Peddapally | పెద్దపల్లి టౌన్ జూన్ 25. తెలంగాణ రాష్ట్రంలోని దళిత గిరిజన విద్యార్థుల విద్యపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మోదంపల్లి శ్రావణ్, ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి అశోక్ ఆరోపించారు. పెద్దపెల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట బెస్ట్ అవైలబుల్ స్కీం ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులతో కలిసి బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు శ్రావణ్, అశోకు మాట్లాడుతూ దళిత, గిరిజన విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా చదువుతున్న విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ విద్యా సంవత్సరానికి పాఠశాలల నిర్వాహకులు యాజమాన్యాలు, బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ఎంపికైన విద్యార్థులను చేర్చుకోకుండా, పుస్తకాలు, యూనిఫారం,బూట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ స్పందించి ఈ విద్యాసంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ విద్యార్థులను పాఠశాలల్లోకి అనుమతించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కేవీపీఎస్ నాయకులు రవి, శ్రీనివాస్, గీత, సురేష్, ప్రవీణ్, ప్రసాద్, రజిత తదితరులు పాల్గొన్నారు.