తెలంగాణచౌక్, ఫిబ్రవరి14: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను విచ్ఛినం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర పన్నుతున్నదని ఆర్టీసీ జేఏసీ రీజినల్ చైర్మన్ ఎంపీ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 14నెలలు పూర్తయిందని.. ఇంకెప్పుడు 3వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఎలక్ట్రికల్ అద్దె బస్సులను రద్దు చేయాలన్నారు.
ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని వన్, టూ డిపోల ఎదుట శుక్రవారం సమ్మె డిమాండ్లతో కూడిన కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సమ్మెలో పాల్గొంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కొమురయ్య, కో కన్వీనర్లు పుల్లయ్య, ప్రకాశ్ పాల్గొన్నారు.