ICDS | కోల్ సిటీ, ఏప్రిల్ 16 : రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు అవినీతి, అక్రమ వసూళ్లపై సమగ్ర దర్యాప్తు జరపాలని పలువురు అంగన్వాడీలు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షను కోరారు. ఈ మేరకు రామగుండం సెక్టార్ పరిధి అంగన్వాడీలు నాగుల మల్యాల స్వర్ణలత, మిన్హాజ్ నౌషిన్, కొండ తిరుమల, కంకణాల వెంకటరమణ, రాజేశ్వరిలు జిల్లా కలెక్టర్ తో పాటు డీడబ్ల్యువోకు లిఖితంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రాజెక్టు సీడీపీవో టీచర్లపై కక్ష సాధిస్తుందని వాపోయారు. ఐసీడీఎస్ ప్రాజెక్టులో ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి, సెలవు మంజూరు చేయాలంటే రూ.5వేలు, బదిలీ కోసం రూ. 50వేలు, పదోన్నతి కోసం రూ.3 లక్షలు, వేసవి కాలంలో హాలీడేస్ కోసం సెంటర్ కు రూ.500, ఫంక్షన్ ఉన్నట్లయితే టీచర్ గానీ హెల్పర్ గానీ బట్టలు ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో మిగిలిన నిల్వ సరుకులను సీడీపీవోనే స్వయంగా వచ్చి తీసుకవెళ్తుంటుందనీ, సీడీపీవో ఇంట్లో పనులకు కూడా ఆయాలు వెళ్లి చేయాల్సిందేనని, వ్యక్తి గత రూల్స్ పాటించని వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతి సెంటర్ నుంచి నెలకు రూ.500 చొప్పున ఇవ్వాల్సిందేనని, ఆ మొత్తంలో కొంత వాటాలుగా చేతులు మారుతున్నాయని ఆరోపించారు. గత ఏడాది ఎర్రోజు వినోద అనే టీచర్ ను ట్రాన్స్ఫర్ కోసం రూ.10వేలు, మిన్హాజ్ అనే టీచర్ వద్ద ట్రాన్స్ ఫర్ కోసం రూ.10వేలు వసూలు చేసిందని ఆరోపించారు. జనగాంకు చెందిన ఆయా స్వరూప పదోన్నతి ఇవ్వడానికి రూ.2.50 లక్షలు లంచంగా తీసుకున్నదని తెలిపారు.
రాంమందిర్ కు చెందిన ఆయా రాధ వద్ద టీచర్ గా పదోన్నతి కోసం రూ.50 వేలు లంచంగా తీసుకుందని ఆరోపించారు. అల్లూరుకు చెందిన ఆయా సఫియా వద్ద టీచర్ గా పదోన్నతి కోసం రూ.3 లక్షలు తీసుకున్నదని, ఇంకా ఎంతోమంది టీచర్లు, ఆయాల వద్ద బదిలీల కోసం లంచాలు వసూలు చేసిందని ఆరోపించారు. తాజాగా స్వర్ణలత అనే టీచర్ పై నిరాధారమైన ఆరోపణలు చేసి అకారణంగా సస్పెన్షన్ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటిపై సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని కోరారు. అలాగే ప్రాజెక్టు డైరెక్టర్, కమిషనర్, విజిలెన్స్ డైరెక్టర్ కు సైతం ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు.