జగిత్యాల, జనవరి 1: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల ముందు రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చాలని సమగ్ర శిక్షా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత నెల 10 నుంచి జిల్లాకేంద్రాల్లో నిరవధిక దీక్షలు చేస్తున్నారు. బుధవారానికి 23 రోజులు కాగా, జగిత్యాలలో కారం మెతుకులు తిని నిరసన తెలిపారు. శిబిరం ఎదుట ముగ్గులు కూడా వేశారు. ఇంటర్మీడియెట్ రిటైర్డ్ ఆర్జేడీ ఎల్ సుహాసిని శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సమగ్ర శిక్షా విభాగంలో దాదాపు 20 వేల మంది ఉద్యోగులు 18 ఏళ్ల నుంచి అరకొర వేతనాలతో పనిచేస్తున్నారని, వారికి హకులు, ప్రయోజనాలు రాకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రసూతి సెలవుల వంటి కనీస సౌకర్యాలు లేకుండా మహిళా ఉపాధ్యాయులను పనిచేయించుకోవడం అత్యంత దారుణమని వాపోయారు. వారిని రెగ్యులరైజ్ చేసి న్యాయం చేసే వరకు వెంట ఉంటానని స్పష్టం చేశారు.