కరీంనగర్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్ల స్థలాలపై గందరగోళం నెలకొన్నది. కొన్నాళ్లుగా అధికారులు-జర్నలిస్టుల మధ్య అపరిష్కృతంగా ఉన్న ఇంటి స్థలాల సమస్యపై ప్రస్తుతం వివాదం చోటుచేసుకున్నది. గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన స్థలాలను తమకు స్వాధీనం చేయాలని కోరుతూ కొన్నాళ్లుగా జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే సమయంలో తమ సమస్యను పరిష్కరించి, కేటాయించిన స్థలం తమకు స్వాధీనం అయ్యేలా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఇప్పటికే పలుమార్లు కలిసి వినతి పత్రాలు సమర్పించారు. అయితే, రేపూ.. మాపూ.. అని చెప్పారే తప్ప అధికారులు ఈ సమస్యకు పూర్తి పరిష్కారం చూపలేదు. ఈ నేపథ్యంలో సోమవారం జర్నలిస్టులు ప్రజావాణికి వెళ్లి మరోసారి కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి, తమ స్థలాలు తమకు స్వాధీనం అయ్యేలా చూడాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జర్నలిస్టులకు మధ్య కొద్దిసేపు చర్చ నడిచింది. గతంలో కేటాయించిన స్థలాలు ప్రొసీజర్ ప్రకారం లేవని, కనుక రద్దు చేశామని, కొత్తగా వచ్చే నిబంధనలను పరిగణలోకి తీసుకొని ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని కలెక్టర్ చెప్పిన మాటలతో కూడిన వాయిస్‌ను జర్నలిస్టులు విడుదల చేశారు. రద్దు అయినట్టు కలెక్టర్ చెప్పడంతో జర్నలిస్టులు ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు. ఇదే సమయంలో కలెక్టర్ వాయిస్‌తో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, కలెక్టర్ వాయిస్ బయటకు రావడంతో గతంలో పట్టాలు పొందిన జర్నలిస్టులు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. నోటికాడికి వచ్చిన బుక్కను ఎత్తగొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను తెలుసుకున్న బీఆర్ఎస్ అధినాయత్వం సీరియస్‌గా స్పందించింది. జర్నలిస్టులపై వివక్ష ఎందుకంటూ ప్రశ్నించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, అలాగే మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం జర్నలిస్టుల పక్షాన నిలిచి, ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడంతో సమస్య తీవ్రరూపం దాల్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారయంత్రాగం ఆ తర్వాత జర్నలిస్టు స్థలాలపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ మాట్లాడుతూ, జర్నలిస్టుల స్థలాల రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ ఎక్కడా చెప్పలేదని వివరణ ఇచ్చారు.
కరీంనగర్లో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్ల స్థలాల పట్టాలను ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు సోమవారం ఒక ప్రకటనలో కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 118 మంది జర్నలిస్టులకు ఇచ్చిన నివాస స్థలాల పట్టాలను రద్దు చేస్తున్నట్టు వస్తున్న వార్తలు చాలా బాధాకరమన్నారు. ఇచ్చిన స్థలాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఎంతో ఆశతో ఆలోచిస్తున్న తరుణంలో ఇలా చేయడం శోచనీయమన్నారు. వెంటనే ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా మంత్రులు పునసమీక్షించి జర్నలిస్టులకు ఇచ్చిన పట్టాలను పునరుద్ధరించాలని కోరారు.
కరీంనగర్లో జర్నలిస్టుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకోవడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. సమాజహితం కోసం పనిచేసే జర్నలిస్టులకు ప్రభుత్వం స్థలాలను కేటాయించడాన్ని కూడా రేవంత్‌రెడ్డి సర్కారు జీర్ణించుకోలేక పోతున్నదని మండిపడ్డారు. హైదరాబాద్‌లో పేద ప్రజలను ఇళ్లను కూలగొడుతున్నారని, కరీంనగర్లో జర్నలిస్టుల స్థలాలను వెనక్కి తీసుకుంటున్నారని, అసలు ఇదేం పాలన అని ఆయన ప్రశ్నించారు. జర్నలిస్ట్‌ల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం, వారికి కేటాయించిన స్థలాలను రద్దు చేయడం సిగ్గు సిగ్గు అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే జర్నలిస్ట్‌లపై కక్షగట్టి ఈ చర్యకు పాల్పడ్డారని మండిపడ్డారు. తమకు ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయని సంతోషంలో ఉన్న జర్నలిస్ట్‌లకు పండుగ పూట రేవంత్‌రెడ్డి సర్కార్ షాక్ ఇచ్చిందన్నారు. ఈ అన్యాయంపై బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తుందన్నారు. ఈ సంఘటనను రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సంఘాలు ఖండించాల్సిన అవసరముందన్నారు. జర్నలిస్ట్‌లకు కేటాయించిన స్థలాల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్లో 118 మంది జర్నలిస్టులకు కేటాయించిన ఇండ్ల స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం శోచనీయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు అన్నారు. రేవంత్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చే దసరా కానుక ఇదేనా? అని ప్రశ్నించారు. కరీంనగర్ జర్నలిస్టుల ఇంటి స్థలాలను రద్దు చేసినట్టు తెలుసుకున్న హరీశ్‌రావు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షలో భాగంగానే బతుకమ్మ, దసరా పండుగల వేళ జర్నలిస్టుల కుటుంబాల్లో ఆవేదన మిగల్చడం బాధాకరమన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిత్యం శ్రమించే జర్నలిస్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న దుర్మార్గ వైఖరికి ఇదే నిదర్శనమని స్పష్టం చేశారు. జర్నలిస్టులు, వారి కుటుంబాలకు అన్యాయం చేయవద్దని, ప్రభుత్వం వెంటనే ఇండ్ల స్థలాల రద్దు ప్రకటనను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.
బతుకమ్మ పండుగ ముందర కరీంనగర్ జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు రద్దు చేసినట్టు తెలిసిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను మీ ప్రభుత్వం రద్దు చేయడం బాధాకరమైన విషయమన్నారు. అన్ని పథకాల్లో మహిళలకే ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ గత ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిందని, సీఎం హోదాలో మీరు, మీ మంత్రివర్గ సహచరులు సైతం ఇదే విషయాన్ని పదేపదే చెప్పారని గుర్తు చేశారు. కానీ, అందుకు భిన్నంగా తెలంగాణలో అతిపెద్ద పండుగలైన విజయదశమి, బతుకమ్మ పండుగ ముందట ఇండ్ల స్థలాలను రద్దు చేసి జర్నలిస్టు కుటుంబాల్లోని మహిళలను తీవ్ర మానసికక్షోభకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని లేఖలో ప్రశ్నించారు. నోటి కాడ ముద్ద లాగేసుకున్నట్టు మీ ప్రభుత్వం అనుసరించిన తీరు శోచనీయమన్నారు. బతుకమ్మ పండుగ ముందు జర్నలిస్టు ఇంట ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టే పరిస్థితి మంచిది కాదని సూచించారు. చాలీచాలని వేతనాలతో బతుకు సాగిస్తున్న జర్నలిస్టులకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రద్దు చేసిన ఇండ్ల పట్టాలను వెంటనే పునరుద్ధరించడంతోపాటు ఆ స్థలాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో మీరు సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని లేఖలో స్పష్టం చేశారు.
కరీంనగర్ జర్నలిస్టులకు బీఆర్ఎస్ సర్కారు అందించిన డబుల్ బెడ్రూం ఇళ్ల స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం దారుణమని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 118 మంది జర్నలిస్టులకు మల్కాపూర్, చింతకుంట గ్రామ శివారులో ఇళ్ల పట్టాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిందని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందన్నారు. జర్నలిస్టుల వివక్ష వద్దని, చిత్తశుద్ధి ఉంటే వారికి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జర్నలిస్టుల ఇళ్ల పట్టాలపై అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, ఇళ్ల స్థలాలు ఇప్పించి వాటిని నిర్మించే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. కరీంనగర్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై వెంటనే స్పందించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. దసరా పండుగ వేళ ఇళ్ల స్థలాల రద్దు వార్త జర్నలిస్టుల కుటుంబాల్లో ఆవేదనను నింపిందని, ఇది ప్రభుత్వాలకు మంచిది కాదని లేఖలో సీఎంకు సూచించారు. వెంటనే స్పందించి జర్నలిస్టుల పక్షాన నిలువాలని కోరారు. జర్నలిస్టులు కూడా ఆవేదన చెందవద్దని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల ఎన్వోసీ కోసం ప్రయత్నం చేస్తున్నామని, ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశామని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ తెలిపారు. సోమవారం రాత్రి ‘నమస్తే తెలంగాణ’తో ఫోన్లో మాట్లాడారు. జర్నలిస్టుల స్థలాలు రద్దు చేసినట్టు కలెక్టర్ పమేలా సత్పతి ఎక్కడా చెప్పలేదన్నారు. కేటాయించిన స్థలానికి సంబంధించి ఇంకా ఎన్వోసీ రాలేదని, ప్రస్తుతం ఆ ప్రయత్నంలో ఉన్నామని చెప్పినట్టు తెలిపారు. అంతేకాకుండా, వెంటనే ఆ ఫైల్ తెప్పించి, ఎన్వోసీ కోసం మరోసారి ప్రభుత్వానికి లేఖ రాయడంతోపాటు సదరు లేఖను జర్నలిస్టులకు ఇవ్వాలని, తద్వారా జర్నలిస్టులు కూడా ప్రభుత్వం వద్ద ఫాలోఅప్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని కలెక్టర్ తనను ఆదేశించారని వివరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజావాణి పూర్తయిన వెంటనే మరోసారి ప్రభుత్వానికి లేఖ రాయడానికి ఫైల్ ప్రిపేర్ చేశామని తెలిపారు. అంతే తప్ప ఎక్కడా జర్నలిస్టుల స్థలాలు రద్దు చేసినట్టు కలెక్టర్ మాట్లాడలేదన్నారు.
జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కరీంనగర్ జిల్లా రెవెన్యూ అధికారి పవన్ కుమా ర్ సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కరీంనగర్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇచ్చిన 118 పట్టాలకు సంబంధించి ఎస్ఆర్ఎస్పీ భూమి విషయంలో ఎన్వోసీ రావాల్సి ఉందని, అందుకోసం ప్రభుత్వానికి లేఖ రాస్తున్నామని ఆయన వివరించారు. ఎన్వోసీ రాగానే నిబంధనల ప్రకారం జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. పట్టాలు రద్దు చేసినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన ఖండించారు.