Chigurumamidi | చిగురుమామిడి, అక్టోబర్ 10: బలహీన వర్గాలకు చెందిన బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు పేరుతో మోసం చేస్తుందని బిఆర్ఎస్ అనుబంధ బీసీ సెల్ మండల అధ్యక్షుడు అనుమాండ్ల సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి బీసీ నాయకులతో కలిసి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ హైకోర్టు గడువు ముగుస్తుందని 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించి, మళ్లీ కొందరు వ్యక్తులచే కోర్టులో పిటిషన్ వేయించిన ఘనత కాంగ్రెస్ కె దక్కుతుందన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదని, పేద ప్రజల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందన్నారు. ఎంతో ఆశతో బీసీలు 42 శాతం రిజర్వేషన్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారని, ఆశలను అడియాసలు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందన్నారు. కాంగ్రెస్ కు కనువిప్పు కలగాలని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని అన్నారు.
మండలంలో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడిస్తామన్నారు. వీరి వెంట బిఆర్ఎస్ బిసి నాయకులు సన్నిళ్ల వెంకటేశం, మెడబోయిన తిరుపతి, పిల్లి వేణు, పెద్దపల్లి అరుణ్ కుమార్, చింతపూల ఆంజనేయులు, కాశబోయిన నర్సయ్య, ఏండ్ర నారాయణ, ఆర్కేచారి, తిరుపతి, ఆగయ్య, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.