Yoga | పెద్దపల్లి, జూన్17: ప్రతీ రోజు యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని డీఎంహెచ్వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారి అన్నారు. అంతర్జాతీయ యోగా శతాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వ ఆయుర్వేద విభాగం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో యోగ అభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. శారీరక శ్రమ లేకపోవడం వల్ల అసంక్రామిక వ్యాధులు రక్తపోటు, మధుమేహం, ఒబేసిటీ లాంటి వ్యాధులు వస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రతీ ఒక్కరూ జీవన శైలిని మార్చుకొని, ప్రతీ రోజు కొంత సమయం యోగా చేయాలని, తద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం వృద్ధి చెందుతుందన్నారు. యోగాతో శారీరక శ్రమ కలుగుతుందని, మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. యోగాను దిన చర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు వాణీశ్రీ, శ్రీరాములు, కిరణ్, అరుణ, డీపీఎంవో విద్యా సాగర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.