వేములవాడలో ప్రధాన రోడ్డు విస్తరణ అంశం వివాదమవుతోంది. బాధితుల అభిప్రాయాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండానే రోడ్డు విస్తరణ పనులకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత విలువ గల దుకాణాలు, స్థలం పోవడంతోపాటు తాము జీవనోపాధి కోల్పోతున్నామని, ఈ నేపథ్యంలో మార్కెట్ విలువకు మూడింతల అధిక పరిహారం ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నా.. అధికారయంత్రాంగం ఎటువంటి స్పష్టతా ఇవ్వకుండానే విస్తరణకు ముందుకు వెళ్తున్నదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, ఒప్పించి ముందుకు వెళ్లాలన్న డిమాండ్ వస్తుండగా.. అధికారులు ఎలా స్పందిస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది.
కరీంనగర్, మే 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ప్రధాన రహదారి విస్తరణ చేయడానికి గత కొంత కాలంగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే.. గత ప్రభుత్వాలు సైతం రహదారి విస్తరణ కోసం పలుమార్లు అంచనాలు వేయడం.. ఆ తదుపరి పలు కారణాలతో నిలిపివేసిన సందర్భాలున్నాయి. నిజానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రధాన రహదారిని విస్తరించడానికి చర్యలు తీసుకున్నది. కాగా, ప్రధాన రహదారి మొత్తం రోడ్డు భవనాల శాఖ పరిధిలో ఉండగా అప్పటి శాసనసభ్యుడు రమేశ్‌బాబు వేములవాడ ఆలయ ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థలోకి మార్చారు. ఇప్పుడు ఇదే రోడ్డు విస్తరణ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చింది. ఇందులో ప్రధాన రహదారి మూలవాగు నుంచి రాజన్న ఆలయం వరకు మొదటి దశ, అకడి నుంచి పోలీస్ స్టేషన్ వరకు రెండో దశలో 80 అడుగుల మేర విస్తరణ చేయాలని ప్రతిపాదనలను సిద్ధం చేసింది.
ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం రహదారి విస్తరణకు జీ2/77/2024 ద్వారా 06/09/2024న 243 నివాసాలు, దుకాణాలు విస్తరణలో ఎఫెక్ట్ అవుతున్నాయని పేర్కొంటూ ప్రైమరీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తదుపరి వేములవాడ ఆర్డీవో అధ్యక్షతన నిర్వాసితులతో ఒక సమాశం జరిగిందని బాధితులు చెబుతున్నారు. అయితే, సమావేశం ప్రారంభానికి ముందే రిజిస్టర్లో అందరి సంతకాలు తీసుకున్నారని, వాటి ఆధారంగా చేసుకొని.. తాము అన్నింటికీ ఒప్పుకొన్నట్లుగా రాసుకున్నారని బాధితులు ప్రస్తుతం చెబుతున్నారు. సమావేశంలో తాము వ్యక్తం చేసిన పలు అభ్యంతరాలు ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదన్నది బాధితుల మాట. ఇది కొనసాగుతుండగానే.. 21/01/2025న ప్రధాన రహదారి భూ సేకరణపై రెండో నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో రోడ్డు విస్తరణకు సంబంధించి జరిపే భూ సేకరణలో తకువ మొత్తంలో వ్యవసాయేతర, వాణిజ్యపరమైన, నివాసాలు పోతున్నాయని, పూర్తిగా పోవడం లేదని, దీని ద్వారా ఏ వ్యక్తి కూడా జీవనోపాధి కోల్పోవడం లేదని, నిర్వాసితులు కావడం లేదని, కావున భూసేకరణ కింద పునరావాసం, ఉపాధి కల్పన వీరికి వర్తించదని సదరు నోటిఫికేషన్లో పేర్కొన్నది. దీనిని బాధితులు తప్పుబట్టారు.
ఏళ్ల తరబడిగా తమ జీవనోపాధికి అండగా ఉన్న దుకాణాలు పోతున్నాయని, దాదాపు దుకాణాదారులతోపాటు వీటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నవారు సుమారు 2 వేల పైచిలుకు వ్యక్తులు జీవనోపాధి కోల్పోతున్నారని పేర్కొంటూ.. అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నపాలు చేశారు. ఆధారాలతో లిఖిత పూర్వకంగా విన్నవించారు. వాస్తవాలను దాచి.. అధికారులు తప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చారని పేర్కొన్నారు. విషయాలను ఆధారాలతో సహా వివరించడానికి వెళ్తే.. తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ.. గత కొద్ది కాలంగా దుకాణం దారులు పేర్కొంటూ వస్తున్నారు. అయితే, అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో చాలా మంది కోర్టును ఆశ్రయించి స్టేటస్కో తెచ్చుకున్నారు. ఈ స్టేటస్కో.. జూన్ మొదటి వారం వరకు ఉంది. స్టేటస్ కో ఇచ్చినప్పటికీ అధికారులు వాటిని బేఖాతరు చేస్తూ కేవలం నలుగురికి మాత్రమే ఉన్నదని పేర్కొంటూ సర్వే అంచనాలను యథావిధిగా పూర్తి చేశారు.
15 రోజుల్లో ఖాళీ చేయాలని నోటీసుల జారీ
ఒకవైపు కోర్టును ఆశ్రయించిన బాధితులు.. తాము రోడ్డు విస్తరణకు వ్యతిరేకం కాదని, అయితే.. తమకు సరైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బహిరంగ మార్కెట్ విలువను పరిగణలోకి తీసుకొని.. దానికి మూడింతలు అదనంగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటు అధికారులకు, అటు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ, ఇవేవీ వినకుండానే సంబంధిత అధికారులు శనివారం దుకాణాలకు నోటీసులు అతికించారు. 15 రోజుల్లో ఖాళీ చేయాలంటూ సదరు నోటీసుల్లో స్పష్టం చేయడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. హైడ్రా తరహాలోనే తమను బెదిరిస్తున్నారని, అధికారులు తమ మొర ఇప్పటికైనా వినాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా.. పరిహారం, జీవనో పాధి విషయంలో తమకు ఎటువంటి అభయం ఇవ్వకుండానే.. తమపై జులుం చూపించడం ఏమిటన్న వాదనను వినిపిస్తున్నారు. మరోవైపు.. ప్రధాన రహదారి విస్తరణ అంచనా నివేదికలు పూర్తి తప్పుల తడకగా ఉన్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు.
ప్రధానంగా కొలతలు సరిగా వేయలేదని, రెండంతస్తుల భవనం ఉంటే జీ ప్లస్ వన్‌గా చూపించారని. 24 గజాల స్థలం పోతుండగా కేవలం 12 గజాలుగా మాత్రమే చూపిస్తున్నారని, భవనాలను సరిగా అంచనా వేయడం లేదని, అందులోనూ నిర్వాసితుల పేర్లు తండ్రి చోట, భార్యది పడిందని, మరోచోట భర్తనే తండ్రిగా చూపుతూ అనేక తప్పుల తడకల నివేదిక రూపొందించారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని ఆధారాలతో చూపించేందుకు వెళితే.. అధికారులు తమను పట్టించుకోవడం లేదని ‘నమస్తే తెలంగాణ’తో ఆవేదన వ్యక్తం చేశారు. తమ దుకాణాలు, స్థలాలు పట్టణ నడి ఒడ్డులో ఉన్నాయని, బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం చూస్తే గజానికి రూ.లక్ష వరకు ఉందని, దీనికి పరిహారం పెంచి ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తుంటే.. తమ మాట ఏమాత్రం వినకుండా గజానికి రూ.30 వేలు మాత్రమే ఇస్తామంటూ చెబుతున్నారని, అందులోనూ స్పష్టత లేదని బాధితులు పేర్కొంటున్నారు. అయితే, తాము రోడ్డు విస్తరణకు వ్యతిరేకం కాదని, దానికి ముందు తమ విన్నపాలు విని న్యాయం చేయాలని కోరుతున్నారు. అధికారయంత్రాంగం వినకపోతే.. తాము న్యాయస్థానాలను ఆశ్రయించక తప్పదని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయమై వేములవాడ ఇన్చార్జి ఆర్డీవో రాధాబాయి వివరణ కోరేందుకు సంప్రదించగా స్పందించలేదు.
న్యాయ పోరాటం చేస్తాం..
ఏళ్ల తరబడిగా ఈ దుకాణాలను నమ్ముకొని బతుకుతున్నాం. రోడ్డు విస్తరణలో జీవనాధారం మొత్తం పోతుంది. నాతోపాటు వందల కుటుంబాలు ఆధారం కోల్పోతున్నాయి. అయినా.. రోడ్డు విస్తరణను మేం వ్యతిరేకించడం లేదు. సహకరిస్తామని చెపుతున్నాం. అయితే, మార్కెట్ విలువపై మూడింతల పరిహారం అడుగుతున్నాం. అలాగే, జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయం చూపించమని కోరుతున్నాం. మా విన్నపాలను ఏమాత్రం వినకుండానే.. పదిహేను రోజుల్లో ఖాళీ చేయాలంటూ ఆఘమేఘాల మీద నోటీసులు అతికిస్తే.. మా కుటుంబాలు ఏం కావాలో అధికారులే చెప్పాలి. అందుకే.. మాకు న్యాయ పోరాటం తప్ప మరో మార్గం కనిపించడం లేదు.
– పొలాస రాజేశ్వర్
అన్యాయం జరుగుతుంది
మేం రోడ్డు వెడల్పునకు ఏమాత్రం వ్యతిరేకం కాదు. అయితే, మా డిమాండ్ ఏమిటంటే.. మార్కెట్‌కు ధరకు మూడింతల పరిహారం ఇవ్వాలని కోరుతున్నాం. అంతేకాదు.. చాలా మందిమి ఉపాధి కోల్పోతున్నాం. అధికారులు ఈ విషయంలో తప్పు దారిలో వెళ్తున్నారు. మా విజప్తులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. పూర్తి స్థాయిలో మరోసారి అంచనాలు వేయడమేకాకుండా.. పరిహారం పెంచి ఇస్తే.. మాకు మేముగా స్వచ్ఛందంగా సహకరిస్తాం. కానీ, పరిహారం ఇవ్వకుండా, జీవోపాధి కల్పించకుండా అధికారులు ముందుకు వెళ్తున్న తీరు మాకు ఆందోళన కలిగిస్తుంది. తప్పని పరిస్థితుల్లో న్యాయం కోసం మా వంతు ప్రయత్నం చేయక తప్పదు.
– కొమ్మ శంకర్, బాధితుడు