BC reservations | పెద్దపల్లి కమాన్, నవంబర్ 26 : స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషను ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే మాట తప్పిందని జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ దాసరి ఉషా మండిపడ్డారు. పెద్దపల్లి బసుస్టాండ్ వద్దగల అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను బుధవారం దహనం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉషా మాట్లాడుతూ బీసీలకు రాజ్యాంగపరంగా దక్కాల్సిన 42శాతం రిజర్వేషన్ల కోసం పార్టీలతో సంబందం లేకుండా మద్దతు లభించిందన్నారు. అయినా న్యాయపర చిక్కులను సాకుగా చూపుతూ బీసీ రిజర్వేషన్లను అగ్రవర్ణాలు ఆపుతున్నాయని దుయ్యబట్టారు. జీవోనం.9 రద్దు చేసి, కొత్త జీవోను ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ కుటిలనీతికి అద్దం పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 42శాతం రిజర్వేషన్లు జనాభాపరంగా బీసీలకు హక్కుగా దక్కాల్సినవని, అవి పాలకులు వేసే బిక్షంకాదని స్పష్టం చేశారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతీ బీసీ తీవ్రంగా ప్రతిఘటించాలని ఉషా పిలుపునిచ్చారు. ప్రతీ ఇంటినుండి ఒక బీసీ యోధుడు బయటకు వచ్చి సత్తాచాటలని ఆమె కోరారు. ఈ నిరసనలో వర్కింగ్ చైర్మన్ నల్లవెల్లి శంకర్, వైస్ చైర్మన్ కొండి సతీష్, కన్వీనర్లు సలేంద్ర కొమురయ్య, భూమేష్, ఆసరి రాజయ్య యాదవ్, కన్న రమేష్ గౌడ్, తోట రాజ్ కుమార్, భూమయ్య, కొండయ్య, అలువాల రాజేందర్, కలవేన రాజేందర్, అశోక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.