Jagityal | జగిత్యాల, ఏప్రిల్ 6 : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని చారిత్రక గడి బురుజులు, వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామ కంఠం, ఆబాదీ భూములపై అక్రమ కబ్జా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గడి బురుజుల పరిరక్షణ సమితి, అఖిలపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు జగిత్యాల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, గడి బురుజుల చుట్టుపక్కల ఉన్న ఖాళీ భూములను లక్ష్యంగా చేసుకుని కొందరు భూ మాఫియా వ్యక్తులు నకిలీ దస్తావేజులు సృష్టించి, అనుమానాస్పద వీఎల్టీల ఆధారంగా ఆ భూములను వ్యక్తిగత ఆస్తులుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇకనైనా తమరు వాటిని రద్దు చేయాలని కోరగా జిల్లా అదనపు కలెక్టర్ బీ రాజా గౌడ్ కోరుట్ల కమిషనర్‌ను పిలిచి ఏమైనా అనాలోచనలు జరిగినట్లయితే వేంటనే రద్దు చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు డాక్టర్ పేట భాస్కర్, ఎండీ ముజాహిద్, చింత భూమేశ్వర్, ఎండీ ముజీబుర్ రెహమాన్ మాట్లాడుతూ ఇంకా ఈ భూములను ప్లాట్లుగా మార్చి రిజిస్ట్రేషన్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సంబంధిత అధికారులు, వివిధ పార్టీల నాయకులు కోరుట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గడి బురుజులు పట్టణ చరిత్రకు ప్రతీకలని, అవి కబ్జాకు గురైతే భవిష్యత్ తరాలకు అమూల్యమైన వారసత్వం కోల్పోయే ప్రమాదం ఉందని, ఇది ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో గడిబురుజుల ప్రాంతాన్ని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించేలా కూరగాయల మార్కెట్, పార్కు ఏర్పాటు, గడి బురుజులలో ఉన్న మైసమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, కోనేరును పునరుద్ధరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలా కానీ పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని నాయకులు స్పష్టం చేశారు.