కాంగ్రెస్ అలసత్వం.. కరీంనగర్ నియోజకవర్గానికి శాపంలా మారింది. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఆశల పల్లకి ఎక్కించిన సర్కారు, ఆ తర్వాత చోద్యం చూస్తున్నది. కరీంనగర్ రూరల్ మండలంలో పైలెట్ గ్రామం బహదూర్ఖాన్పేట మినహా 13 గ్రామాల్లో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకపోవడం నిర్లక్ష్యానికి అద్దంపడుతున్నది. ఖాళీ స్థలం ఉంటేనే ఇల్లు వస్తుందనే మాటలతో ఎంతో మంది శిథిలావస్థలో ఉన్న నివాసాలను కూల్చుకొని నెలల తరబడి నిరీక్షిస్తూ, కిరాయికి ఉండాల్సిన దుస్థితి దాపురించింది. ఇందిరమ్మ కమిటీలు లేకపోవడమే అందుకు కారణమని తెలుస్తుండగా, యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి గూడు గోస తీర్చాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
కరీంనగర్ రూరల్, సెప్టెంబర్ 17: కరీంనగర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం పేదలు ఎదురుచూస్తున్నారు. నెలల తరబడిగా నిరీక్షిస్తున్నారు. గూడు లేని ప్రజలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరీంనగర్ రూరల్ మండలంలోని పేద ప్రజలు తమ సొంతింటి కల నెరవేరుతుందని సంబురపడ్డారు. ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహించగా, మండలంలో 14 గ్రామాల నుంచి మొత్తం 9వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు సర్వే చేశారు.
అందులో 3,119 మందిని అర్హులుగా గుర్తించారు. అయితే ఇందిరమ్మ కమిటీలు లేకపోవడంతో ఇప్పటివరకు పైలెట్ గ్రామం బహదూర్ఖాన్పేట మినహా మరే గ్రామంలో ఏ ఒక్కరికీ ప్రొసీడింగ్ పత్రాలు అందజేయలేదు. బహదూర్ఖాన్పేటలో 106 మందికి మంజూరు చేయగా, ప్రస్తుతం 66 ఇండ్లు నిర్మాణంలో ఉండగా, మిగతా గ్రామాల్లో మాత్రం ఎదురుచూపులే మిగిలాయి. సర్వే సమయంలో ఖాళీ స్థలం ఉంటేనే ఇల్లు మంజూరవుతుందనే నిబంధనతో చాలా మంది పేదలు తమ పాత ఇండ్లు, శిథిలావస్థలో ఉన్న వాటిని కూల్చివేసుకున్నారు.
చెర్లభూత్కూర్లో 20 మంది, నగునూర్లో 22 మంది, మొగ్దుంపూర్లో 16 మంది, ఆయా గ్రామాల్లోనూ పలువురు ప్రొసీడింగ్లు రాకముందే డిస్మెటల్ చేసుకొని ఇండ్ల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి, మంత్రులను కలిసి విన్నవిస్తే.. ‘ఇదిగో వస్తుంది.. అదిగో వస్తుంది’ అనడం తప్ప వచ్చేది లేదు, ఇచ్చేది లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రొసీడింగ్లు ఇప్పించాలని కోరుతున్నారు. కాగా, ఇందిరమ్మ కమిటీల నియామకం జరిగితేనే ఇండ్ల మంజూరు పత్రాలు లబ్ధిదారులకు అందజేసే వీలుంటుందని గృహనిర్మాణ సంస్థ అధికారులు చెబుతున్నారు.
మాది పేద కుటుంబం. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నం. ఇండ్ల జాబితాలో పేరు వచ్చిందన్నరు. చాలా సంతోషమనిపించింది. ఖాళీ స్థలం చూపిస్తేనే ఇల్లు మంజూరైతదని అధికారులు అన్నరు. ఊళ్లో చాలా మంది పాత ఇంటిని తీసేస్తున్నరని తెలిసి మా ఇంటిని కూల్చుకున్నం. ఐదు నెలలైతంది. ఇల్లు ఇయ్యలే. రేకుల షెడ్డు వేసుకొని ఉంటున్నం. అధికారులు కనికరించి ప్రొసీడింగ్ పేపర్ ఇయ్యాలె.
ఇందిరమ్మ ఇల్లు అచ్చిందని, ముగ్గు పోస్తామని చెప్పి పాత ఇల్లును కూల్చివేయించిన్రు. నాలుగు నెలలు అయింది ఇల్లు రాలె. సార్లు వచ్చి ఫొటోలు తీసుకొని పోవుడు తప్ప శాంక్షన్ మాత్రం అయితలేదు. ఉన్న మంచి ఇల్లు కూల్చి అడవిలో పడ్డట్టు అయింది. ఇప్పుడు ఇల్లు లేక అమ్మవాళ్ల ఇంట్లో ఉంటున్న. ఇప్పటికైనా మాకు ఇందిరమ్మ ఇల్లు అందించాలని కోరుతున్న.
– న్యాలం రజిత (చెర్లభూత్కూర్) అడవిలో పడ్డట్టయింది
ఇందిరమ్మ ఇల్లు వస్తుందంటే చానా సంబురపడ్డం. ఖాళీ జాగ ఉండాలంటే పాత ఇల్లు కూలగొట్టుకున్నం. అధికారులు వచ్చి ఫొటోలు తీసుకుని పోయిన్రు. నాలుగు నెలల నుంచి ఎదురు సూసుడే అయితాంది. ఇల్లు రాలె. రేకులు వేసుకుని ఉంటున్నం. ఇప్పుడేమో ఓట్లు అయిన తరువాత ఇల్లు వస్తుందంటున్నారు. వెంటనే ఇయ్యాలె.
– మేడిపల్లి అంజమ్మ (నగునూర్)