కొత్తపల్లి, జనవరి 8: కరీంనగర్‌ను అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. ఆ పార్టీకి కరీంనగర్ నుంచి ఓట్లు రాకపోవడంతో ప్రజాప్రతినిధులు వివక్ష చూపుతున్నారని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. బుధవారం నగరంలోని 12వ డివిజన్లోని వెంకటేశ్వర కాలనీకి సంబంధించిన కమాన్ ప్రారంభించారు. అనంతరం 27లక్షల సాధారణ నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. 16వ డివిజన్లోని పద్మనగర్ జంక్షన్ వద్ద అన్నమయ్య ఐలాండ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం అస్సూరెన్స్ నిధుల కింద ఏటా 100కోట్ల చొప్పున సుమారు 350కోట్లు విడుదల చేసి కరీంనగరాన్ని హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. అలాగే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, స్మార్ట్‌సిటీ నిధులతో అభివృద్ధి వేగంగా జరిగిందన్నారు. కానీ, అమలుకు సాధ్యంకాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సీఎం అస్యూరెన్స్ నిధులను నిలిపివేయడంతో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. తమ హయాంలో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి పదెకరాల స్థలం కేటాయించామని.. ఏపీ సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్‌ను కలిసి ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరామని చెప్పారు.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదన్నారు. 2016 నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను తాము విజయవంతంగా నిర్వహించామన్నారు. వచ్చే ఫిబ్రవరిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదన్నారు. గతంలో నగరంలో కళోత్సవాలు, సినిమా విజయోత్సవాలుంటే.. ఇప్పుడు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ సునీల్‌రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు తోట రాములు, బోనాల శ్రీకాంత్, నాంపల్లి శ్రీనివాస్, దిండిగాల మహేశ్, కొత్తపల్లి మాజీ వైస్ ఎంపీపీ తిరుపతినాయక్, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
కక్ష సాధింపుతోనే కేటీఆర్‌పై కేసు
కాంగ్రెస్ రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నది. అందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసులు నమోదు చేస్తున్నది. అధికారం ఉంది కదాఅని బీఆర్ఎస్ నాయకులపై కేసులు అక్రమంగా బనాయిస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మాపై ఎన్ని కేసులు పెట్టిన భయపడే ప్రసక్తే లేదు. న్యాయస్థానాలపై మాకు అపారమైన నమ్మకం ఉన్నది. ఈ కార్ రేసులో కేసులో కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తరు.
– గంగుల కమలాకర్