Putta Madhukar | మంథని, జూలై 14: బీసీలకు 42శాతం రిజర్వేషనంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అవళీలగా మోసం చేసేందుకు సిద్ధంగా ఉందని.. ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో చెప్పింది ఒకటి.. అధికారంలోకి వచ్చిన తరువాత నేడు చేస్తున్నది మరోకటి అంటూ మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
జూలూరు గౌరీ శంకర్ రచించిన బహుజన గణమన అనే పుస్తకాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ స్థానిక జ్యోతిబాపూలే విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో అంటూ పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతున్న తీరు వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ గాంధీ నేతృత్వంలో నడుస్తున్న తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పేరుతో మళ్లీ అవళీలగా మోసం చేసేందుకు సిద్ధమవుతున్నదన్నారు.
కాంగ్రెస పార్టీ ఎన్నికల సమయంలో ఎంబీసీ, మున్నూరు కాపు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలవుతున్నా వాటి గురించే పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించక పోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హైకోర్టు చివాట్లు పెట్టడం వల్లనే హడావుడిగా ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమవుతుందన్నారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం జీవోలు, ఆర్డినేన్స్ల పేరుతో మోసం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు.
ప్రస్తుతం యువకులు కంప్యూటర్ యుగంలో జీవిస్తున్నారని భారత దేశం మౌళిక సిద్ధాంతాలు కూడ తెలియకుండా కేవలం చదువు, ఉద్యోగం కోసం మాత్రమే తాపత్రేయ పడుతున్నారన్నారు. దీన్ని వల్ల దేశంలో కులాలు, మతాలు ఏ విధంగా నడుస్తున్నాయో తెలియకుండా పోతున్నదని, దీనిని అసరా చేసుకునే కొంత మంది మోసం చేసిన వాళ్లే మోసం చేయడడానికి సిద్ధంగా ఉంటున్నారన్నారు. దీనికి నిలువెత్తు నిదర్శనమే మంథని నియోజకవర్గంలో ఒకే కుటుంబం అనేక సార్లు అధికారంలో ఉండటానికి నిదర్శనమన్నారు. నేటి సమాజంలో బీసీ పరిస్థితులు.. బీసీలకు దక్కాల్సిన గౌరవం.. చట్ట సభలో వారి వాటా వంటి వాటిపై బీసీలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే విధంగా జూలూరు గౌరీ శంకర్ బహుజన గణమన అనే అద్భుతమైన పుస్తకాన్ని రచించారన్నారు.
ఈ పుస్తకంలో చట్ట సభలకు పెద్ద కులాలు, బహిరంగ సభలకు బీసీ కులాలు, ఇంకా ఇది చెల్లదు గాక చెల్లదనే అనే గొప్ప విషయాలను పొందుపర్చారన్నారు. బీసీ కమీషన్ మెంబర్, కవి, రచయితగా బజనుల కోసం అనేక విధాలుగా కృషి చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి జూలురు గౌరీ శంకర్ అని పుట్ట మధూకర్ కొనియాడారు. రూ.లక్షల ఖర్చు పెట్టి బీసీలను చైతన్య వంతులను చేసేందుకు పుస్తకాన్ని రచించిన గౌరీ శంకర్ బహుజన గణమన పుస్తకాన్ని ప్రతీ ఒక్కరు చదవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎగోలపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, ఆరెపల్లి కుమార్, యాకుబ్, జంజర్ల శేఖర్, వెల్పుల గట్టయ్య, ఆకుల రాజబాపు, గొబ్బూరి వంశీ, తిరుపతి, ఆసీఫ్లతో పాటు తదితరులు పాల్గొన్నారు.