కరీంనగర్, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు రైతులకు సున్నం పెడుతున్నది. 2 లక్షలలోపు మూడు దఫాల్లో మాఫీ రుణమాఫీ చేస్తున్నామని గొప్పలు చెబుతున్నా, పథకం అమలుకు సవాలక్ష ఆంక్షలు పెట్టింది. ఇప్పటి వరకు లక్ష, లక్షన్నరలోపు మాఫీ చేసిన విషయం తెలిసిందే కాగా, క్షేత్రస్థాయిలో మెజార్టీ రైతులకు నిరాశే మిగిలింది. తమకు మాఫీ కాలేదంటూ పెద్ద సంఖ్యలో రైతులు బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరగడం కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ జాబితాలో పేరు లేని రైతులు సహాయ కేంద్రాల్లో ఫిర్యాదు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా పెద్ద సంఖ్యలో రైతులు రుణమాఫీ అంశంపై గ్రీవెన్స్‌సెల్‌ను ఆశ్రయిస్తూ ఫిర్యాదులు చేస్తుండగా, 33 రకాల సాకులు చూపి మాఫీ ఎగ్గొట్టినట్టు వెలుగులోకి వస్తున్నది.
రుణమాఫీ కాలేదని రైతులు వచ్చి ఆరా తీస్తే.. సిబ్బంది ఆన్లైన్ డాటాబేస్‌లో పరిశీలించి వివరాలను నమోదు చేస్తున్నారు. అయితే రుణమాఫీ కాకపోవడానికి కారణాలు అంటూ ప్రభుత్వం ఇచ్చిన అప్లికేషన్లో 33 కాలమ్స్‌ను చూసి రైతులతోపాటు అధికారులు సైతం విస్తుపోతున్నారు. గ్రీవెన్స్‌సెల్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో ఉన్న రుణమాఫీ గల్లంతుకు కారణాల లిస్టులో విచిత్రమైన అంశాలు చేర్చారు. టూ బీ ప్రాసెస్డ్, ఇన్వాలీడ్ ఆధార్, నోడాటా ఫౌండ్, రిమిటెడ్, రుణఖాతా పేరులో తేడా, కుటుంబ సభ్యుల నిర్ధారణ, కుటుంబ సభ్యుల్లో ప్రభుత్వోద్యోగి, పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్‌కార్డు పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్, కుటుంబంలో సర్వీస్ పింఛన్‌దారుడు, రేషన్ కార్డు లేకపోవడం, డీబీటీ ఇష్యూ, ఫార్మర్ డెత్, విరాసత్ ఇష్యూ, భార్యాభర్తల జాయింట్ అకౌంట్.. ఇలా మొత్తంగా 33 కాలమ్స్‌ను పేర్కొన్నారు. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, రుణమాఫీ కాకపోవడానికి ఏది కారణమో గుర్తించి ఆ కాలమ్‌లో నమోదు చేస్తున్నారు. దీనిని చూసి రైతులు మండిపడుతున్నారు. రుణమాఫీ ఎగ్గొటేందుకు ప్రభుత్వం 33 తూట్లు పెట్టిందని విమర్శిస్తున్నారు.
రుణమాఫీ చేస్తున్నామని కాంగ్రెస్ సర్కారు గొప్పలు చెబుతున్నా.. అమలుకు మాత్రం సవాలక్ష కొర్రీలు పెట్టింది. ఎన్నికల ముందు ఎలాంటి షరతులు లేకుండానే మాఫీ చేస్తామని గొప్పలు చెప్పి, తీరా 33 రకాల సాకులు చూపి రైతు నోట్లో మట్టికొట్టింది. రేషన్ కార్డు లేకున్నా.. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేదా సర్వీస్ పింఛన్, మాఫీ జాయింట్ అకౌంట్, పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉండడం, ఆధార్ కార్డు లేకపోవడం ఇలా ఎన్నో రకాల సాకులు చూపి మాఫీకి మంగళం పాడింది. రైతులు గ్రీవెన్స్ సెల్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తుండగా, ఇవన్నీ బయటపడుతున్నాయి. అధికారులు చెబుతున్న కారణాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. దేశానికి అన్నం పెడుతున్న రైతులకు రేవంత్ ప్రభుత్వం సున్నం పెట్టే పనులు చేస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
..చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు రాగిని నవ్య. ఊరు ధర్మపురి మండలం దొంతాపూర్ పరిధిలోని ఎడపెల్లి. ఆమె భర్త కిష్టయ్యకు గ్రామంలో 5.25 ఎకరాల భూమి ఉన్నది. బతుకు దెరువు కోసం కిష్టయ్య చాలా ఏండ్లుగా దుబాయ్‌కి వెళ్తున్నాడు. నవ్య ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయం చేస్తున్నది. అయితే భూమి మొత్తం కిష్టయ్య పేరుమీదే ఉండగా, రెండేండ్ల క్రితం స్వగ్రామానికి వచ్చినప్పుడు జగిత్యాల ఎస్బీఐలో 96వేలు పంట రుణం తీసుకున్నాడు. తన పేరిట ఖాతా తెరిస్తే తాను దుబాయ్ వెళ్లిన పంట రుణం చెల్లించడం సాధ్యంకాదని తన భార్య నవ్యతో కలిసి జాయింట్ అకౌంట్ తెరిచాడు. దాని ద్వారానే లోన్ వడ్డీని చెల్లించడంతో పాటు రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో కిష్టయ్య, నవ్య సంబురపడ్డారు. తొలి జాబితాలోనే తమ పేరు వస్తుందనుకుంటే జాబితాలో లేదు. అధికారులను కలిసి అడిగితే రెండో విడుతలో వస్తదని చెప్పడంతో ఆశగా ఎదురు చూశారు. అందులోనూ రాకపోవడంతో నిరాశ చెందారు. జగిత్యాల కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌సెల్‌కు నవ్య వచ్చి ఫిర్యాదు చేయగా, పరిశీలించిన సిబ్బంది, భార్యాభర్తల పేరిట ఉమ్మడి ఖాతా ఉండడం వల్లే మాఫీ కాలేదని చెప్పడంతో విస్తుపోయింది. ఉమ్మడి ఖాతా ఉంటే రుణమాఫీ కూడా జరగదా..? అని ప్రశ్నించగా, అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు.
ఉమ్మడి జిల్లాలో రుణ మాఫీ కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్స్‌కు వచ్చి తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఇటు రైతు వేదికల వద్దకు వెళ్లి సంబంధిత అధికారులకు వినతులు ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 6010 ఫిర్యాదులు వచ్చాయి. జగిత్యాల జిల్లాలో మంగళవారం రాత్రి వరకు 2,500 ఫిర్యాదులు రాగా, బుధవారం వరకు కరీంనగర్ జిల్లాలో 1,445, పెద్దపల్లి జిల్లాలో 1480, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 585 వచ్చాయి. అయితే రైతు రుణమాఫీ కాకపోవడానికి సంబంధించిన 33 కాలమ్స్‌లో ఎనిమిది విభాగాల్లోనే అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్నట్టు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఆ అంశాల వల్లే మాఫీ జాబితాలో పేర్లు మిస్ అయ్యాయని పేర్కొంటున్నారు. టూ బీ ప్రాసెస్డ్, నోడాటా ఫౌండ్ కాలమ్, ఆధార్-రుణఖాతాలో పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్, ఆధార్-పట్టాదారు పాస్ పుస్తకంలో స్పెల్లింగ్ మిస్టేక్స్, కుటుంబ సభ్యుల నిర్ధారణ, నో పట్టాదార్ పాసు పుస్తకం, కుటుంబ సభ్యుల్లో ఉద్యోగం, కుటుంబ సభ్యుల్లో సర్వీస్ పెన్షన్, డీబీటీ ఇష్యూస్.. కారణంగా ఎక్కువ మంది పేర్లు జాబితాల్లో గల్లంతైనట్లు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా అందరికీ రుణమాఫీ చేస్తామని, షరతులు లేవని చెప్పిన ప్రభుత్వం, తీరా 33 అంశాలను పరిగణలోకి తీసుకొని జాబితాను ప్రకటించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన పని వల్ల వేలాది మంది రైతుల పేర్లు జాబితాలో గల్లంతయ్యాయని ఆవేదన చెందుతున్నారు. గ్రీవెన్స్ సెల్‌కు వచ్చి నమోదు చేసుకుంటున్న రైతులు యాభై అరవై శాతం మందేనని, మరో నలభై శాతం మంది రైతులకు అవగాహన లేక కనీసం ఫిర్యాదు చేయడానికి సైతం రావడం లేదంటున్నారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు అనుపురపు రాజనర్సు. ఊరు సారంగాపూర్ మండలం లచ్చక్కపేట. ఆయనకు ఇద్దరు కొడుకులు శంకర్, తిరుపతి. ఈ ముగ్గురికీ పట్టాభూములున్నాయి. వేర్వేరు రేషన్‌కార్డులు ఉన్నాయి. రాజనర్సుకు ఎకురంన్నర భూమి ఉండగా, జగిత్యాలలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో రెండేండ్ల క్రితం 92వేలు పంట రుణం తీసుకున్నాడు. ఆయన కొడుకులైన అనుపురపు శంకర్, తిరుపతి పేరిట చెరో 30 గుంటల భూమి ఉండగా, వారు సైతం బ్యాంకులో చెరో 30వేలు రుణం తీసుకున్నారు. అయితే ముగ్గురికీ రుణమాఫీ కాలేదు. రెండు జాబితాల్లోను వారి పేరు లేకపోవడంతో రాజనర్సు గ్రీవెన్‌సెల్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. పరిశీలించిన అధికారులు రాజనర్సు పేరిట పట్టాదారు పాస్‌పుస్తకం లేదని, అలాగే శంకర్, తిరుపతిల పేరిట సైతం పట్టాదారు పాస్‌పుస్తకం నాట్ ఫౌండ్ అని చూపిస్తున్నదని, అందుకే రుణమాఫీ కాలేదని చెప్పడంతో బిత్తరపోయాడు. ‘అదేంటి సార్.. పట్టాదార్ పాస్ పుస్తకం లేకపోతే అసలు నాకు లోన్ ఎట్లా ఇస్తారు? పాస్‌పుస్తకం ఇస్తేనే కదా నాకు లోన్ ఇచ్చిన్రు. ఇప్పుడు లేదనడం ఏంటీ?’ అని ఆగ్రహించాడు. చేసేదేమీ లేక నిరాశగా వెనుదిరిగాడు.
నాము లక్ష్మీరాజంది జగిత్యాల మండలం పొరండ్ల. ఊళ్లో 30 గుంటల భూమి ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 30వేలు లోన్ తీసుకున్నాడు. కానీ, రుణమాఫీ కాలేదు. ఎందుకు కాలేదో అర్థం కాలేదు. కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. పరిశీలించిన అధికారులు, రేషన్‌కార్డు లేదని అందుకే మాఫీ జాబితాలో పేరు లేదని చెప్పడంతో కంగుతిన్నాడు.
వేములవాడ, ఆగస్టు 7 : రుణమాఫీ కాని రైతుల నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు రాష్ట్ర సర్కారు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసింది. కానీ, క్షేత్ర స్థాయిలో చూస్తే కొన్ని చోట్ల అసలు ఆ కేంద్రాలు తెరుచుకోవడం లేదు. వేములవాడ తహసీల్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన కేంద్రం బుధవారం ఓపెన్ కాలేదు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన రైతులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.
ఖరీమొద్దీన్ది మరో కథ. జగిత్యాల రూరల్ మండలానికి చెందిన ఆయనకు గ్రామంలో రెండెకరాల భూమి ఉంది. బతుకుదెరువు కోసం రెండేండ్ల క్రితం మస్కట్‌కు వెళ్లాడు. అయితే స్వగ్రామంలో ఉన్న సమయంలో పంట రుణంగా 80వేలు తీసుకున్నాడు. ఖరీమొద్దీన్ భార్యనే ఎవుసం చేస్తది. పంట రుణ వ్యవహారం కూడా చూసుకుంటున్నది. కాగా, రుణమాఫీలో ఖరీమొద్దీన్ పేరు లేకపోవడంతో కార్యాలయానికి వచ్చి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది. అయితే సిబ్బంది పరిశీలించి ఆధార్‌కార్డులో ఉన్న పేరుకు, పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న పేరుతో సరిపోవడం లేదని, ఒక్క అక్షరం తేడాగా ఉందని, అందుకే మాఫీ కాలేదని చెప్పడంతో బిత్తరపోయింది. అదేంటి సార్ స్పెల్లింగ్ మిస్టేక్, ఒక్క అక్షరం తేడా ఏంటీ సార్, అలా ఉంటుందా సార్ అంటూ వాపోయింది.