
KTR | రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 6( నమస్తే తెలంగాణ )/వేమువాడ : కాంగ్రెస్ పార్టీ, బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో వేములవాడ పట్టణంలో శుక్రవారం నిర్వహించుకుని మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాలపైన విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ పార్టీ దొంగ మాటలతో అధికారంలోకి వచ్చి అడ్డగోలు హామీలు చెప్పి పదవి ఎక్కిన తర్వాత ప్రజల్ని మోసంచేస్తున్నదన్నారు.
వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎన్నికల సందర్భంగా బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చి ఆరు గ్యారెంటీలు అన్నింటిని వంద రోజుల్లో అమలు చేస్తానని చెప్పిన విషయాన్ని ఆ సందర్భంగా ఆది శ్రీనివాస్ ఇచ్చిన బాండ్ పేపర్ ని ప్రజల ముందు చూపిస్తూ కేటీఆర్ మాట్లాడారు. ఈసారి తనకు ఓటు వేయకుంటే చనిపోతానని నాలుగు సార్లు ఓడిపోయినా అని చెప్పి సానుభూతి డైలాగులతో ఆరోజు ప్రజలను మభ్యపెట్టిన ఆది శ్రీనివాస్ ఆ తర్వాత హామీల అమలు నుంచి మొదలుకొని అభివృద్ధి వరకు అడ్రస్ లేకుండా పారిపోయాడన్నారు. మరోవైపు కేవలం మంత్రి పదవి కావాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకుంటున్న ఆది శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గానికి ఏమి చేశారో చెప్పాలన్నారు.
ఇస్తామన్న ఆరు గ్యారెంటీలలో కనీసం ఒక్కదాన్నైనా అమలు చేశారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకవేళ ఇన్ని రకాల మోసాల తర్వాత, ద్రోహాల తర్వాత కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు మేము చేస్తున్నదే సరైంది అని, ప్రజలు కాంగ్రెస్ కి అనుకూలంగా తీర్పు ఇస్తున్నారని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నదని, హామీల అమలు పైన భవిష్యత్‌లోనూ దృష్టి పెట్టే అవకాశమే ఉండదని కేటీఆర్ హెచ్చరించారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీలు ముఖ్యంగా రూ.4వేల పింఛన్, ఆసరా పింఛన్ నుంచి మొదలుకొని రైతు భరోసా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం రావాలన్నా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని, అప్పుడే తాము చేస్తున్న మోసాల పైన ప్రజలు కోపంగా ఆగ్రహంగా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకుంటుందన్నారు.
మరోవైపు ఇదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చేసింది ఏమీ లేదని, తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ఎలాంటి లబ్ధి చేయలేదన్నారు. ప్రతీ ఇంటికి రూ.15 లక్షలు ఇస్తానని చెప్పిన మోదీ ఆ తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ పక్కన పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ప్రతీసారి ఎన్నికలు రాగానే దేవుడి పేరు చెప్పి కులం, మతం పేరు చెప్పి బీజేపీ ఓట్లు ప్రజలతో వేయించుకుంటుందని కేటీఆర్ విమర్శించారు. ఈసారి కూడా బీజేపీ దొంగ మాటలకు మోసపోవద్దని, కేవలం పేదోళ్ల కడుపులు నింపి తండ్రి లెక్క చూసుకొని తెలంగాణ తెచ్చిన వారెవరో గుర్తుంచుకొని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలన్నారు.
ఈ ఎన్నికల్లో ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడితేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటో అర ఆరు గ్యారెంటీలు అమలు పైన దృష్టి సారిస్తుందన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో వేసే ఓటుతో మరోసారి కేసీఆర్‌ని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునే ప్రస్థానం ప్రారంభం కావాలని కేటీఆర్ అన్నారు. వేములవాడలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు స్థానికంగా మున్సిపాలిటీకి పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఉన్నారు.