెల్లించకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారనే చర్చ జరుగుతున్నది. ఇంటిగ్రేటెడ్ భవన నిర్మా ణం నేపథ్యంలో పాత కలెక్టరేట్లో ఉన్న పలు ప్రభు త్వ కార్యాలయాలను నగరంలో వేర్వేరు చోట్లకు తరలించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి కొన్ని, మరికొన్ని ప్రైవేట్ భవనాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసి నిర్వహిస్తూ వస్తున్నారు. జిల్లా ప్రజలు పలు అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు రా వాలంటే భయపడే పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఏ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియక ఆగమవుతున్నారు.
వివిధ పనులపై ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారంతా నగరం నలువైపులా తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్ని పనులతో వచ్చినా కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండడంతో, గంట, రెండు గంటల వ్యవధిలోనే పనులు ముగించుకుని, తిరిగి తమ తమ గ్రామాలకు వెళ్లేవారు. ప్రస్తుతం ఒకేపని కోసం గంటల తరబడి కార్యాలయాలు వెతకాల్సి రావడంతో ఒక్కోసారి ఒక్క పని కూడా కావడం లేదని వాపోతున్నారు. సకాలంలో పనులు పూర్తికాక బేజారవుతున్నామని మండిపడుతున్నారు.
కనీసం రాష్ట్ర ఆవిర్భావం రోజైనా ప్రారంభించుకునేలా కొత్త కలెక్టరేట్‌ను పూర్తి చేయాలని ఆదేశించినా, పనుల్లో వేగం పెరగడం లేదు. ఇంకా ఫ్లోరింగ్ పనులు సాగుతున్నాయి. ఎలక్ట్రికల్, కలరింగ్ పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ప్లంబింగ్, సానిటేషన్, విండోస్, డోర్స్, గార్డెనింగ్, కలెక్టరేట్ చుట్టూ రహదారుల నిర్మాణం, ఎలివేషన్తోపాటు ఇతర పనులు ఇంకా మొదలే కాలేదు. ఆయా కార్యాలయాల్లో అధికారులు, సిబ్బందికి అవసరమైన ఫర్నీచర్ పనులతోపాటు కలెక్టర్, ఇద్దరు అదనపు కలెక్టర్ల క్యాంపు కార్యాలయాలు, రెండు మీటింగ్ హాళ్ల నిర్మాణం కూడా చేయాల్సి ఉన్నది.
ఇవన్నీ ఇప్పట్లో పూర్తవడం అసాధ్యమని ప్రభుత్వ అధికారులే పేర్కొంటుండడం గమనార్హం. అయితే, ముందుగా ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ పనులు పూర్తి చేసి, ఇతరచోట్ల కొనసాగుతున్న కార్యాలయాలు తరలించి, ప్రజల ఇబ్బందులకు పరిష్కారమార్గం చూపాలనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి వస్తున్నది. మరో 25 రోజుల్లో ఆ పనులైనా పూర్తి చేసి సమీకృత భవనం ప్రారంభించాలని అటు అధికారులు, ఇటు ప్రజలు కోరుతున్నారు.