కలెక్టరేట్, మార్చి 20 : ‘ఏరు దాటే దాకా ఓడమల్లన్న.. ఏరు దాటినంక బోడమల్లన్న’ అన్నట్టున్నది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. ఎన్నికల ముందు అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కారు ఆచరణలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఉద్యోగ విరమణ సాయం అందిస్తామని మ్యానిఫెస్టోలో చేర్చింది. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చెయ్యి చూపింది. పాత పద్ధతిలోనే టీచర్లకు రూ.లక్ష, ఆయాలకు ₹50 వేలు అందిస్తుంది. అవి కూడా ఎప్పుడందుతాయో అటు అధికారులకు, ఇటు రిటైర్ అయినవాళ్లకు తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, నామమాత్రపు సాయంపై అంగన్వాడీలోకం పెదవి విరుస్తున్నది.
వారి కష్టాన్ని గుర్తించిన కేసీఆర్..
ఇచ్చిన హామీ నెరవేర్చాలని లేకుంటే వరుస ఆందోళనలు చేపడుతామంటూ టీచర్లు, ఆయాలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడం, సర్కారు అమలు చేసే కార్యక్రమాలపై అవగాహన కల్పించడం, చిన్నారులకు చదువు చెప్పడంతోపాటు వారి ఆలనాపాలన చూడడం, ఓటరు జాబితాల తయారీ, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం ఇలా అంగన్వాడీ టీచర్లు పుట్టెడు కష్టం చేస్తున్నారు. వీరి సేవలను గుర్తించిన కేసీఆర్ సర్కారు వారు ఆశించినదానికంటే మించి గౌరవ వేతనం పెంచింది. వారి విజ్జప్తి మేరకు 2023 మేనెలలో టీచర్లకు లక్ష, ఆయాకు ₹50వేలు, ఆసరా పింఛన్ మంజూరు, బీఎల్వో విధుల రద్దు, అంగన్వాడీ కేంద్రాల పనులు మినహా ఇతర ప్రభుత్వ విభాగాల పనులేవి అప్పగించబోమంటూ హామీ ఇచ్చింది.
న్యాయం చేస్తామని నమ్మబలికి..
అలాగే, ప్రభుత్వ టీచర్ల మాదిరి వేసవి సెలవులు వర్తింపజేసేందుకు అంగీకరించి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ రాజకీయ క్రీడకు తెరలేపింది. అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తామని, కనీస వేతన చట్టం అమలు చేస్తామని ప్రకటించి ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీలపై సానుభూతిని ఒలకబోసింది. న్యాయం చేస్తామని నమ్మబలికింది. ఇక దశ మారినట్టేనని సంబురపడుతున్న తరుణంలో వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఈ నేపథ్యంలో మరోసారి ఉద్యమ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టేకుమళ్ల సమ్మయ్య బుధవారం తెలిపారు.